- ఉమ్మడి జిల్లాలో కలకలం రేపుతున్న కార్డుల అమ్మకం
- మండల కార్డు, జిల్లా బస్ పాస్ రూ.20వేలు, జిల్లా కార్డు, స్టేట్ బస్ పాస్ రూ.30 వేలు
- బేరసారాలకు దిగిన పెద్ద, చిన్న ప్రతికల జర్నలిస్టులు
- ఎలక్ట్రానిక్ మీడియా, యూట్యూబ్, డిజిటల్ మీడియా కార్డులు హాట్‌కేక్
- ఇంకోవైపు అక్రిడిటేషన్ల్లో కోత విధించడం పైన ఆందోళనలు
- ఫీల్డ్ ఎంక్వైరీ లేకుండా పౌరసమాచార శాఖ కార్డులు జారీ
- వంతపాడుతున్న జిల్లా అక్రిడిటేషన్ కమిటీలు
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: ఉమ్మడి జిల్లాలో జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల అమ్మకం జోరుగా సాగుతోంది. ప్రభుత్వం సడలించిన నిబంధనలు మీడియాకు కాసులు కురిపిస్తున్నాయి. అక్రిడిటేషన్ కార్డుల్లో కోత పెట్టారని, డెస్క్ జర్నలిస్టులకు అన్యాయం జరిగిందని ఓవైపు జర్నలిస్టులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తుంటే మరోవైపు అవే కార్డులను మార్కెట్లో అంగడి సరుకులా అమ్మడం కలవరపాటుకు గురిచేస్తోంది. కొత్త అక్రిడిటేషన్ కార్డుల తంతు మొదలైతే చాలు ఆ పత్రికలకు, చానళ్లకు, డిజిటల్ మీడియాకు కాసుల పండగే. కనీసం నాలుగు లైన్ల వార్త కూడా రాయడం చేతగాని దద్దమ్మలకు, రోడ్ల పైన ఆవారా తిరిగే వాళ్ల జేబుల్లోకి అక్రిడిటేషన్ కార్డులు వెళ్తున్నాయి. అక్రిడిటేషన్ కార్డు చేతికి రావడమే ఆలస్యం పోలీసు మొదలు పుణ్యక్షేత్రాల వరకు వాటినే అడ్డంపెట్టుకుని దందా చేస్తున్న జర్నలిస్టులు ఇటీవల కాలంలో పెరిగిపోయారు. సమాజంలో నాలుగో స్తంబంగా భావించే జర్నలిజం వృత్తిని కొన్ని పత్రికల యాజమాన్యాలు, మీడియా చానళ్లు, సోషల్ మీడియా నెట్ వర్క్‌లు వ్యాపారంగా మార్చేశాయి. కొత్త పేపర్లు, చానళ్లు, డిజిటిల్ మీడియా పర్మిషన్లు తీసుకోవడం స్టేట్‌లో జర్నలిస్టుల సంఘాలను అడ్డంపెట్టుకుని, లక్షల రూపాయాలు లంచాలు పౌరసరఫరాల అధికారులకు ముట్టజెప్పి లైసెన్స్ లు తీసుకుంటున్నారు. ఇలా లైసెన్స్ లు పొందిన పేపర్లు, చానళ్లు, సోషల్ మీడియా అక్రిడిటేషన్లను మార్కెట్లో బేరం పెడుతున్నాయి.

పెద్ద పేపర్లకు కోత… వాళ్లకు మేత
జిల్లా కేంద్రాల్లో ఎడిషన్ సెంటర్లు ఉండవు, మార్కెట్లో పేపర్ కనిపించదు. కానీ పౌరసమాచార శాఖలో మాత్రం పెద్ద పేపర్ల జాబితాలో కనిపిస్తుంది. ఇక మీడియం, స్మాల్ స్కేల్ పేపర్ల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఒకరకంగా చెప్పాలంటే అదో సిండికేట్ దందా. హైదరాబాద్ కేంద్రంగా ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఏదోఒక ప్రింటింగ్ ప్రెస్ లో పేపర్లు ముద్రించడం, వాటిని తీసుకొచ్చి జిల్లా పౌరసమాచార శాఖలో గంపగుత్తగా పడేయడం, వాటిని అడ్డంపెట్టుకుని ప్రభుత్వ యాడ్స్ కోసం పైరవీలు చేయడం, ఇదే అదునుగా ఎవరు ఎక్కువ పైసలు ఇస్తే వాళ్లకే అక్రిడిటేషన్ కార్డులు అమ్మడం జరుగుతోంది. మధ్యలో ఏదైనా తేడా వస్తే వాళ్లను తొలగించి, అవే కార్డులు వేరే వాళ్లకు అమ్మడం ఇలా ఒక్క అక్రిడిటేషన్ కార్డు రెండేళ్ల లో అనేక మంది చేతులు మారుతోంది. దీంతో ఒక్క మండల కార్డు పేరు మీదనే రెండేళ్లలో రూ.50వేలు వసూలు చేస్తున్నారు. యాడ్స్ టార్గెట్ చేయకున్నా, సర్యులేషన్ చందాలు కట్టించలేదనే కారణంతో రిపోర్టర్లను తరచూ మార్చడం ఆ పత్రిక మేనేజ్మెంట్లు ఆనవాయితీగా పెట్టుకున్నాయి. అదే సాక్షి, ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి పెద్ద పత్రికలకు మాత్రం ఈసారి భారీ కోత పడింది. మండలానికి ఒక కార్డు, జిల్లా కేంద్రంలో మూడు కార్డులే ఇవ్వలనే కొత్త నిబంధన చేర్చారు. దీంతో పట్టణ కేంద్రాల్లో పెద్ద పేపర్ల నుంచి 4,5 గురు జర్నలిస్టులు పనిచేస్తుంటే ఇక్కడ ఒక్కటే కార్డు ఇస్తామనే కండీషన్ పెట్టారు. దీనివల్ల పెద్ద పేపర్ల పేరుతో మార్కెట్లో చలామణి అవుతున్న వాటికి పెద్దగా నష్టం లేదు. కానీ రీడబులిటీ, సర్యులేషన్ ఉన్న పేపర్లలో పనిచేస్తున్న ఫుల్‌టైం జర్నలిస్టులకు తీరని అన్యాయం జరుగుతోంది. స్టేట్ లీడర్లు తమ బలాన్ని పెంచుకునేందుకే ఇదంతా చేశారని, అవే సంఘాలు మళ్లీ జిల్లాలో జర్నలిస్టుల తరపున ఆందోళనలు చేయడం మరింత విడ్డూరంగా ఉందని సీనియర్ జర్నలిస్టులు అభిప్రాయపడుతున్నారు.
ఈసారి రేట్లు పెంచిర్రు….
జిల్లాలో అక్రిడిటేషన్లు చివరి సారిగా 2022లో జారీ చేశారు. మళ్లీ ఇన్నాళ్లకు కొత్త కార్డుల ప్రక్రియ మొదలైంది. దీంతో పెద్ద, చిన్న పత్రికలు, డిజిటల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, యూట్యాబ్ చానళ్లు ఇలా జర్నలిజం రూపురేఖలు మారిపోయాయి. ప్రస్తుతం నల్లగొండ జిల్లాలో 750 అక్రిడిటేషన్ కార్డులు ఉన్నాయి. వీటి సంఖ్య ఈసారి మరింత పెరిగే అవకాశం ఉంది. ఒక్క నల్లగొండ జిల్లాలోనే చిన్నపేపర్లు 294 ఉన్నాయి. బిగ్ పేపర్లు 35, మీడియం 15 ఉండగా, తెలుగు 28, ఇంగ్లీషు 14, ఉర్ధూ 6, హిందీ రెండు పేపర్లు ఉన్నాయి. జర్నలిస్టులకు ఇళ్ల జాగలు, హెల్త్ కార్డులు, బ్యూరోలకు, స్టాఫర్లకు రాచమర్యాదలు ఎక్కువయ్యాయి. కార్డులను అడ్డం పెట్టుకుని దసరా మామూళ్లు, ఇల్లీగల్ దందాలు, పోలీస్, సివిల్ సప్లై, ఎక్సైజ్, రెవిన్యూ డిపార్ట్మెంట్లతో కలిసి అక్రమ వ్యవహారాల్లో భాగస్వాములుగా మారుతున్నారు. ఏదైనా తేడా వస్తే జర్నలిస్టు సంఘాలు వెంటనే రోడ్లపైకి రావడం జరుగుతోంది. దీంతో జర్నలిస్టులకు ఆదాయం రెట్టిపైందని, కాబట్టి ఈసారి కార్డులకు ఫుల్గిరాకీ ఉందని చెప్తున్నారు. స్టేట్ బస్ పాస్ కు రూ. 30వేలు, జిల్లా బస్ పాస్ కు రూ.20వేలు ఫిక్స్. ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్లకే అక్రిడిటేషన్ ఇస్తామనే ఆఫర్ ప్రకటించారు. ఎవరికీ ఎలాంటి మినహాయింపులు ఉండవని తెగేసి చెప్తున్నారు. ముఖ్యంగా పెద్ద పత్రికల జాబితాలో ఉన్న పాతకాలం నాటి పేపర్లు, మీడియం, స్మాల్ కేటగిరీలో ఉన్న పేపర్లు అన్ని జిల్లాలో తమకు ఎడిషన్ సెంటర్లు ఉన్నాయని, అన్ని ఏరియాలకు పేపర్ పోతుందని తప్పుడు లెక్కలు చూపించి పొరుగు జిల్లాల్లో కార్డులు అమ్మేస్తున్నారు.
అక్రిడిటేషన్ కమిటీ మొద్దునిద్ర…
జిల్లా అక్రిడిటేషన్ కమిటీకి చైర్మన్ గా కలెక్టర్, కన్వీనర్ గా డీపీఆర్వో(DPRO) వ్యవహారిస్తారు. వివిధ పత్రికల బ్యూరోలు, స్టాఫర్లు, వీడియోగ్రాఫర్లు, ఫోటోగ్రాఫర్లు సభ్యులుగా ఉంటారు. వీళ్ల ఆమోదం మేరకే కార్డులు ఫైనల్ చేస్తారు. అక్రిడిటేషన్‌లో లోటుపాట్లు, మంచిచెడుల గురించి ఆలోచన చేయాల్సిన ఈ కమిటీ మొద్రనిద్ర పోయింది. ఉమ్మడి రాష్ట్రంలో నల్లగొండ కలెక్టర్ రిజ్వీ ఉన్నప్పుడు 2200 కార్డులు ఉండేవి. దాంతో రిజ్వీ సమగ్ర విచారణకు ఆదేశించి బోగస్ కార్డులను తొలగించారు. 2200 కార్డులు కాస్తా వెయ్యికి తగ్గింది. ఇలాంటి ఆపరేషన్ మళ్లీ ఎప్పుడు జరగలేదు. క్షేత్రస్థాయిలో పేపర్, చానళ్ల ఆఫీసులు పనిచేస్తున్నాయా? లేదా? అప్లై చేసుకున్న జర్నలిస్టుల బ్యాక్ గ్రౌండ్ ఎంటి? నిబంధనల మేరకు వాటి పూర్వపరాలను ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత జిల్లా పౌరసరఫరాల శాఖ పైన ఉంది. కానీ గత కొన్నేళ్ల నుంచి ఆ శాఖ పనిచేయడం మానేసింది. కేవలం కలెక్టర్లు, వీఐపీలు, ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉండటంతో మార్కెట్లో బోగస్ జర్నలిస్టులు, అక్రిడిటేషన్ కార్డుల అమ్మకాలు పెరిగిపోయయి. త్వరలో ఏర్పడే కొత్త కమిటీ సభ్యుల్లో అప్పుడే లుకలుకలు మొదలయ్యాయి. కమిటీ సభ్యులుగా రెడ్లనే నియమిస్తున్నారని, రాష్ట్రం నుంచి జిల్లా వరకు సంఘాల లీడర్లు, కమిటీల మెంబర్లు రెడ్లు కావడంతో కార్డుల అమ్మకాలను ఎలా నియంత్రిస్తారనేది వేచిచూడాల్సిందే.