Breaking News: కోట్ల రూపాయల కట్నం కోసం ప్రభుత్వ ఉద్యోగం పేరిట మోసం.. ఫ్రీ వెడ్డింగ్ షూట్ నెపంతో యువతికి నరకం

హైదరాబాద్/నల్గొండ, ఏపీబీ న్యూస్: ప్రభుత్వ ఉద్యోగం ఉందంటే చాలు.. గుడ్డిగా నమ్మేసి లక్షలాది రూపాయల కట్నం ఇచ్చేందుకు సిద్ధపడే అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఒక వ్యక్తి భారీ మోసానికి తెరలేపాడు. నల్గొండ జిల్లా మాడ్గులపల్లి మండలం చెరువుపల్లి గ్రామానికి చెందిన పనస మధు అనే వ్యక్తి, తన హైటెక్ మోసంతో నిశ్చితార్థం వరకు వెళ్లి చివరకు కటకటాలపాలయ్యాడు.

నిందితుడు పనస మధు, తాను చెర్లపల్లిలోని ఎఫ్.సి.ఐ (FCI)లో గ్రేడ్-3 టెక్నికల్ మేనేజర్గా పనిచేస్తున్నానని నమ్మబలికాడు. తన మాటలకు బలం చేకూర్చేలా నకిలీ ఐడీ కార్డులు సృష్టించి, తన కారుపై “On Govt Duty” అని స్టిక్కర్ వేయించుకుని చలామణి అయ్యాడు. ఈ ముసుగులో ఒక యువతి కుటుంబంతో పరిచయం పెంచుకున్నాడు.

తన హోదాను చూపి పెళ్లి కోసం మొదట రూ. 2 కోట్లు కట్నంగా డిమాండ్ చేశాడు. చివరకు బాధితురాలి కుటుంబం రూ. 1.5 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ క్రమంలోనే ఘనంగా నిశ్చితార్థం కూడా జరుపుకున్నారు.

నిశ్చితార్థం తర్వాత “ఫ్రీ వెడ్డింగ్ షూట్” పేరుతో యువతిని తన గదికి పిలిపించుకున్నాడు. అక్కడ ఆమెపై లేనిపోని అనుమానాలు వ్యక్తం చేస్తూ, వేధింపులకు గురిచేశాడు. అతని ప్రవర్తనపై అనుమానం వచ్చిన యువతి, రహస్యంగా విచారణ జరపగా.. అతను ఎఫ్.సి.ఐ ఉద్యోగి కాదని, అంతా ఒక నకిలీ డ్రామా అని తేలింది.

బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన చైతన్యపురి పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి:

  • రెండు నకిలీ FCI ID కార్డులు
  • ఒక మొబైల్ ఫోన్
  • ప్రభుత్వ ముద్ర ఉన్న కారును స్వాధీనం చేసుకున్నారు.

నిందితుడిని విచారించిన అనంతరం పోలీసులు రిమాండ్కు తరలించారు.

పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు కేవలం ఐడీ కార్డులు, కారు స్టిక్కర్లు చూసి నమ్మవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సంబంధిత కార్యాలయాల్లో ఆ వ్యక్తి నిజంగా పనిచేస్తున్నాడా? లేదా? అనేది క్షుణ్ణంగా విచారించిన తర్వాతే ఆర్థిక లావాదేవీలు జరపాలి. ఒక్క చిన్న అప్రమత్తత లక్షలాది రూపాయల సొమ్ముతో పాటు జీవితాన్ని కూడా కాపాడుతుంది.

Share
Share