APB News Exclusive: ఒడువని తుంగతుర్తి కాంగ్రెస్ లొల్లి..

  • కొలిక్కిరానీ నియోజకవర్గ పార్టీ కమిటీల నియామకం
  • ఎమ్మెల్యే సామేలు చర్యలకు వ్యతిరేకంగా పీసీసీకి ఫిర్యాదు
  • బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి ఎమ్మెల్యే ప్రియార్టీ
  • కాంగ్రెస్ సీనియర్లకే కమిటీల్లో ప్రియార్టీ ఇవ్వాలని డీసీసీ పట్టు
  • పార్టీలో ఒంటరిగా మారిన ఎమ్మెల్యే
  • మంత్రి ఉత్తమ్ వద్ద తేల్చుకోవాలన్న పీసీసీ
  • గాంధీభవన్లో వాడీవేడీగా సాగిన చర్చ

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ లొల్లి ఇక ఒడువదని అధిష్టానం సైతం చేతులెత్తేసింది. సామేలు ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి మొదలైన గొడవలు ముదిరిపోతున్నాయే తప్పా వాటి వేడి మాత్రం తగ్గడం లేదు. సీఎం రేవంత్ రెడ్డి సైతం తిరుమలగిరి రేషన్ కార్డుల బహిరంగ సభలో సామేలుకు చురకలు అంటించినప్పటికీ అతని వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదు. నియోజకవర్గంలో ఎలాంటి సమస్య తలెత్తినా మంత్రి ఉత్తమ్, ఎంపీ కిరణ్ చూసుకుంటారని సీఎం భరోసా ఇచ్చిన సంగతి తెలిసిందే, కానీ ఇటు ఎమ్మెల్యేకు, అటు మాజీ మంత్రి దామోదర్ రెడ్డి వర్గానికి నచ్చచెప్పడం తలకు మించిన భారంగా మారింది. ఇటీవల సీఎం రేవంత్ సమక్షంలో జిల్లా ఎమ్మెల్యేలు భేటీ అయిన సందర్భంలో కూడా సామేలకు సున్నితమైన హెచ్చరిక చేశారు. వైఖరి మార్చుకోకపోతే రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని సామేల్ ను హెచ్చరించినట్టు తెలిసింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి సహకారంతో ఎమ్మెల్యేగా గెలిచిన సామేలు ప్రవర్తన పూర్తిగా మారిపోవడంతో ఇంటా, బయట సామేలు వివాదస్పదంగా మారారు.

ఉమ్మడి జిల్లాలో ఎప్పుడో మండల, బ్లాక్, బూత్ లెవల్ పార్టీ కమిటీల ప్రకటన జరిగిపోయింది, కానీ తుంగతుర్తిలో మాత్రం పార్టీల లీడర్ల మధ్య గొడవలు జరుగుతుండటంతో అధిష్టానం సైతం ఎటూ తేల్చలేక పోతోంది. శుక్రవారం గాంధీ భవన్ లో పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమా ర్ గౌడ్ సమక్షంలోనే ఇరువర్గాలు ఘర్షణ పడటంతో పరిస్థితి మరింత అదుపు తప్పింది.

మండల పార్టీ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా ఏళ్ల తరబడి పార్టీకి సేవ చేస్తున్న సీనియర్లను కాదని సామేల్ తో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన కేడర్ కు ప్రియార్టీ ఇచ్చారు. దాంతో మాజీ మంత్రి దామోదర్ రెడ్డి వర్గం, డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య వర్గీయులు తిరుగుబాటు చేశారు. నియోజకవర్గ కమిటీల జాబితా డీసీసీ ఆమోదం మేరకు పార్టీ హైకమాండ్ కు పంపాలి, కానీ ఎమ్మెల్యే సొంతంగా తనకు అనుకూలమైన కేడర్ తో లిస్ట్ ప్రిపేర్ చేసి, పార్టీకి పంపారు. డీసీసీ ప్రెసిడెంట్ నర్సయ్య సొంత నియోజకవర్గం తుంగతుర్తి మండలం వెలుగుపల్లి కాగా కనీసం ఆయనతో చర్చించకుండా ఎమ్మెల్యే ఏకపక్షంగా వ్యవహారించడం పట్ల పార్టీ కేడర్ జీర్ణించుకోలేక పోయింది. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సొంత మండలం శాలిగౌరారం కాగా, సీఎం సూచన మేరకు ఎమ్మెల్యే అసలు ఎంపీతో కూడా చర్చ చేయలేదు. దీంతో గాంధీ భవన్ లో ఎమ్మెల్యే సామేలు, ఎంపీ చామల, డీసీసీ ప్రెసిడెంట్ గుడిపాటి నర్సయ్యతో పార్టీ అధ్యక్షుడు చర్చించారు. గత రెండేళ్లలో ఎమ్మెల్యే పెడుతున్న ఇబ్బందుల గురించి నేరుగా పీసీసీ ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. పార్టీలో కోవర్టులు కూడా తయారయ్యారని, ఇటీవల తిరుమలగిరి మున్సిపాలిటీ ఓడిపోవడానికి కోవర్డులే కారకులని మండిపడ్డారు. గత ముప్పై, నలబై ఏళ్ల నుంచి పార్టీనే నమ్ముకుని, ఆస్తులు పోగొట్టకుని, కేసుల పాలైన వారి శ్రమను గుర్తించకుండా ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి వలసొచ్చిన లీడర్లకు పార్టీ బాధ్యతలు అప్పగించడం కరెక్ట్ కాదని హెచ్చరించారు. ఎమ్మెల్యే వెంట వచ్చినోళ్లు మళ్లీ  ఆయన వెంటే భవిష్యత్తులో పార్టీ మారితే మా సంగతి ఎవరు పట్టించుకోవాలని నియోజకవర్గ సీనియర్లు గాంధీ భవన్ లో గట్టిగానే వాధించినట్టు తెలిసింది.

కమిటీల పంచాయితీని గాంధీభవన్ కూడా తేల్చలేకపోయింది. దీంతో జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికే బాధ్యత అప్పగించింది. మొదటి నుంచి తుంగతుర్తి పైన ఆసక్తి చూపిస్తున్న ఉత్తమ్ కే కమిటీ నియామకం లొల్లిని పరిష్కరించాలని పీసీసీ కోరింది. నియోజవకర్గ పార్టీ లీడర్లు సైతం ఉత్తమ్ పెద్దన్న పాత్ర పోషించక తప్పదని అంటున్నారు. నియోజకవర్గాల పున:ర్విభజనలో భాగంగా తుంగతుర్తి జనరల్ కు మారితే ఉత్తమ్ ఇక్కడి నుంచి పోటీ చేసే ఛాన్స్ ఉందని, ఆయన సొంత ఊరు తిరుమలగిరి మండలం తాటిపామల కాబట్టి దామోదర్ రెడ్డి ఉన్నప్పటి నుంచే తుంగుతర్తి పైన ఉత్తమ్ ఆసక్తిచూపిస్తున్నందున ఇక నుంచి ఈ నియోజకవర్గ బాధ్యతలు ఆయనకే అప్పగించినట్టు తెలుస్తోంది. ఉత్తమ్ లేదంటే ఆయన భార్య పద్మావతి తుంగతుర్తి నుంచి పోటీ చేయోచ్చని కూడా స్థానిక నాయకులు అభిప్రాయ పడుతున్నారు.

రాజకీయ జీవితం ఫుల్స్టాప్ పడుతుందనే క్రమంలో మందుల సామేలకు కాంగ్రెస్ రూపంలో అదృష్టం తలుపు తట్టింది. కోమటిరెడ్డి బ్రదర్స్ సపోర్ట్తో సామేలు భారీ మెజార్టీతో విజయం సాధించారు. జేబులో రూ.50లు లేకున్నా సామేల్ ను కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిందని సీఎం రేవంత్ సైతం తిరుమలగిరి సభలో ప్రస్తావించారు, కానీ తుంగతుర్తి నియోజకవర్గం పేరు ఎస్సీ రిజర్వు కానీ ఇక్కడ పెద్ద తలకాయిలదే పెత్తనం. తుంగతుర్తిని కాంగ్రెస్ కంచుకోటగా మార్చిన మాజీ మంత్రి దామోదర్ రెడ్డి బాటలోనే ఇక్కడి పార్టీ కేడర్ బలంగా పాతుకుపోయింది. ఇదే నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయిన గుడిపాటి నర్సయ్య ప్రస్తుతం డీసీసీ ప్రెసిడెంట్ గ ఉన్నారు. శాలిగౌరారం మండలానికి చెందిన కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీగా ఉన్నారు. పక్కనే ఉన్న ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య మండలాలు అడ్డగూడూరు, మోత్కూరు యాదాద్రి జిల్లా పరిధిలోకి వస్తాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి పుట్టిపెరిగిన నియోజకవర్గం. దామన్న బతికి ఉన్నంత వరకు వేలెత్తి చూపిన లీడర్లు అందరూ ఇప్పుడు సామేలు ఎమ్మెల్యే కాగానే టార్గెట్ చేశారు. పక్కనే ఉన్న నకిరేకల్, మిర్యాలగూడ, ఆలేరు ఎమ్మెల్యేలు తమ అనుచరులకే పార్టీ పదవులతో పాటు, ఎన్నికల్లో పోటీకి ప్రియార్టీ ఇస్తున్నారు. నకిరేకల్, మిర్యాలగూడలో కాంగ్రెస్ కేడర్ కు ఇవ్వనంత ప్రియార్టీ బీఆర్ఎస్ నుంచి వలసొచ్చిన లీడర్లు, తమ అనుచరులకే పెద్దపీట వేస్తున్నారు. ఇక్కడా అంతర్గతంగా గొడవలు ఉన్నప్పటికీ బయట పడట్లేదు. కానీ సామేలు కాంగ్రెస్ లో ఒంటరి కావడమే గాక, అతని ప్రవర్తనను సీనియర్లు చులకనగా చూస్తున్నారు.

Share
Share