- తమ్ముడు రాజగోపాల్ కు మంత్రి పదవి ఇస్తే ‘అన్న’కు గండం
- వెంకన్న మంత్రి పదవి పైన లేనిపోని ఊహాగానాలు
- నల్గొండ కేడర్ ను గందరగోళం చేస్తున్న సొంత పార్టీ నేతలు
- సోషల్ మీడియాలో, న్యూస్ ఛానళ్ల లో పనిగట్టుకొని ప్రచారం
- ఖమ్మంలో ముగ్గురు మంత్రులు.. ఇక్కడ మాత్రం బ్రదర్స్ టార్గెట్
- వెంకన్న మంత్రి పదవి ఊడితే జిల్లా అభివృద్ధి అగినట్టే
- మళ్ళీ పదేళ్ళు వెనక్కి పోతుందంటున్న పార్టీ సీనియర్లు
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవినే త్యాగం చేసిన సీనియర్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురించి నల్లగొండ జిల్లాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తే అన్న పదవికి గండం పొంచి ఉందనే సంకేతాలు తెగ వైరల్ అవుతున్నాయి. నల్లగొండలోని సొంత పార్టీ నేతలే వెంకన్న మంత్రి పదవి గురించి లేనిపోని ఊహాగానాలు సృష్టిస్తున్నారు. రాజగోపాల్ తన మంత్రి పదవి గురించి ఎక్కడైనా ప్రస్తావిస్తే చాలు క్షణం ఆలస్యం లేకుండా అన్న వెంకటరెడ్డిని టార్గెట్ చేయడం కామన్ గా మారింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండగా, నల్లగొండ జిల్లాలో బ్రదర్స్ నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. నిజానికి రాజగో పాల్ కు హైకమాండ్ హామీ ఇచ్చిన సంగతి అన్నకు తెల్వదు. మరీ అలాంటప్పుడు వెంకటరెడ్డిని మంత్రి పదవి నుంచి ఎందుకు తొలగిస్తారు? అనే వాధన కూడా వినిపిస్తోంది. కుటుంబంలో ఒక్కరికే మంత్రి పదవి ఇస్తామనే కండీషన్ రాజగోపాల్ కు హామీ ఇచ్చేటప్పుడు గుర్తులేదా? అని వాధిస్తున్నారు.

ఏ నలుగురు కలిసినా అదే చర్చ…
నల్లగొండలో ఏ నలుగురు కలిసినా మంత్రి వెంకటరెడ్డి పదవి గురించే చర్చించుకుంటున్నారు. బ్రదర్స్ కారణంగా దేవరకొండ ఎమ్మెల్యే బాలూ నాయక్ కూడా కేబినెట్ లో చోటు దక్కడం లేదని మరోవర్గం చర్చించుకుంటోంది. వెంకటరెడ్డి పదవి తొలగించకుండా, రాజగోపాల్ కు మంత్రి పదవి ఇస్తే ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు అవుతారని, దాంతోనే రాజగోపాల్ వ్యవహారం తేలేవరకు బాలూనాయక్ ను పెండింగ్ లో పెట్టినట్టు తెలుస్తోంది. ఇంకోవైపు నల్లగొండలోని సొంత పార్టీ నేతలే వెంకటరెడ్డి పదవి గురించి లీకులు ఇవ్వడం, దానికి లేనిపోని అపోహలు సృష్టించి సోషల్ మీడియాలో మంత్రికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. రాజగోపాల్ కు మంత్రి పదవి దాదాపు ఖాయమైందని, ఢిల్లీ నుంచి సమాచారం ఉందని, రేపో మాపో వెంకటరెడ్డి పదవి ఊడిపోవడం ఖాయమని పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం క్లాక్ సెంటర్ వద్ద ఆమరణ దీక్ష చేసిన వెంకటరెడ్డి పార్టీకి వ్యతిరేకంగా మంత్రి పదవినే తృణప్రాయంగా వదిలేశారు. రాష్ట్రంలో విశేష ప్రజాధరణ కలిగిన వెంకటరెడ్డిని మంత్రి పదవి నుంచి తొలగిస్తే నల్లగొండ జిల్లాకు అపార నష్టమని పార్టీ సీనియర్లు హెచ్చరిస్తున్నారు.
పార్టీ కేడర్ లో గందరగోళం…
మంత్రి వెంకటరెడ్డి పైన జిల్లా కాంగ్రెస్ పార్టీ, నల్లగొండలోని పార్టీ కేడర్ గంపెడాశలు పెట్టుకుంది. సూర్యాపేట జిల్లాలో సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అభివృద్ధిలో ముందున్నారు. అంతే స్పీడ్ తో వెంకటరెడ్డి నల్లగొండను డెవలప్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వెంకటరెడ్డిని తప్పిస్తే ఆయన్నే నమ్ముకున్న పార్టీ అనుచరులు నిరుత్సాహానికి లోనవుతారు. మళ్లీ నల్లగొండ అభివృద్ధి పదేళ్లు వెనక్కిపోతుంది. నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న లీడర్లు ఎప్పటికైనా వెంకటరెడ్డి కనికరించకపోతడా? అని ఎదురు చూస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో మళ్లీ వెంకన్న జనంలోకి వచ్చిండనే అభిప్రాయం బలంగా పాతుకుపోయింది. ఈ పరిస్థితుల్లో మంత్రి పదవికి ఎసరు పెడితే పార్టీ డేంజర్ లో పడ్తదని, వెంకటరెడ్డినే నమ్ముకున్న ఆశావహులు నిరుత్సాహాంతో నీరు గారిపోయే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
రెండేళ్లలో 3వేల కోట్లతో అభివృద్ధి…
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యానికి గురైన నల్లగొండ నియోజకవర్గాన్ని మంత్రి వెంకటరెడ్డి మూడు వేల కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. కేవలం రెండున్నరేళ్లలో ఇన్ని వేల కోట్ల నిధులు రావడం చరిత్రలో ఎన్నడూ జరగలేదని, ఊహించని రీతిలో నల్లగొండ రూపురేఖలు మారుతున్నాయనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా రూ.500కోట్లతో బైపాస్ రోడ్డు, రూ.150 కోట్లతో లతీఫ్సాబ్ ఘాట్ రోడ్డు, తిప్పర్తి, కనగల్, నల్లగొండ రూరల్ మండలాల్లో వెయ్యి కోట్లతో లిఫ్ట్ స్కీంలు, రోడ్ల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అంతేగాక ఎస్ఎల్బీసీ(SLBC) ప్రధాన కాలువ వెడల్పు కొరకు రూ.400 కోట్లు, ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం పునరుద్ధరణ పనులు, బ్రహ్మణ వెల్లంల రిజర్వాయర్ పనుల్లో కదలిక వచ్చిందని, ఎంజీ యూనివర్సిటీలో కొత్త కోర్సులు, న్యాక్, సెట్విన్ కోర్సులు, వాటి కోసం కొత్త బిల్డింగ్ ల నిర్మాణం చేపట్టారు.