- సిట్టింగ్ ఇన్చార్జిలకు ప్రత్యామ్నయంగా.. కొత్త అభ్యర్థుల పైన హైకమాండ్ కసరత్తు
- ఉమ్మడి జిల్లాలో పలు నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు గురించి ఊహాగానాలు
- ఆర్ధికంగా, సామాజికంగా కలిసొచ్చేలా ఎంపిక ప్రక్రియ
- వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా భారీ మార్పులు
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: ఉమ్మడి జిల్లాలో కారు పార్టీకి రిపేరు జరుగుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా జిల్లాలో బీఆర్ఎస్ కు మళ్లీ పూర్వవైభవం తెచ్చేందుకు హైకమాండ్ ముమ్మర కసరత్తు చేస్తోంది. ప్రస్తుత సిట్టింగ్ ఇన్చార్జిలకు ప్రత్యామ్నయంగా కొత్త మొఖాలను తెరపైకి తెచ్చేందుకు ఎంపిక ప్రక్రియ చేపట్టింది. ముఖ్యంగా ఆరు నియోజకవర్గాల్లో భారీ మార్పులు ఉండొచ్చనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. కేసీఆర్ చరిష్మాపైనే ఆధారపడి గెలుస్తామనే ధీమా ఒక్కటే కాకుండా ఆర్ధిక, సామాజిక సమీకరణాలను సైతం పరిగణలోకి తీసుకుని అభ్యర్థులను సెలక్ట్ చేయాలని హైకమాండ్ భావిస్తోంది. అధికారం కోల్పోయి రెండున్నరేళ్లు అయినప్పటికీ మాజీ ఎమ్మెల్యేల వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదు, అంతకంతకు ప్రజాధరణ కోల్పోతున్నారే తప్పా పార్టీ ప్రతిష్టను పెంచలేకపోతున్నారని హైకమాండ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఇటీవల జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలే అందుకు నిదర్శమని, నియోజకవర్గాల్లో అందివచ్చిన అవకాశాలను సైతం సద్వినియోగం చేసుకోవడంలో మాజీ ఎమ్మెల్యేలు విఫలమయ్యారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గట్టిగానే మందలించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో పార్టీ బతికి బట్టకట్టాలంటే ప్రత్యామ్నయ నాయకత్వం అవసరమని హైకమాండ్ బలంగా నమ్ముతోంది. దీంతోనే జిల్లాలో కొత్త మొఖాల పేర్లను పరిశీలిస్తోంది. వీళ్లలో కొందరని ఇప్పటికే ప్రజలతో మమేకం కావాలనే సంకేతాలు కూడా ఇచ్చినట్టు తెలిసింది.
ఆలేరు నుంచే ఆపరేషన్ షురూ…
కారు పార్టీని రిపేరు చేసే కార్యక్రమం ఆలేరు నుంచే మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. గౌడ సామాజిక వర్గం బలంగా ఉన్న జిల్లాలో ఆవర్గం నుంచి బలమైన నాయకుడు బీఆర్ఎస్ లో కనిపించడం లేదు. యాదవులకు కోదాడ, నాగార్జునసాగర్‌లో అవకాశం కల్పించారు. మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ పార్టీ నుంచి వెళ్లిపోవడంతో మళ్లీ అంతటి ప్రజాదరణ కలిగిన లీడర్లు పార్టీలో లేకపోవడం అది పెద్ద మైనస్ అని గుర్తించిన పార్టీ ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ ను ప్రోత్సహిస్తోంది. ఆలేరు లో కాంగ్రెస్ బీసీ ఆపరేషన్ వర్క్‌వుట్ అయ్యింది. ఇప్పుడున్న ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యకు కౌంటర్‌గా బూడిద భిక్షమయ్యను నిలబెడితే బీసీల మద్ధతు బీఆర్ఎస్ కు లభిస్తదని అంచనా వేస్తోంది.
భువనగిరిలో ‘చింత’లకు ఎంట్రీ…
భువనగిరి మాజీ ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ లో చేరేందుకు తీవ్రంగానే ప్రయత్నించారు. భువనగిరి ఎంపీ టికెట్ ఆశించిన ఫైళ్ల కాంగ్రెస్ నేతలతో తెరవెనక సంప్రదింపులు జరిపినట్టు కేసీఆర్ కు రిపోర్ట్ వెళ్లింది. దాంతో అప్పటి నుంచి శేఖర్ రెడ్డి ని దూరం పెట్టారు. ఆయనకు బదులుగా బలమైన లీడర్ ను భువనగిరిలో సిద్ధం చేయాలని జిల్లా ముఖ్యనేతలకు సూచించినట్టు తెలిసింది. దీంతో చింతల వెంకటేశ్వ రెడ్డి భువనగిరిలో క్రియాశీలకంగా మారారు. ఒకవేళ అవసరమైతే పైళ్లను ఆలేరుకు షిప్ట్ చేయాలనే ఆలోచన ఉంది.
నాగార్జునసాగర్ రెడ్లకే …
నాగార్జునసాగర్ లో పార్టీకి రెడ్డి నాయకత్వమే బలమని హైకమాండ్ విశ్వసిస్తోంది. తండ్రి నోముల నర్సింహయ్య మరణంతో ఎమ్మెల్యేగా గెలిచిన నోముల భగత్ సాగర్ రాజకీయాల్లో రాణించలేకపోతున్నారని గ్రహించి మార్పు అనివార్యమని డిసైడ్ అయ్యింది. ఇటీవల జరిగిన మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోయింది. రెండు మున్సిపాలిటీలు కచ్చితంగా గెలుస్తామనే పార్టీని నమ్మించి రెండు కోట్లు పార్టీ ఫండ్ తీసుకొస్తే రెండు చోట్ల గెలిచింది కేవలం రెండు కౌన్సిలర్ సీట్లే. ఇది భగత్ కు మరింత కోలుకోలేని దెబ్బ తగిలినట్లైంది. దాంతో భగత్ కు ప్రత్యామ్నయం ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి అని పార్టీ గుర్తిస్తోంది. అదీగాక జానారెడ్డి కొడుకులను ఎదుర్కొనే సత్తా మళ్లీ అదే వర్గం లీడర్లనే పోటీగా నిలబెడితే తప్పా సాగర్ లో కారు పరిగెత్తడం కష్టమనే అభిప్రాయానికి వచ్చింది. బీసీ ఓటర్లు బలంగా ఉన్న సాగర్ లో భగత్ కేవలం యాదవ సామాజిక వర్గానికే పరిమితం కావడం కూడా పార్టీకి మైనస్ అయ్యింది.
హుజూర్నగర్ లో బిగ్‌షాట్…
మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి తిరిగి పార్టీలోకి వచ్చేందుకు గట్టిగానే ప్రయత్నించారు. కానీ కేసీఆర్ ఒప్పుకోలేదని తెలిసింది. హుజూర్నగర్ లో పార్టీకి వెన్నుపోటు పొడిచి బీజేపీలో చేరినప్పటి నుంచి అధిష్టానం కోపంతోనే ఉంది. మున్సిపల్ ఎన్నికలకు ముందు సైదిరెడ్డిని పార్టీలోకి రప్పించేందుకు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఫైళ్ల శేఖర్ రెడ్డిలు రాయభారం నడిపినట్టు తెలిసింది, కానీ కేసీఆర్ కొత్త వాళ్లనే ప్రోత్సహించాలనే పట్టుదలతో ఉన్నారు. మంత్రి ఉత్తమ్ ను ఎదుర్కోవడం హుజూర్నగర్ లో కష్టమని, ఎవరైనా బిగ్‌షాట్ ముందుకొస్తే వాళ్లను ఎమ్మెల్యేగా ఎంకరేజ్ చేయాలని జిల్లా ముఖ్యులకు సూచించినట్టు సమాచారం. గతంలో సైది రెడ్డికి వ్యతిరేకంగా పనిచేసిన జిన్నారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఎన్ఆర్ఐ(NRI) ధీరజ్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ప్రస్తుతం వీళ్లు కాంగ్రెస్ లో ఉన్నారు.
కోదాడలో వలస నేతలు…
కోదాడ, హుజూర్నగర్ లో బీఆర్ఎస్ గెలుపు అంత సులువుకాదని, అందుకోసం బలమైన లీడర్లను బరిలో దింపేందుకు హైకమాండ్ సెర్చ్ చేస్తోంది. గత 25 ఏళ్ల నుంచి మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కోదాడ క్రియాశీలక రాజకీయాల్లో రాణిస్తున్నారు. కానీ మాజీ మంత్రి జగదీష్ రెడ్డితో ఉన్న విభేదాలు ఆయనకు ఇబ్బందికరంగా మారాయి. అధికారం కోల్పాయాక కోదాడలో పార్టీ మరింత బలహీన పడ్డదని, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ఘోరమైన ఎదురుదెబ్బ తగలిందని, చివరకు మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టలేని పరిస్థితికి దిగజారిందని పార్టీ ముఖ్యులతో కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. కోదాడలో మర్ల రాజేష్ మృతిని రాజకీయంగా వాడుకోలేకపోయామని, కేటీఆర్ మందలించిన తర్వాతే రాజేష్ ఇష్యూను తీవ్రతరం చేశారని, కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని హైకమాండ్ మండిపడింది. ఈ నేపథ్యంలో పద్మావతికి పోటీగా కోదాడకు వలస నేతలను పంపిస్తే ఎలా ఉంటుందనే కోణంలో పలువురు పేర్లను పరిశీలిస్తోంది. ఎప్పటి నుంచో ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న జడ్పీ మాజీ చైర్మన్ గుజ్జ దీపిక భర్త యుగంధర్‌రావు (వెలమ) పేరు కోదాడ జాబితాలో ఉన్నట్టు తెలిసింది.
కాంగ్రెస్, బీఆర్ఎస్ లో సెకండ్ కేడర్ కు గాలం…
నల్లగొండ, దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలకు ప్రత్యామ్నయంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలో బలమైన సెకండ్ కేడర్ పేర్లను కూడా బీఆర్ఎస్ పరిశీలిస్తోంది. ఇందులో భాగంగానే ఆయా నియోజకవర్గాల్లో ఆర్ధికంగా, ప్రజాధరణ కలిగిన కాంగ్రెస్ లీడర్లను బీఆర్ఎస్ లోకి ఆహ్వానించేందుకు కూడా సిద్ధమవుతోంది. నల్లగొండలో ఒకప్పుడు బీఆర్ఎస్ లో చక్రం తిప్పిన దుబ్బాక నర్సింహారెడ్డి, బీజేపీలో పనిచేస్తున్న పిల్లి రామరాజు యాదవ్ తో పాటు, మంత్రి కోమటిరెడ్డికి అత్యంత సన్నిహితంగా మెలిగే ముగ్గురు ముఖ్యమైన లీడర్ల పేర్లు కూడా బీఆర్ఎస్ జాబితా లో ఉండటం గమనార్హం. సూర్యాపేటకు చెందిన పటేల్ రమేష్ రెడ్డి, దేవరకొండ మున్సిపల్ మాజీ చైర్మన్ వడ్త్యా దేవేందర్ నాయక్, మునుగోడులో మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, కంచర్ల భూపాల్ రెడ్డి అన్న కంచర్ల కృష్ణారెడ్డి మరికొంత లీడర్ల పేర్లతో హైకమాండ్ ఫీడ్‌బ్యాక్ తీసుకుంటోంది.