- రూ.50 కోట్ల కోసం రూ.2వేల కోట్ల ఆస్తులు పరాధీనం
- మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి రాజకీయానికి భీజం వేసిన మధర్ డెయిరీ
- 8 ఏళ్లపాటు డెయిరీ చైర్మన్‌గా అపార అనుభవం
- కష్టకాలంలో అంతుచిక్కని మండలి చైర్మన్ మౌనం
- పెంచిపోషించిన నార్మాక్స్ కళ్లముందే కనుమరుగు
- ఎన్డీడీబీ(NDDB) తో 20 ఏళ్ల ఒప్పందానికి అడుగులు
- ఇక డెయిరీ ఆస్తులు, పాల వ్యాపారం పైన ఎన్డీడీబీదే పెత్తనం
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సుధీర్ఘ రాజకీయ ప్రస్థానానికి భీజం వేసిన నల్లగొండ – రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహాకార సంఘం కళ్ల ముందే పతనమవుతోంది. సుఖేందర్ రెడ్డి సుమారు 8 ఏళ్ల పాటు పెంచి, పోషించిన నార్మాక్స్ మధర్ డెయిరీ పైన మళ్లీ ఎన్డీడీబీ (NDDB) ఆధిపత్యం చలాయించేందుకు వేగంగా పావులు కదుపుతున్నారు. డెయిరీ బాగోగులు, పాడి రైతుల శ్రేయస్సును పణంగా పెట్టి కేవలం రాజకీయ ప్రయోజనాలను ఆశించి ఇంత జరుగుతున్నా గుత్తా మాత్రం మౌనంగానే ఉండిపోయారు. ఆయన కొడుకు తెలంగాణ డెయిరీ డెవలప్మెంట్ చైర్మన్ అమిత్ రెడ్డి సమన్వయకర్తగా వ్యవహారిస్తున్న ఈ ఆపరేషన్‌లో సుఖేందర్ రెడ్డి మౌనంగా ఉండటం అనేక ప్రశ్నలకు తావిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డితో ఉన్న కుటుంబ సాన్నిహిత్యం డెయిరీ బాగుకోసం కొంచెం ఉపయోగిస్తే బాగుటుందని సహకార సంఘాలు కోరుతున్నాయి. కేవలం రూ. 50కోట్ల అప్పులు తీర్చేందుకు సుఖేందర్ రెడ్డి, ఆయన తమ్ముడు జితేందర్ రెడ్డి కూడపెట్టిన రూ. 2వేల కోట్లు ఆస్తులు కళ్ల ఎదుటే ఎన్డీడీబీకి దారాదత్తం చేస్తున్నా ప్రేక్షకపాత్ర వహించడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
రెండేళ్ల పదవి కోసం రెండు వేల కోట్లు సమర్పణ
కేవలం పాలకవర్గం తమ పదవులు కాపాడుకునేందుకు డెయిరీని దారాదాత్తం చేయాలని డిసైడయ్యింది. రెండేళ్ల చైర్మన్, డైరక్టర్ల పదవుల కోసం రెండు వేల కోట్ల ఆస్తులను ఎన్డీడీబీకి అప్పగించేందుకు సిద్ధమైంది. రైతులు, బ్యాంకు అప్పులు తీర్చకపోతే పాలకవర్గం రాజీనామా చేయాల్సి వస్తదని ఎన్డీడీబీ చెప్పిన కండీషన్లకు పాల కవర్గం తలలూపింది. బ్యాంకు రుణం తీర్చకపోతే డెయిరీ ఆస్తులు వేలం వేయాల్సి వస్తది. దాదాపు రూ.50 కోట్ల విలువైన డెయిరీ ఆస్తులు వేలం వేయాల్సి వస్తే వేలంపాటలో ప్రైవేటు వ్యక్తులు స్వాధీనం చేసుకునే ప్రమాదం ఉంటంది. అయితే దీనివల్ల రాజకీయంగా తమ ప్రతిష్ట దిగజారుతుందని భావించిన పాలకవర్గం ఎన్డీడీబీతో చేతులు కలిపేందుకు సిద్ధమైంది. తమ రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు ఎన్డీడీబీతో ఒప్పందం తప్పా మరో గత్యంతరం లేదనే నిర్ణయానికి వచ్చింది. అయితే దీనివల్ల బ్యాంకులో కుదువ పెట్టిన డెయిరీ ఆస్తులు ఎన్డీడీబీ స్వాధీనం చేసుకుంటదనే రహస్యాన్ని దాచిపెడుతున్నారు. ఎంతసేపు రైతుల పాల బిల్లులు చెల్లించేందుకే ఇదంతా చేస్తున్నామని చెప్తూన్నారే తప్పా 20 ఏళ్ల పాటు ఎన్డీడీబీతో అగ్రిమెంట్ జరిగితే ఎదురయ్యే పర్యవసానాలు గురించి సొసైటీ చైర్మన్లకు వివరించడం లేదు. రైతులు సైతం తమ పాల బిల్లులు వస్తాయనే ఉద్దేశంతో పాలకవర్గం తీర్మానానికి ఆమోదం తెలిపేందుకే సిద్ధమయ్యారు. కానీ 20 ఏళ్ల పాటు ఎదురయ్యే కష్టనష్టాల గురించి ఆలోచించడం లేదు.
ఒప్పందం వెనక దాగిన రహస్యం ఇదీ..
నిజానికి బ్యాంకు రుణం రూ.27 కోట్లు. బ్యాంకులో కుదవ పెట్టిన డెయిరీ ఆస్తు విలువ రూ. 50 కోట్లు. అంటే రూ. 50 కోట్ల ఆస్తిని, రూ. 27 కోట్లకే ఎన్డీడీబీకి స్వాధీనం చేసుకుంటుంది. బ్యాంకు అప్పు రూ.27 కోట్లు చెల్లించి, మిగిలిన రూ.23 కోట్లు రైతుల పాల బకాయిలు చెల్లిస్తది. డెయిరీ ఆస్తులు స్వాధీనం చేసుకునే ఒప్పందంలో భాగంగా తొలి విడత రూ.10కోట్లు రిలీజ్ చేస్తామని ఎన్డీడీబీ డీల్‌కు ఒప్పుకుంది. అంటే ఇప్పుడున్న డెయిరీ మొత్తం ఆస్తులను ఎన్డీడీబీకీ ఒకరకంగా అమ్మేసినట్టే. 20 ఏళ్ల పాటు అగ్రిమెంట్లో భాగంగా డెయిరీలో పాల సేకరణ, వ్యాపారం, చిల్లింగ్ సెంటర్లు, పాడిరైతులు ఇలా ప్రతి వ్యవహారంలోనూ ఎన్డీడీబీదే ఆధిపత్యం. పాలకవర్గం కేవలం ప్రేక్షకపాత్ర మాత్రమే పోషిస్తది.
డెయిరీ ఆస్తుల పైన అధికారాలు గల్లంతు
ప్రభుత్వాన్ని ఏదోవిధంగా ఒప్పించి రూ.50 కోట్లు అప్పుగా తీసుకునే ప్రయత్నం చేస్తే ఇప్పుడున్న కష్టాల నుంచి బయట పడే ఆస్కారం ఉంటుంది. సీఎం రేవంత్ స్థాయిలో ఒప్పించే శక్తిసామర్ధ్యాలు కేవలం మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు మాత్రమే ఉన్నాయి. కానీ పాలకవర్గం రాజకీయ ప్రయోజనాలు ఆశించి ఎన్డీడీబీని తెస్తే డెయిరీ కష్టాలు తీరుతాయనే డ్రామాను క్రియేట్ చేశారు. దీనివల్ల మొదటికే మోసం వస్తుందనే సంగతి ఎవరికీ పట్టింపులేదు. హయత్‌నగర్‌లో 72 ఎకరాల్లో విస్తరించిన మదర్ డెయిరీ ఆస్తి విలువ కోట్లు పలుకుతోంది. ఔటర్ రింగ్ రోడ్డుకు అత్యంత సమీపంలో ఉన్న ఈ ప్రాంతంలో గజం రూ.50 వేలు ఉంది. చిట్యాలలో 30 ఎకరాలు, నల్లగొండలో 7 ఎకరాలు, కొండమల్లేపల్లిలో 7 ఎకరాలు ఇలా చిల్లింగ్ సెంటర్ల ఆస్తులు విస్తరించి ఉన్నాయి.
సుఖేందర్ రెడ్డి మౌనం.. డెయిరీకి నష్టం
మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నల్గొండ, రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. 1992-1999 మధ్యకాలంలో ఆయన మదర్ డెయిరీ చైర్మన్‌గా సేవలందించారు. ఆంధ్రప్రదేశ్ డెయిరీ డెవలప్మెంట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ ఛైర్మన్‌గా (1995-99), నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్ (NDDB) డైరెక్టర్‌గా (1998) కూడా పనిచేశారు. మదర్ డెయిరీ ఆస్తుల అమ్మకం విషయంలో ఆయన అనుభవం, పాడి పరిశ్రమపై ఆయనకు ఉన్న అవగాహనతో స్పందిస్తూ డెయిరీ భవిష్యత్తు పైన అనేక సందర్భాల్లో ఆందోళన వ్యక్తం చేశారు. నష్టాల నుంచి బయటపడటానికి ఆస్తుల అమ్మకం సరైన మార్గం కాదని అన్నారు. ఆయన హయాంలోనే డెయిరీలో పాలు సేకరణ పెరిగి, ఆర్థికంగా బలోపేతమైంది. 2025లో, డెయిరీ ఆస్తులను విక్రయించడం పై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ, అది సరైన నిర్ణయం కాదని అభిప్రాయపడ్డారు.