APB News Exclusive: దిశ ఎంపీలు ఎక్కడా ..? డీఆర్​డీఏ ఆఫీసులకు చీకటి రోజులు..

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పనితీరును పర్యవేక్షించాల్సిన పార్లమెంట్ సభ్యుల జాడ కనిపించడం లేదు. దక్షిణ భారతదేశంలో అత్యధిక మెజార్టీతో గెలిచిన నల్లగొండ ఎంపీ రఘువీర్ రెడ్డి జిల్లా కేంద్రం వైపు అసలు కన్నెత్తి కూడా చూడటం లేదు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి జనాల్లో కనిపించడం కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా వైరల్ అవుతారనే ముద్ర పడింది. జిల్లా గ్రామీణాభివృద్ధి ఆఫీసుల్లో పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయాయి. కనీసం కరెంట్ బిల్లులు కట్టేందుకు కూడా ఖాతాల్లో చిల్లి గవ్వ లేదు. మరోవైపు ఉపాధి హామీ పథకాన్ని గ్రామ స్థాయిలో నడిపించే మండల కంప్యూటర్ సెంటర్లకు ఎప్పుడు తాళాలు వేస్తారో కూడా తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. గత రెండేళ్ల నుంచి ఎంసీసీ (మండల కంప్యూటర్ సెంటర్లు)లకు స్టేషనరీ ఫండ్స్ రాకపోవడంతో ఉపాధి సిబ్బంది అప్పులు చేసి సెంటర్లు నడిపిస్తున్నారు. ఇక జిల్లా కేంద్రంలోని డీఆర్డీఏ ఆఫీసుల్లో చీకటి రోజులు దాపురించాయి.

ఉపాధి హామీ పథకం అమలు చేసేందుకు రెండేళ్ల క్రితం ప్రవేశపెట్టిన స్పర్శ్ సాఫ్ట్వేర్ గందరోగళంగా మారింది. దీంతో స్టేషనరీకి నిధులు రావడం లేదు. కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు అందడం లేదు. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు జీతాలు ఇవ్వడం మానేశాయి. ఉపాధి పథకం నిధులను ఒకేపద్దు కింద విడుదల చేసేందుకు స్పర్శ్ సాఫ్ట్వేర్ ప్రవేశపెట్టారు. ఎస్టీఓ(SDO)లు, డీటీఓ(DTO)ల నుంచి ఫండ్స్ డ్రాచేసుకోవాలనేది సాఫ్ట్వేర్ ఉద్దేశం, కానీ రెండేళ్ల గడుస్తున్నా ఈ సాఫ్ట్వేర్ ఎలా మెయింటెన్ చేయాలో సీఆర్డీ (కమిషనర్ రూరల్ డెవలప్మెంట్) లెవల్లోనే అంతుచిక్కడం లేదు. దీంతో రెండేళ్ల నుంచి ఎంసీసీల్లో స్టేషనరీ ఖర్చులన్నీ సిబ్బంది భరిస్తున్నారు. నెలకు రూ.15వేల చొప్పున ఏడాదికి లక్ష రూపాయాలు స్టేషనరీ ఫండ్స్ కింద ప్రతి ఎంసీసీకి రిలీజ్ చేయాలి. ఉమ్మడి జిల్లాలోనే 70 ఎంసీసీలు నడుస్తుండగా గత రెండేళ్ల నుంచి నయాపైసా రిలీజ్ కాలేదు.

ఎప్పుడో 15 ఏళ్ల క్రితం ఇచ్చిన కంప్యూటర్లలో నిత్యం తలెత్తే సాంకేతిక సమస్యలతో సిబ్బంది అవస్థలు పడుతున్నారు. ప్రింటర్లు కూడా పాతవే కావడంతో ఎప్పుడు మూలన పడేయాల్సి వస్తదేమోనని తెగ ఆందోళన చెందుతున్నారు. స్పర్శ్ సాఫ్ట్వేర్ సృష్టిస్తున్న సమస్యల కారణంగా నాలుగైదు నెలలకోసారి ఉద్యోగుల జీతాలు వస్తున్నాయి. జీతాల కోసం ప్రతిసారి మంత్రి సీతక్కను కలవడం లేదంటే సీఆర్డీ లెవల్లో పైరవీలు చేయాల్సి వస్తోంది. ఇక అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి మరింత దయనీయం. జీతాలు ఎప్పుడు వస్తాయో కూడా కచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది.

Nalgonda DRDA Financial Crisis

జిల్లా కేంద్రాల్లోని డీఆర్డీఏ ఆఫీసులకు చీకటి రోజులు దగ్గరపడ్డాయి. ప్రతినెల వచ్చే 60 వేల కరెంట్ బిల్లులకు కూడా పైసల్లేవు, ఖజానా ఖాళీగా ఉంది. స్పర్శ్ సాఫ్ట్వేర్ సమస్యతో స్టేషనరీ ఖర్చులకు పైసల్లేవు. టెండర్లు పిలిచి స్టేషనరీ కొందామన్న ఎవరూ ఆసక్తి చూపడం లేదు. ప్రతి నెల కనీసం రెండు, మూడు లక్షల స్టేషనరీ ఖర్చు అవుతుంది. ఇదంతా షాపుల్లో క్రెడిట్ తీసుకొచ్చి నడిపిస్తున్నారు. ఆరు నెలల నుంచి కరెంట్ బిల్లుల బకాయిలు ఉన్నాయి. ఎప్పుడు కరెంట్ కట్ చేస్తారోనని ఆఫీసర్లు ఆందోళన చెందుతున్నారు.

నల్లగొండ ఎంపీ రఘువీర్ గత 15 నెలల కాలంలో 2024 నవంబర్ లో మాత్రమే దిశ మీటింగ్ నిర్వహించారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఈ ఆర్ధిక సంవత్సరంలో ఒక్క మీటింగ్ కూడా నిర్వహించలేదు. కేంద్రం గైడ్లైన్స్ ప్రకారం ప్రతి మూడు నెలలకోసారి దిశ మీటింగ్లు నిర్వహించాలి. కేంద్రం, రాష్ట్రం నిధులతో జిల్లాలో అమలవుతున్న ఉపాధి హామీ పథకం, ఎన్ఆర్ఎల్ఎం(NRLM), పంచాయతీ రాజ్, వైద్యం, విద్యా, స్త్రీ, శిశు సంక్షేమం, ఆర్ అండ్ బి శాఖల పైన రివ్యూ చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని వీవీబీజీ రాంజీగా మార్చింది. పార్టీ ఆదేశాల మేరకు రోడ్ల పైన ఆందోళన చేసిన ఎంపీలు అసలు దానివల్ల ఉమ్మడి జిల్లాకు జరిగిన నష్టం గురించి, ఈ పథకం కింద పనిచేస్తున్న ఉద్యోగుల ఆర్ధిక సమస్యలు, వారి ఉద్యోగ భద్రత గురించి పట్టించుకున్నపాపాన కూడా పోలేదు. ఎన్నికలకు ముందు ఉపాధి సిబ్బందిని రెగ్యులర్ చేస్తామని, పే స్కేల్ వర్తింప చేస్తామని ఇచ్చిన హామీ ఇప్పటి వరకు నెరవేర్చలేదు. దిశ మీటింగ్లో సభ్యులైన ఎమ్మెల్యేలకు సైతం అసలు దిశ గురించే అవగాహన లేకపోవడం మరింత విడ్డూరం. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు దిశ అంటే ఏంటో కూడా తెలియదు. ఇప్పటికైనా ఎంపీలు జోక్యం చేసుకుని డీఆర్డీఏ(DRDA) ఆఫీసులను, ఎంసీసీ(MCC) సెంటర్లను గాడిలో పెట్టాలని ఉద్యోగులు, ఆఫీసర్లు కోరుతున్నారు.

Share
Share