APB News Exclusive: మంత్రికి…ఆ గుట్ట కల…?

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: అట్టడుగున జీవిస్తున్న పేద, నిరుపేద ప్రజలకు సొంత ఇంటి కల నెరవేర్చాలన్నది ఆ మంత్రి ధృడ సంకల్పం. ముఖ్యంగా వ్యవసాయ కార్మికులు, రైస్ ఇండ్రస్ట్రీలో పనిచేస్తున్న పేద కార్మికులకు ఇళ్లు కట్టించి ఇవ్వాలన్నది కెప్టెన్ పట్టుదల. సరిగ్గా 15 ఏళ్ల క్రితం మొదలు పెట్టిన ఆ బృహత్తర కార్యక్రమం ఎట్టకేలకు నెరవేరింది. నిజాయితీగా, నిష్పక్షపాతంగా ప్రజలకు మేలు చేయాలనే సంకల్పంతో మొదలు పెట్టిన కార్యక్రమాన్ని ఎన్ని అడ్డంకులు ఎదురైనా దాటుకుని సాధించవచ్చని నిరూపించిన మంత్రి మరెవరో కాదు, ఆరు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి పార్లమెంట్ సభ్యుడిగా హుజూర్నగర్ ప్రజల ఆదరణ పొందుతున్న వీరసైనికుడు కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి.

రాష్ట్ర ఇరిగేషన్ మంత్రిగా ఉమ్మడి జిల్లా పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపధికన పూర్తిచేసేందుకు అవిశ్రాంతంగా శ్రమిస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్నగర్లో తన డ్రీమ్ ప్రాజెక్ట్ మోడల్ హౌజింగ్ కాలనీ కలను నెరవేర్చారు. మార్చి మొదటి వారంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా హుజూర్నగర్లో ఒకేసారి వెయ్యి మందికి ఇళ్లు పంపిణీ చేయాలనే బృహత్తర కార్యక్రమానికి మంత్రి శ్రీకారం చుట్టారు. సరిగా 2011లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు హుజూర్నగర్లో పేద ప్రజలకు ఇళ్లు కట్టించాలని నిర్ణయించారు. అప్పటి వైఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో మోడల్ హౌజింగ్ కాలనీలు కట్టించాలని భావించింది. దీనిలో భాగంగానే హుజూర్నగర్ లో ఒకే చోట 110 ఎకరాల్లో 2,160 మందికి ఇళ్లు నిర్మించేందుకు ప్లాన్ చేశారు.

దేవస్థాన భూముల పైన అప్పట్లో నిషేదం అమల్లో ఉంది. దాంతో మంత్రి ఉత్తమ్ హైకోర్టు నుంచి ప్రత్యేక అనుమతులు పొందారు. దీని కోసం అప్పటి బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం రామస్వామిగుట్ట దేవస్థాన భూములను ప్రభుత్వం నుంచి కొనుగోలు చేయించారు. నష్టపరిహారం మొత్తాన్ని దేవాదాయ శాఖకు డిపాజిట్ చేశారు. 110 ఎకరాల్లో ఒకవైపు మోడల్ హౌజింగ్ కాలనీ, మరోవైపు పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని అప్పట్లో నిర్ణయించారు. భూమికు ప్రభుత్వం ఖర్చు పెట్టిన ధర కాకుండా కాలనీ ఇళ్లు నిర్మించేందుకు రూ.125 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. అనేక అవరోధాలు దాటుకుని భూసేకరణ చేశారు. ఆ తర్వాత మోడల్ కాలనీ నిర్మించేందుకు టెండర్లు పిలిచారు. ఇదంతా 2013 డిసెంబర్ 13 నాటికి పూర్తియ్యింది. అప్పటికే 70 శాతం పనులు పూర్తిచేశారు.

తెలంగాణ వచ్చాక ఏర్పడ్డ బీఆర్ఎస్ ప్రభుత్వం మోడల్ హౌజింగ్ కాలనీల పనులు చేపట్టకుండా నిర్లక్ష్యంగా వదిలేసింది. చివరకు ఆ కాలనీని డంపింగ్ యార్డ్గా మార్చింది. పీసీసీ ప్రెసిడెంట్గా, ఎంపీగా, ఎమ్మెల్యేగా అప్పటి ప్రభుత్వానికి ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా పట్టించుకోలేదు. మళ్లీ పదేళ్ల విరామం తర్వాత స్వరాష్ట్రంలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పనులు మొదలు పెట్టడం జరిగింది.

రాష్ట్రంలో పేదలకు ఇళ్లు కట్టించి ఇచ్చే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ అని మరోసారి నిరూపించుకుంది. 2023 డిసెంబర్ 7న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మళ్లీ కేబినెట్లో చేరిన వెంటనే తన డ్రీమ్ ప్రాజెక్టు పైనే ఫోకస్ పెట్టారు. కేబినెట్ మినిస్టర్గా బాధ్యతలు చేపట్టిన నెల రోజుల్లోనే 2024 జనవరి 29న రూ.75కోట్లు మంజూరు చేశారు. దీంతో అప్పటి వరకు పెండింగ్లో ఉన్న కాలనీ ఇళ్ల పనులు ఊపందుకున్నాయి. సీమెంట్ రోడ్లు, విద్యుత్ కనెక్షన్లు, వాటర్ సప్లై, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వంటి ఇతర మౌలిక సదుపాయాల పనులు వేగవంతం చేశారు. మంగళవారం హౌజింగ్ ఎండీ గౌతమ్, కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్తో కలిసి పనులు పర్యవేక్షించారు.

15 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో హౌజింగ్ మంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన తన డ్రీమ్ ప్రాజెక్టు, మళ్లీ స్వరాష్ట్రంలో కేబినెట్లో మంత్రి అయ్యాక కార్యరూపం దాల్చింది. పైగా సీఎంగా చేతుల మీదుగా ఇళ్లు పంపిణీ చేయడం గర్వంగా ఉందని చెప్పిన మంత్రి తాను పడ్డ కష్టం అభాసుపాలు కావొద్దనే ఉద్దేశంతో లబ్ధిదారుల ఎంపికకు మంత్రి ఉత్తమ్ ప్రత్యేకంగా కమిటీ వేశారు. మొత్తం 2,160 ఫ్లాట్స్లో తొలి విడత హుజూర్నగర్ పట్టణ వాసులకు, రెండో విడతలో మండలంలోని పేద, నిరు పేదలకు పంపిణీ చేయాలని నిర్ణయించారు. దీనికోసం ఆర్డీఓ ఆధ్వర్యంలో కమిటీ వేశారు. తహశీల్దారు, ఎంపీడీఓ, ఇతర సంబంధిత శాఖల అధికారులు సభ్యులుగా ఉన్నారు. రాజకీయాలకు అతీతంగా నిజాయితీగా, నిష్పక్షపాతంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజాప్రతినిధులు తమ సిఫార్సులు కూడా అందజేయోచ్చని చెప్పారు. ఎలాంటి అక్రమాలు జరిగినట్టు తెలిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని, వాళ్ల అంతుచూస్తానని మంత్రి హెచ్చరించారు.

మొదటి విడతలో హుజూర్నగర్ పట్టణంలో ఇళ్లు లేని వెయ్యి మంది నిరుపేదలను గుర్తించే కార్యక్రమం మొదలు పెట్టారు. ఈ వారం రోజుల్లో లబ్ధిదారుల ఎంపిక పూర్తిచేస్తారు. అనంతరం మార్చి మొదటి వారంలో ఒకేసారి వెయ్యి మందికి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇళ్లు పంపిణీ చేస్తామని మంత్రి ఉత్తమ్ మంగళవారం చెప్పారు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్నబియ్యంతోనే భోజన ఏర్పాట్లు చేస్తామని, సీఎం రేవంత్తో కలిసి వెయ్యి మంది సహపంక్తి భోజనం చేస్తారని మంత్రి చెప్పారు.

Share
Share