Breaking News: రేవంత్ రెడ్డిపై రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శైలిని, ఆయన చేసిన తాజా ప్రకటనలను లక్ష్యంగా చేసుకుని రాజగోపాల్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో నడుస్తున్నది 140 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీనా లేక రేవంత్ రెడ్డి సొంత పార్టీనా? అని ఆయన ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అదృష్టం కొద్దీ అధికారంలోకి వచ్చిందని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. “మరో 10 ఏళ్లు నేనే ముఖ్యమంత్రిని” అని రేవంత్ రెడ్డి ప్రకటించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా సాగే కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీలో అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని, ఇలాంటి ఏకపక్ష ప్రకటనలు అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. రేవంత్ వ్యాఖ్యలపై తోటి మంత్రులు మౌనంగా ఉండటం దారుణమని ఆయన పేర్కొన్నారు.

పార్టీలో పాత కాంగ్రెస్ నేతలను కాదని, తెలుగుదేశం పార్టీ నుండి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. గుత్తా సుఖేందర్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, కడియం శ్రీహరి లాంటి నేతల మాటలకే ప్రభుత్వంలో ప్రాధాన్యత లభిస్తోందని, నిఖార్సయిన కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు అవమానానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

రాబోయే రోజుల్లో తాను రాష్ట్రాన్ని చూసుకుంటానని చెబుతూనే, ఇచ్చిన హామీ ప్రకారం మంత్రి పదవి ఇవ్వకుంటే నేరుగా సీఎం పదవినే టార్గెట్ చేస్తానంటూ రాజగోపాల్ రెడ్డి పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ అధిష్టానానికి ఒక రకమైన అల్టిమేటంగా మారుతున్నాయి.

Share
Share