యాదాద్రి భువనగిరి, ఏపీబీ న్యూస్: జిల్లా కేంద్రంలోని పగిడిపల్లిలో గల తెలంగాణ మైనారిటీ గురుకుల సంక్షేమ పాఠశాలలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
అసలేం జరిగింది?
నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం రాయపురం గ్రామానికి చెందిన బాల ఆకాశ్ (16) భువనగిరిలోని మైనారిటీ గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఆదివారం కావడంతో సెలవు దినం కావడంతో, తోటి విద్యార్థి రెహమత్ ఖాన్‌తో కలిసి పాఠశాల సమీపంలోని ఓ నీటి గుంత వద్దకు స్నానానికి వెళ్లాడు. స్నానం చేస్తుండగా ఆకాశ్ ఒక్కసారిగా లోతైన గుంతలోకి జారిపోయాడు.
ఆకాశ్ కు ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోతూ ప్రాణభయంతో కేకలు వేశాడు. పక్కనే ఉన్న రెహమత్ ఖాన్ తన స్నేహితుడిని కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆకాశ్ నీటిలో మునిగిపోవడంతో, వెంటనే రెహమత్ పాఠశాలకు పరిగెత్తి సిబ్బందికి సమాచారం అందించాడు.
ఆసుపత్రికి తరలించేలోపే..
సమాచారం అందుకున్న పాఠశాల సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఆకాశ్‌ను బయటకు తీశారు. అనంతరం హుటాహుటిన చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆకాశ్ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
సిబ్బంది నిర్లక్ష్యమే కారణమంటూ ఆందోళన
బాల ఆకాశ్ మృతితో మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల అధికారుల పర్యవేక్షణ లోపం, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తన కుమారుడు ప్రాణాలు కోల్పోయాడని వారు ఆరోపించారు. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రి ముందున్న ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. విద్యార్థులు పాఠశాల దాటి బయటకు వెళ్తున్నా సిబ్బంది ఎందుకు గమనించలేదని వారు నిలదీశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను శాంతింపజేసే ప్రయత్నం చేస్తున్నారు.