హైదరాబాద్, ఏపీబీ న్యూస్: రాష్ట్రంలోని సహజ వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడంతో పాటు, వరద ముప్పును నివారించే లక్ష్యంతో ప్రభుత్వం ‘మున్నేరు-పాలేరు’ గ్రావిటీ లింక్ కెనాల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ. 162.57 కోట్లను కేటాయించినట్లు ఆయన వెల్లడించారు.
ప్రాజెక్టు ముఖ్యాంశాలు:
- కాలువ పొడవు: 9.6 కిలోమీటర్లు.
- సామర్థ్యం: సెకనుకు 4,500 క్యూసెక్కుల ప్రవాహాన్ని తట్టుకునేలా డిజైన్.
- నీటి మళ్లింపు: ఏటా వృధాగా సముద్రం ప పాలవుతున్న సుమారు 50 టీఎంసీల మున్నేరు వరద జలాలను పాలేరుకు మళ్లిస్తారు.
- ప్రయోజనం: ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లోని 1.38 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటి స్థిరీకరణ.
జిల్లాల వారీగా సాగునీటి భరోసా:
మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం ముల్కనూర్ చెక్ డ్యామ్ ద్వారా నీటిని మళ్లించడం వల్ల పలు ప్రాజెక్టులకు జలకళ రానుంది:
- పాలేరు రిజర్వాయర్: రిజర్వాయర్ ఎగువ భాగంలోని 40 వేల ఎకరాల ఎన్ఎస్పీ (NSP) ఆయకట్టుకు నీటి భద్రత.
- భక్త రామదాసు పథకం: డీబీఎం-60 ద్వారా 76,308 ఎకరాలకు అదనపు నీరు.
- మోతే ఎత్తిపోతల పథకం: సూర్యాపేట జిల్లాలో డీబీఎం-71 కింద ఉన్న 46,712 ఎకరాలకు సమృద్ధిగా సాగునీరు.
- ఎస్సారెస్పీ (SRSP) స్టేజ్-2: ఈ ఆయకట్టు స్థిరీకరణకు ప్రాజెక్టు కీలకం కానుంది.
ఆర్థిక మరియు విద్యుత్ ప్రయోజనాలు:
ఈ లింక్ ప్రాజెక్టు వల్ల ప్రభుత్వానికి భారీగా ఆర్థిక ప్రయోజనం కలగనుంది. లిఫ్ట్ ఇరిగేషన్ అవసరం లేకుండా గ్రావిటీ ద్వారా నీరు ప్రవహించడం వల్ల సీతారామ ప్రాజెక్టుకు ఖర్చయ్యే దాదాపు రూ. 120 కోట్ల విద్యుత్ బిల్లులు ఆదా అవుతాయని మంత్రి తెలిపారు. అదనంగా, పాలేరు రిజర్వాయర్ వద్ద ఉన్న హైడల్ ప్లాంట్ ద్వారా 2 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఏర్పడుతుంది.
తాగునీరు మరియు వరద నివారణ:
సాగునీటితో పాటు మిషన్ భగీరథ ద్వారా మూడు జిల్లాల తాగునీటి అవసరాల కోసం 4.70 టీఎంసీల నీటిని కేటాయిస్తున్నట్లు మంత్రి వివరించారు. మున్నేరు నదికి వచ్చే ఆకస్మిక వరదల వల్ల ఖమ్మం జిల్లాలో జరిగే ప్రాణ, ఆస్తి నష్టాలను అరికట్టడానికి ఈ లింక్ ప్రాజెక్టు శాశ్వత పరిష్కారంగా మారుతుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.