- నల్లగొండలో..ఎంపీ రఘువీర్ క్యాంపు ఆఫీసు
- సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన అధికారులు
- త్వరలోనే సీఎం రేవంత్ చేతుల మీదుగా ప్రారంభం
- శుభ ముహూర్తం కోసం వెయింటింగ్
- కాంగ్రెస్ కేడర్కు, ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు కుందూరు రఘువీర్ రెడ్డి క్యాంపు ఆఫీసు నల్లగొండ పట్టణంలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. దేశంలోనే భారీ మెజార్టీతో గెలుపొందిన ఎంపీగా ఆయన రికార్డెక్కారు. తెలంగాణలోనే 5.59 లక్షల మెజార్టీ సాధించిన ఏకైక ఎంపీగా చరిత్రకెక్కారు. 2024 ఎంపీ ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి ఆయన ప్రజలకు, పార్టీ కేడర్కు అందుబాటులో ఉండట్లేదని విమర్శలు వస్తున్నాయి. దిశ మీటింగ్, జిల్లా మంత్రుల మీటింగ్ల్లో మాత్రమే ఎంపీ హాజరుకావడం జరిగేది. వీటిన్నింటికి చెక్ పెట్టేందుకు ఎంపీ రఘువీర్ రెడ్డి నల్లగొండలో క్యాంపు ఆఫీసు ఏర్పాటు చేసి, ప్రజలకు అందుబాటులో ఉండాలని నిర్ణయించారు. దీనిలో భాగంగానే గతంలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి కేటాయించిన క్యాంపు ఆఫీస్ను రఘువీర్కు కేటాయించారు.
గత కొద్ది రోజులుగా ఆర్ అండ్ బి అధికారులు క్యాంపు ఆఫీసుకు రంగులు వేయించి, కొత్త ఫర్నీచర్ తెప్పించారు. గుత్తా సుఖేందర్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పటి నుంచి నల్లగొండలో ఎంపీ క్యాంపు ఆఫీసు ఆనవాయితీ కొనసాగుతోంది. అయితే ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నప్పుడు మాత్రమే ఉత్తమ్ క్యాంపు ఆఫీసుకు వచ్చేవారు. అప్పుడున్న సీనియర్ నాయకులు దుబ్బాక నర్సింహారెడ్డి ప్రజలకు అందుబాటులో ఉండటం జరిగేది. అయితే రఘువీర్ క్యాంపు ఆఫీసు నిర్వహణ మాత్రం నాగార్జునసాగర్కు చెందిన ఆయన ప్రధాన అనుచరుడికి అప్పగించినట్లు తెలుస్తోంది.
సీఎం చేతుల మీదుగా ఓపెన్..
రఘువీర్ క్యాంపు ఆఫీసు పక్కనే ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బొట్టుగూడ స్కూల్ నవీకరణ జరుగుతోంది. ఈ స్కూల్ ఓపెనింగ్కు సీఎం రేవంత్ రెడ్డి వస్తారని మంత్రి కోమటిరెడ్డి గతంలోనే ప్రకటించారు. దాంతోపాటే రఘువీర్ క్యాంపు ఆఫీసు కూడా ఓపెన్ చేస్తారని చెపుతున్నారు. ఇప్పుడు మంచి రోజులు కానందున శుభ మూహూర్తం కోసం ఎదురు చూస్తున్నారు. సంక్రాంతి తర్వాత క్యాంపు ఆఫీసు ఓపెన్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది.