APB News Exclusive: ఎపిసోడ్ -3: గ్యాంబ్లర్ల నుంచి రెడ్‌క్రాస్‌ను రక్షించాలి!

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: సేవ చేయాలనే తపన ఉన్నవారికి ఉపయోగపడాల్సిన రెడ్క్రాస్ సంస్థ కొందరి గుప్పిట్లో చిక్కుకుందని, గ్యాంబ్లర్ల నుంచి దాన్ని రక్షించాల్సిన అవసరం ఉందని రెడ్క్రాస్ మాజీ చైర్మన్ పుల్లెంల వెంకటనారాయణ గౌడ్ అన్నారు. శనివారం ఆయన ఏపీబీ ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. దాదాపు 12 ఏళ్లుగా ఎన్నికలు నిర్వహించకుండా ఏకచక్రాధిపత్యంతో సంస్థను నడిపిస్తున్నారని ఆరోపించారు. రెడ్క్రాస్తోపాటు నల్లగొండ క్లబ్లోనూ ఇదే తరహా వ్యవహారాలు సాగుతున్నాయని విమర్శించారు.

రెడ్క్రాస్ సేవా సంస్థ అని, సేవ చేయాలనే హృదయం ఉన్నవారికి ఇందులో పనిచేసే అవకాశం ఉండాలని వెంకటనారాయణ గౌడ్ అన్నారు. అయితే ప్రస్తుతం డబ్బున్నవారు, తమ చుట్టూ కొందరిని సమీకరించుకున్న వారే సంస్థను నడిపిస్తున్నారని ఆరోపించారు. రెండేళ్లకోసారి ఎన్నికలు జరగాల్సి ఉండగా, దాదాపు 12 ఏళ్లుగా ఎన్నికలు నిర్వహించడం లేదన్నారు. మళ్లీ అదే వర్గం అధికారంలోకి వస్తే పాత పరిస్థితులే కొనసాగుతాయని, ఈసారి మరో ప్యానల్ గెలిస్తే సంస్థ అభివృద్ధికి అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు.

రెడ్క్రాస్, నల్లగొండ క్లబ్లలో నిధులు ఉన్నచోట కొందరు చేరి పెత్తనం చెలాయిస్తున్నారని వెంకటనారాయణ గౌడ్ ఆరోపించారు. నిర్మాణాలు, అభివృద్ధి పనులు, కొనుగోళ్లలో కమీషన్లు తీసుకుంటున్నారని, బయటకు కనిపించని విధంగా ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయని విమర్శించారు. గవర్నర్ ద్వారా కుట్టుమిషన్ల పంపిణీ వంటి కార్యక్రమాల్లోనూ కమీషన్ల వ్యవహారం ఉంటోందని ఆరోపించారు. నల్లగొండ క్లబ్లోనూ అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ఇదే ధోరణి కొనసాగిందని అన్నారు. ఈ ఆరోపణలపై సంబంధిత వర్గాలు స్పందించాల్సి ఉంది.

తాను చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన ఆరు నెలలు కూడా పూర్తికాకముందే పదవి నుంచి తప్పించేలా చేశారని వెంకటనారాయణ గౌడ్ చెప్పారు. పదవీకాలం ముగిసిందంటూ గందరగోళం సృష్టించి, అందరినీ ఒప్పించి రెన్యువల్ చేయించారని ఆరోపించారు. మోత్కూరు ప్రాంతంలో సభ్యత్వాలు ఎక్కువగా ఉండటంతో అక్కడి సభ్యులకు విందులు ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించారని అన్నారు. గడువు పూర్తికాకముందే పదవి నుంచి దించడం, ఎన్నికలు పెట్టడం సరికాదని తాను చెప్పానన్నారు. ఆ పరిణామాల తర్వాత మానసిక క్షోభకు గురయ్యానని, ఆరోగ్యం కూడా దెబ్బతిందని పేర్కొన్నారు.

సంస్థలో జీతం లేకపోయినా కారు అద్దె కింద నెలకు రూ.50 వేల చొప్పున రాసుకుంటున్నారని వెంకటనారాయణ గౌడ్ ఆరోపించారు. నిర్మాణాలు, అభివృద్ధి పనులు, కొనుగోళ్లకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై విచారణ జరిపించాలని కోరారు. రెడ్క్రాస్, నల్లగొండ క్లబ్ల నిర్వహణలో పార దర్శకత ఉండాలని, ఎన్నికలు నిర్వహించి సేవ చేయాలనుకునేవారికి అవకాశం కల్పించాలని అన్నారు. ఈసారి మరో ప్యానల్కు అవకాశం వస్తే రెడ్క్రాస్ మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Share
Share