సాగునీటి రంగంలో సరికొత్త అధ్యాయం రూ. 628.78 కోట్లు మంజూరు: మంత్రి ఉత్తమ్

నల్లగొండ, ఏపీబీ న్యూస్: ఉమ్మడి నల్గొండ జిల్లాలోని హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల పరిధిలో సాగునీటి రంగాన్ని బలోపేతం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఐదు ఎత్తిపోతల పథకాల (Lift Irrigation Schemes) విస్తరణ మరియు ఆధునీకరణ పనుల కోసం రూ. 628.78 కోట్ల నిధులతో పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

మేడారంలో నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ సవరించిన అంచనాలకు ఆమోదం లభించిందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా మొత్తం 1,58,300 ఎకరాల ఆయకట్టుకు శాశ్వత సాగునీటి భరోసా కలగనుంది.

గతంలో 5,650 ఎకరాల లక్ష్యంతో రూ. 173 కోట్లతో ప్రారంభమైన జవహర్ జానపహాడ్ ఎత్తిపోతల పథకాన్ని, స్థానిక రైతుల అభ్యర్థన మేరకు 10,000 ఎకరాలకు విస్తరించారు. దీనితో అంచనా వ్యయం రూ. 292.98 కోట్లకు పెరిగింది.

  • ప్రయోజనం పొందే గ్రామాలు: జానపహాడ్, ఆలింగాపురం, బొత్తాలపాలెం, కోమతికుంట, గుండ్లపహాడ్, యెల్లాపురం, సజ్జాపురం, పాలకీడు తదితర గ్రామాలు.
  • లక్ష్యం: 2026 ఖరీఫ్ సీజన్ నాటికి ఈ పనులను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన పనులు చేపడుతోంది.
  1. ముక్త్యాల బ్రాంచ్ కెనాల్: హుజూర్ నగర్, కోదాడ పరిధిలోని 1.08 లక్షల ఎకరాల ఆధునీకరణ కోసం రూ. 222.22 కోట్లు కేటాయింపు.
  2. ఆర్-9 ఎత్తిపోతల పథకం: అదనంగా 800 ఎకరాలను కలిపి మొత్తం 2,300 ఎకరాలకు సాగునీరు. బరఖాత్ గూడెం, ఆకుపాముల రైతులకు లబ్ధి.
  3. ఎస్.ఎల్.బి.సి లైనింగ్: 70.56 కి.మీ నుండి 115.40 కి.మీ వరకు లైనింగ్ పనుల కోసం రూ. 29.02 కోట్లు.
  4. జానపహాడ్ బ్రాంచ్ కెనాల్: మిగిలిపోయిన సిమెంట్ కాంక్రీట్ లైనింగ్ పనులకు రూ. 53.68 కోట్లు.

ఈ నిర్ణయం ద్వారా దశాబ్దాల కాలంగా సాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న టెయిల్ ఎండ్ (చివరి ఆయకట్టు) ప్రాంతాల రైతులకు సాగునీటి కల సాకారం కానుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

Share
Share