నన్ను బలి చేసేందుకే కర్ల రాజేష్ హత్య..మాజీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు

కోదాడ, ఏపీబీ న్యూస్: కోదాడ రాజకీయాల్లో ‘కర్ల రాజేష్’ మరణం పెను సంచలనంగా మారింది. బుధవారం కోదాడలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొని అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజేష్ మరణం ముమ్మాటికి ప్రభుత్వ ప్రోద్బలంతో జరిగిన “పోలీస్ హత్యే” అని ఆయన ఆరోపించారు.

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి తనను రాజకీయంగా దెబ్బతీయడానికే ఈ కుట్ర పన్నారని మల్లయ్య యాదవ్ ఆరోపించారు. అమాయకుడైన దళిత యువకుడు కర్ల రాజేష్ను పోలీసులు చిత్రహింసలకు గురిచేయడం వెనుక ఉత్తమ్ దంపతుల ఆదేశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) కు సంబంధించిన సుమారు రూ. 12 లక్షల వ్యవహారంలో రాజేష్ను లక్ష్యంగా చేసుకున్నారని మల్లయ్య యాదవ్ విమర్శించారు. కేవలం ఒక లక్ష రూపాయల చెక్కును సాకుగా చూపి, రాజేష్ను 30 రోజుల పాటు అక్రమంగా నిర్బంధించి శారీరకంగా, మానసికంగా హింసించారని తెలిపారు.ఈ కేసులో తన (మల్లయ్య యాదవ్) పేరును చేర్చాలని పోలీసులు రాజేష్పై ఒత్తిడి తెచ్చారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజేష్ మరణించి 60 రోజులు గడుస్తున్నా, ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ఎస్ఐ (SI) సురేశ్ రెడ్డిపై చర్యలు తీసుకోకుండా మంత్రి దంపతులు అడ్డుకుంటున్నారని మల్లయ్య యాదవ్ మండిపడ్డారు.

న్యాయం కోసం పోరాటం రాష్ట్రంలో భారీ కుంభకోణాలు జరుగుతున్నా పట్టించుకోని ప్రభుత్వం, ఒక దళిత యువకుడి ప్రాణం తీయడం దారుణమని ఆయన అన్నారు. ఈ విషయంలో మందకృష్ణ మాదిగ చేపట్టే ఏ పోరాటానికైనా తన పూర్తి మద్దతు ఉంటుందని, బాధితుడి కుటుంబానికి న్యాయం జరిగే వరకు విశ్రమించబోమని స్పష్టం చేశారు.

Share
Share