- కాంగ్రెస్లో జాక్పాట్ కొట్టిన మొరిశెట్టి లక్ష్యాది
- బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ప్రముఖ కాంట్రాక్టర్
- భార్య నివేధితకు ఏకంగా సూర్యాపేట చైర్మన్ పదవి
- కాంగ్రెస్లో సభ్యత్వం లేకున్నా బంపర్ ఆఫర్
- ఎన్నికల ఖర్చు భరించాలనే ఒప్పందం?
- దాంతోనే బీఆర్ఎస్లోని పెండింగ్ బిల్లులు క్లియర్
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల్లో ప్రముఖ సివిల్ కాంట్రాక్టర్ మొరిశెట్టి లక్ష్యాది జాక్పాట్ కొట్టారు. ఎలాంటి రాజకీయ అనుభవం లేని, కనీసం కాంగ్రెస్లో క్రియాశీలక సభ్యత్వం కూడా లేని పేరు మోసిన కాంట్రాక్టర్కు హైకమాండ్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఓవైపు సీఎం రేవంత్ రెడ్డి చైర్మన్, మేయర్ అభ్యర్థులను ప్రకటించొద్దని, సమీకరణాల ప్రకారం ఎన్నికలయ్యాక ఖరారు చేస్తామని చెప్పిన సంగతి తెలిసిందే, కానీ ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి పేరును మంత్రి కోమటిరెడ్డి ప్రకటించగా, తాజాగా పేట జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూర్యాపేట మున్సిపల్ చైర్మన్గా ప్రముఖ కాంట్రాక్టర్ మొరిశెట్టి లక్ష్యాది భార్య మొరిశెట్టి నివేధిత పేరును శుక్రవారం ప్రకటించారు. ఈమేరకు డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య మీడియాకు ప్రకటన రిలీజ్ చేశారు.
మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డికి సన్నిహితుడు!
మొరిశెట్టి లక్ష్యాది గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పేట జిల్లా మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డికి సన్నిహితుడనే ప్రచారం ఉంది. జగదీష్ రెడ్డి సపోర్ట్తో లక్ష్యాది కోట్ల రూపాయాల కాంట్రాక్ట్ పనులు చేశాడని చెప్తుంటారు. బీఆర్ఎస్ హయాంలో పెండింగ్లో ఉన్న బిల్లులను ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం క్లియర్ చేసినట్టు తెలిసింది. ఈ డీల్లో భాగంగానే లక్ష్యాది కాంగ్రెస్లో చేరడం, భార్యను కౌన్సిలర్గా నిలబెట్టడం, ఒక వైపు ఎన్నికల ప్రచారం జరుగుతుండగానే ఆగమేఘాల మీద అతని భార్య నివేధితను చైర్మన్ ప్రకటించడం చకచకా జరిగిపోయింది. అభ్యర్థుల ఎన్నికల ఖర్చు భరించే ఒప్పందంలో భాగంగానే లక్ష్యాది భార్యను చైర్మన్గా ప్రకటించినట్టు తెలిసింది. గతంలో ఎల్ఐసీ ఏజెంట్గా పనిచేసిన లక్ష్యాది అంచలంచెలుగా ఎదిగి కాంట్రాక్టర్ అవతారమెత్తారు. పేట మున్సిపాలిటీలో ఆర్యవైశ్యులు బలంగా ఉన్నందున ఆ వర్గానికి చెందిన లక్ష్యాది ఫ్యామిలీనీ చైర్మన్ చేయడం వల్ల పార్టీకి ఆర్ధికంగా, సామాజికంగా పనికొస్తదని భావించి పార్టీ హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.