పాపం: 85 ఏళ్ల బామ్మ కు అన్నం పెట్టక.. ఇల్లు ఖాళీ చేయించిన కొడుకు..

నల్గొండ/ మిర్యాలగూడ, ఏపీబీ న్యూస్: కన్నతల్లిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కొడుకే.. ఆస్తి, డబ్బు కోసం ఇంట్లోంచి కొట్టి గెంటేసిన హృదయవిదారక ఘటన నల్గొండ జిల్లాలో వెలుగుచూసింది. కనీసం తినడానికి అన్నం కూడా పెట్టకుండా వేధిస్తున్న కన్నకొడుకుపై 85 ఏళ్ల వృద్ధురాలు ఏకంగా జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆశ్రయించగా.. తక్షణమే స్పందించిన అధికార యంత్రాంగం ఆ వృద్ధురాలికి అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకుంది.

బాధితురాలి వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం నారాయణపురం గ్రామానికి చెందిన నెమలి రామనర్సమ్మ (85) (భర్త స్వర్గీయ గోపాల్ రెడ్డి)కి ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు నెమలి లింగారెడ్డి, ఆయన భార్య యాదమ్మ కలసి తన వద్ద ఉన్న బంగారం, ₹30,000 నగదు బలవంతంగా లాక్కున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. అంతటితో ఆగకుండా తనను దారుణంగా కొట్టి, ఇంట్లోంచి బయటకు వెళ్లగొట్టారని తీవ్రంగా వాపోయింది.

తనకు న్యాయం చేయాలని, కొడుకుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వృద్ధురాలు నల్గొండ జిల్లా కలెక్టర్ B. చంద్రశేఖర్ IAS, ఎస్పీ శరత్ చంద్ర పవార్ IPS లను కలిసి ఫిర్యాదు చేసింది.

ఈ ఘటనపై వెంటనే స్పందించిన జిల్లా పోలీస్ యంత్రాంగం అధికారులను రంగంలోకి దింపింది. మిర్యాలగూడ డిఎస్పీ రవి స్వయంగా నారాయణపురం గ్రామానికి వెళ్లి వృద్ధురాలు రామనర్సమ్మను పరామర్శించారు. ఆమె సమస్యలను సావధానంగా విని, ధైర్యం చెప్పారు.

నిత్యావసరాల పంపిణీ: డిఎస్పీ రవి స్వయంగా వృద్ధురాలికి 25 కేజీల బియ్యం, అరటిపండ్లు, ఆపిల్స్ వంటి నిత్యావసర సరుకులను అందించారు.

ఎస్ఐకి కీలక ఆదేశాలు: రామనర్సమ్మ పెద్ద కొడుకు నెమలి లింగారెడ్డితో పాటు రెండో కొడుకు యాదగిరి రెడ్డిలను స్టేషన్కు పిలిపించి మాట్లాడాలని మాడుగులపల్లి ఎస్.ఐ. సురేష్ యాదవ్ను డిఎస్పీ ఆదేశించారు.

చట్టపరమైన చర్యలు: కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశాలతో జిల్లా వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి నాగిరెడ్డి సైతం వృద్ధురాలితో మాట్లాడారు. ఇద్దరు కొడుకులను పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తామని, స్పందించకపోతే వయోవృద్ధుల సంక్షేమ చట్టం (Senior Citizens Act) ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కన్నతల్లి పట్ల నిర్దయగా వ్యవహరించిన కొడుకుల తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా, తక్షణమే స్పందించి అండగా నిలిచిన పోలీస్, రెవెన్యూ అధికారులను గ్రామస్తులు అభినందించారు.

Share
Share