- తాజ్ ఫలక్‌నుమాలో సీఎం మర్యాదపూర్వక సమావేశం..
- మూసీ పునరుజ్జీవనం, ఉస్మానియా, సిటీ కాలేజ్ భవనాల పునరుద్ధరణపై చర్చ
హైదరాబాద్, ఏపీబీ న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ఆగా ఖాన్ ఫౌండేషన్ (Aga Khan Foundation) ద్వారా మరింత సహకారం అందించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. భారత పర్యటనలో ఉన్న ఆగా ఖాన్ ఫౌండేషన్ చైర్మన్ హిజ్ హైనెస్ ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-V (Prince Rahim Aga Khan-V) హైదరాబాద్ వచ్చిన సందర్భంగా నగరం లోని తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ముఖ్యమంత్రి ఆయనతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు.
రాష్ట్రంలోని విద్యా, పర్యాటక, వైద్య రంగాలు మరియు చారిత్రక వారసత్వ సంపద పునరుద్ధరణలో కలిసి పనిచేయాలని సీఎం కోరారు.
వారసత్వ సంపద పునరుద్ధరణలో కీలక పాత్ర!
హైదరాబాద్ నగరంతో ఆగా ఖాన్ కుటుంబానికి ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేసుకున్నారు. ఫౌండేషన్ సహకారంతో ఇటీవల శాసనమండలి భవనం, అలాగే కుతుబ్ షాహీ టూంబ్స్ ను అద్భుతంగా పునరుద్ధరించిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఆగా ఖాన్ ఫౌండేషన్‌పై తమకు అత్యంత గౌరవం ఉందని తెలిపారు.
మూసీ పునరుజ్జీవనం – ఉస్మానియా, సిటీ కాలేజ్ భవనాల రీస్టోరేషన్!
హైదరాబాద్ నగర పునర్నిర్మాణంలో భాగంగా మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు ప్రణాళికలను సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.
సమావేశంలోని ముఖ్యమైన ప్రతిపాదనలు & చర్చలు:
నైట్ ఎకానమీ & హెరిటేజ్: మూసీ నది వెంట నైట్ ఎకానమీ కార్యకలాపాలు తీర్చిదిద్దుతున్నామని, పరివాహక ప్రాంతంలో ఉన్న చారిత్రక సిటీ కాలేజ్, ఉస్మానియా ఆసుపత్రి భవనాల పునరుద్ధరణలో ఫౌండేషన్ సహకరించాలని కోరారు.
ఉస్మానియా కొత్త భవనం: ఉస్మానియా ఆసుపత్రి కోసం గోషామహల్లో నూతన భవనాన్ని నిర్మిస్తున్నామని, ప్రస్తుత పాత భవనాన్ని వారసత్వ సంపద (Heritage Site) గా తీర్చిదిద్దాలని భావిస్తున్నట్లు వివరించారు.
ఫ్యూచర్ సిటీలో ఆగా ఖాన్ యూనివర్సిటీ: భారత్ ఫ్యూచర్ సిటీలో ‘ఆగా ఖాన్ యూనివర్సిటీ’ ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణా కోరారు.

ఫ్యూచర్ సిటీపై ఆసక్తి – గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానం!
డిసెంబర్ 7 నుండి 9 వరకు మూడు రోజుల పాటు భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించబోయే ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’ కు హాజరు కావాలని ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-Vని సీఎం ఆహ్వానించారు. ఈ సమ్మిట్‌కు 100కు పైగా దేశాల ప్రతినిధులు హాజరవుతున్నట్లు తెలిపారు.
30 వేల ఎకరాల్లో, శంషాబాద్ విమానాశ్రయానికి కేవలం 20 నిమిషాల దూరంలో నెట్-జీరో సిటీ (Net-Zero City) గా రూపుదిద్దుకుంటున్న ఫ్యూచర్ సిటీ ప్రాధాన్యతను ప్రిన్స్ ఆగా ఖాన్ అడిగి తెలుసుకున్నారు. సింగపూర్ సంస్థ దీనికి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తోందని, 15 వేల ఎకరాల్లో గ్రీన్ జోన్ నిర్మిస్తున్నామని సీఎం తెలిపారు. 2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సీఎం సలహాదారు కె. రామకృష్ణా రావు, మంత్రి మహమ్మద్ అజారుద్దీన్, సీఎస్ సంజయ్ జాజు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ వాణీ ప్రసాద్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.