APB News Exclusive: కేటీఆర్‌ పాదయాత్రపై సస్పెన్స్‌!

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: సాగర్ ఎడమ కాలువకు సాగునీటి విడుదలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించిన పాదయాత్రపై ఉత్కంఠ నెలకొంది. మిర్యాలగూడలో నిర్వహించిన రైతు ధర్నా సభలో సాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. ప్రభుత్వం స్పందించకపోతే హాలియా నుంచి కోదాడ వరకు పాదయాత్ర చేపడతానని కేటీఆర్ ప్రకటించి పది రోజులు దాటింది. అయితే ఇప్పటివరకు సాగర్ నీటి విడుదలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టమైన షెడ్యూల్ వెలువడలేదు. దీంతో కేటీఆర్ ప్రకటించిన పాదయాత్ర కార్యరూపం దాల్చుతుందా? లేదా? అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

కేటీఆర్ ప్రకటించిన గడువు నేపథ్యంలో 14 తర్వాతే తదుపరి కార్యాచరణపై స్పష్టత వచ్చే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. మరోవైపు సోమవారం గణేష్ పండుగ ఉండటంతో రాజకీయ కార్యక్రమాల విషయంలోనూ కొంత విరామం ఉండే అవకాశం కనిపిస్తోంది. దీంతో గణేష్ పండుగ తర్వాత బీఆర్ఎస్ ఏ నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

సాగర్ ఎడమ కాలువ కింద ఆయకట్టు ప్రాంతాల్లో సాగునీటి సమస్య తీవ్రతరం అవుతున్న తరుణంలో కేటీఆర్ ప్రకటనకు ప్రాధాన్యం ఏర్పడింది. ఒకవైపు సాగర్ నీటి విడుదలపై రైతుల్లో ఆందోళన కొనసాగుతుండగా.. మరోవైపు ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నీటి పరిస్థితులు కూడా చర్చకు వస్తున్నాయి.

పోతిరెడ్డిపాడు వద్ద 9వ గేట్ కొట్టుకుపోవడం, శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వలు తగ్గుతున్న పరిస్థితులతో సాగర్కు వచ్చే నీటి లభ్యతపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో సాగర్ ఎడమ కాలువకు నీటిని ఎప్పుడు విడుదల చేస్తారు? ఎంత మేరకు విడుదల చేస్తారు? ఆయకట్టుకు అవసరమైన నీటిని అందించేందుకు ప్రభుత్వం ఎలాంటి కార్యాచరణ చేపడుతుంది? అన్నది రైతుల్లో ప్రధాన ప్రశ్నగా మారింది.

నల్లగొండ జిల్లాలో ఇప్పటికే సాగునీటి అంశం సున్నితంగా మారింది. సాగర్ ఆయకట్టు రైతులకు నీటి అవసరం ఉన్న సమయంలో విడుదలపై స్పష్టత లేకపోవడంతో ప్రభుత్వం నిర్ణయం కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ఈ అంశాన్ని బీఆర్ఎస్ రాజకీయంగా ఎంతవరకు ఉద్యమంగా మలుస్తుందన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఇదే సమయంలో రాష్ట్ర రాజకీయాల్లోనూ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అసెంబ్లీ వద్ద చోటుచేసుకున్న ఘటన నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్ జరిగింది. పోలీసులకు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మధ్య చోటుచేసుకున్న తోపులాట వ్యవహారం కూడా రాజకీయంగా వేడి పెంచింది.

ఇలాంటి పరిస్థితుల్లో సాగర్ నీటి సమస్యపై కేటీఆర్ పాదయాత్ర చేపడితే అది కేవలం సాగునీటి ఉద్యమంగా కాకుండా ప్రభుత్వంపై బీఆర్ఎస్ చేపట్టే మరో రాజకీయ పోరాటంగా మారే అవకాశం ఉంది. దీంతో కేటీఆర్ తదుపరి అడుగు ఏమిటన్నదానిపై రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

సాగర్ నీటి విడుదలపై పాదయాత్ర చేస్తానని కేటీఆర్ మిర్యాలగూడ సభలో ప్రకటించి దాదాపు పది రోజులు కావస్తోంది. అయితే ఆయన ప్రకటనపై పార్టీ లోపల, బయట ఆశించిన స్థాయిలో చర్చ లేదా స్పందన కనిపించలేదన్న అభిప్రాయాలు బీఆర్ఎస్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ప్రధానంగా సాగర్ ఆయకట్టు పరిధిలో బీఆర్ఎస్ రాజకీయంగా ఇంకా పుంజుకోవాల్సి ఉందన్న చర్చ పార్టీ నాయకుల్లో ఉంది. నల్లగొండ, దేవరకొండ, మిర్యాలగూడ, నాగార్జునసాగర్, హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాల్లో పార్టీకి గతంలో ఉన్న బలం పూర్తిస్థాయిలో తిరిగి రాలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఈ పరిస్థితుల్లో కేటీఆర్ పాదయాత్ర ప్రారంభించి.. ఆశించిన స్థాయిలో రైతులు, ప్రజలు తరలిరాకపోతే రాజకీయంగా ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందన్న ఆందోళన కూడా కొందరు నాయకుల్లో ఉన్నట్లు తెలుస్తోంది.

మిర్యాలగూడలో నిర్వహించిన రైతు ధర్నాను బీఆర్ఎస్ నాయకత్వం భారీగా చేపట్టి విజయవంతం చేసింది. అయితే ధర్నా తరహాలోనే హాలియా నుంచి కోదాడ వరకు పాదయాత్రను విజయవంతం చేయడం అంత సులభం కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పాదయాత్రకు మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్చార్జులు, ముఖ్య నాయకులు, పార్టీ కేడర్ ఎంతమేరకు సమన్వయంతో పనిచేస్తారన్నది కీలకంగా మారింది. కేటీఆర్ యాత్రకు భారీగా జన సమీకరణ చేయాలంటే ప్రతి నియోజకవర్గం నుంచి నాయకత్వం బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ప్రత్యేకంగా సూర్యాపేటలో మాజీ మంత్రి జగదీశ్రెడ్డి సీరియస్గా వ్యవహరించడం మాత్రమే సరిపోదని.. నల్లగొండ నుంచి కోదాడ వరకు అన్ని నియోజకవర్గాల్లో పార్టీ కేడర్ కదిలితేనే యాత్రకు ఆశించిన స్థాయిలో ఊపు వస్తుందని నాయకులు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం.

మరోవైపు ప్రభుత్వం సాగర్ నీటి విడుదలపై అధికారిక షెడ్యూల్ ప్రకటిస్తే కేటీఆర్ తన పాదయాత్రపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వం నీటి విడుదలపై స్పష్టత ఇస్తే రాజకీయంగా కేటీఆర్ ప్రకటించిన పాదయాత్రకు అవసరం లేకుండా పోయే పరిస్థితి ఏర్పడవచ్చు. అదే సమయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోతే రైతుల సమస్యను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పాదయాత్రకు వెళ్లాల్సిన పరిస్థితి బీఆర్ఎస్కు ఏర్పడవచ్చు.

అయితే యాత్ర ప్రకటించినప్పటి నుంచి ఇప్పటివరకు పార్టీ యంత్రాంగం స్థాయిలో పెద్దగా కదలిక కనిపించకపోవడం కూడా చర్చకు దారితీస్తోంది. పాదయాత్రపై పార్టీ నాయకత్వం నుంచి అధికారిక కార్యాచరణ ఎప్పుడు వెలువడుతుంది? ఎవరు బాధ్యతలు తీసుకుంటారు? ఏ ప్రాంతాల్లో సభలు, రైతులతో సమావేశాలు నిర్వహిస్తారు? అన్నదానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

సాగర్ నీటి విడుదలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా? లేక కేటీఆర్ ప్రకటించిన పాదయాత్రను బీఆర్ఎస్ ముందుకు తీసుకెళ్తుందా? అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ముఖ్యంగా గణేష్ పండుగ తర్వాత, 14 నుంచి కేటీఆర్ పాదయాత్రపై స్పష్టత వచ్చే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది.

Share
Share