Breaking News: మోతే దంపతుల హత్య కేసు.. ప్రధాన నిందితుడైన కానిస్టేబుల్ మహమ్మద్ షరీఫ్ ఉద్యోగం నుంచి డిస్మిస్

సూర్యాపేట ప్రతినిధి, ఏపీబీ న్యూస్: సూర్యాపేట జిల్లా మోతే మండల కేంద్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన భార్యాభర్తల జంట హత్య కేసులో జిల్లా పోలీస్ యంత్రాంగం కఠిన చర్యలు చేపట్టింది. ఈ దారుణ హత్యోదంతంలో ప్రధాన నిందితుడిగా ఉన్న మోతే పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ మహమ్మద్ షరీఫ్ను ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగిస్తూ (డిస్మిస్) జిల్లా ఎస్పీ కె. నరసింహ, ఐపీఎస్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

మోతే మండల పరిధిలోని వ్యవసాయ భూమిలో పాతిపెట్టిన దంపతుల మృతదేహాల ఘటనపై మోతే పిఎస్లో కేసు నమోదవగా, ఉన్నతాధికారుల పర్యవేక్షణలో సాంకేతిక ఆధారాలతో కేవలం 24 గంటల వ్యవధిలోనే నిందితులను పట్టుకుని రిమాండ్కు తరలించిన విషయం తెలిసిందే.

ఉద్యోగం నుంచి డిస్మిస్: చట్టాన్ని కాపాడాల్సిన రక్షక భటుడే ఈ ఘాతుకానికి ఒడిగట్టడాన్ని తీవ్రంగా పరిగణించిన ఎస్పీ నరసింహ ఐపీఎస్, సదరు కానిస్టేబుల్ మహమ్మద్ షరీఫ్ను డిపార్ట్మెంట్ నుంచి శాశ్వతంగా డిస్మిస్ చేస్తూ తక్షణ ఆదేశాలిచ్చారు.

ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు: ఈ దంపతుల హత్య కేసులో తీవ్రమైన సెక్షన్లతో పాటు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు.

డీఎస్పీ నేతృత్వంలో దర్యాప్తు: ఈ కేసు దర్యాప్తు అధికారిగా డీఎస్పీ (DSP) స్థాయి అధికారిని నియమించారు.

ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు కేసు: కేసులో త్వరితగతిన విచారణ పూర్తయి నిందితులకు కఠిన శిక్ష పడేలా కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు బదిలీ చేయనున్నట్లు ఎస్పీ తెలిపారు.

బాధిత కుటుంబానికి పరిహారం: బాధితులకు ప్రభుత్వం ద్వారా రావాల్సిన నష్టపరిహారం (Compensation) త్వరగా అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ స్పష్టం చేశారు.

శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా, నేరాలకు పాల్పడినా సొంత శాఖకు చెందిన వారైనా సరే ఎంత మాత్రం ఉపేక్షించేది లేదని, చట్టం ముందు అందరూ సమానులేనని ఈ కఠిన చర్య ద్వారా సూర్యాపేట జిల్లా పోలీస్ యంత్రాంగం స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది.

Share
Share