- పదవి మారినా తగ్గని పెద్దరికం..
- భార్య గౌరవమే తన గౌరవంగా భావిస్తున్న బుర్రి శ్రీనివాస్రెడ్డి
- నల్గొండ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారిన మాజీ చైర్మన్ వైఖరి
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్గొండ రాజకీయాల్లో ఒకప్పుడు పదవిలో ముందుండి నడిపించిన నాయకుడు.. ఇప్పుడు తన భార్యకు దక్కిన పదవికి వెన్నుదన్నుగా నిలుస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. ఆయనే బుర్రి శ్రీనివాస్రెడ్డి. నల్గొండ మున్సిపల్ వైస్ చైర్మన్గా పనిచేసిన ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్ల పాటు మున్సిపల్ చైర్మన్గా బాధ్యతలు నిర్వహించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా నల్గొండ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి శ్రీనివాస్రెడ్డి ఇప్పుడు ఒక కొత్త పాత్రలో కనిపిస్తున్నారు. తాను కూర్చోవాల్సిన కుర్చీలో తన భార్య కూర్చుంటే.. ఆమె వెనుక నిలబడి గౌరవం ఇస్తున్నారు. పదవి తన చేతిలో ఉన్నప్పుడు ముందుండి నడిపించిన ఆయన.. ఇప్పుడు తన భార్య మేయర్గా ఉన్న సమయంలో ఆమెకు అండగా వెనుక నిలబడటం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు కారణమవుతోంది.
‘ఆమె హోదా.. నా గౌరవం’ అన్నట్టుగా..
నల్గొండ కార్పొరేషన్ తొలి మహిళా మేయర్గా బుర్రి చైతన్య బాధ్యతలు చేపట్టడంతో ఆమెకు ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రకారం ప్రత్యేక గౌరవం లభిస్తోంది. అయితే ఆ గౌరవాన్ని తన భార్యకే పరిమితం చేయకుండా.. ఆమె పదవిని, ఆమె హోదాను తానే గౌరవిస్తూ కార్యక్రమాల్లో ఆమెకు తోడుగా నిలుస్తున్నారు శ్రీనివాస్రెడ్డి. మంగళవారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నల్గొండ పర్యటనలో ఈ దృశ్యం ప్రత్యేకంగా కనిపించింది. వేదికపై మేయర్ చైతన్య కూర్చుని ఉండగా.. ఆమె వెనుక శ్రీనివాస్రెడ్డి నిలబడి ఉన్నారు. ఒకప్పుడు అదే రాజకీయ వేదికలపై కీలక స్థానంలో కూర్చున్న నాయకుడు.. ఇప్పుడు తన భార్యకు దక్కిన గౌరవాన్ని ఆమెకే వదిలేసి వెనుక నిలబడటం అక్కడున్న వారిని ఆకట్టుకుంది.
రాజకీయాల్లో అరుదైన దృశ్యం..
సాధారణంగా భార్య పదవిలో ఉన్నప్పుడు భర్త రాజకీయంగా ముందుండాలని కోరుకునే పరిస్థితులు కనిపిస్తాయి. కానీ శ్రీనివాస్రెడ్డి తీరు అందుకు భిన్నంగా కనిపిస్తోంది. ‘భార్య ఎదగడం అంటే తాను వెనక్కి తగ్గడం కాదు.. కుటుంబం, రాజకీయ ప్రయాణం మరో మెట్టు ఎక్కడం’ అన్నట్లుగా ఆయన వ్యవహరిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
ఒకప్పుడు మున్సిపల్ చైర్మన్ హోదాలో కుర్చీలో కూర్చున్న శ్రీనివాస్రెడ్డి.. ఇప్పుడు మేయర్ హోదాలో భార్య కూర్చున్నప్పుడు ఆమె వెనుక నిలబడటం రాజకీయాల్లో పదవుల కంటే వ్యక్తిత్వం, పరస్పర గౌరవం ఎంత ముఖ్యమో చెప్పే దృశ్యంగా పలువురు అభివర్ణిస్తున్నారు. పదవి మారింది.. స్థానం మారింది.. కానీ శ్రీనివాస్రెడ్డి పెద్దరికం మాత్రం మారలేదు. ఇప్పుడు ఆయన కూర్చున్న కుర్చీ వెనుక కాదు.. తన భార్య వెనుక నిలబడి కనిపిస్తున్నారు.