- కార్, బైక్, ఆటో ఏదైనా సరే రాత్రింబవళ్లు ఉచితంగా సాయం..
- మనసున్న మెకానిక్ రియల్ గుడ్ సమరిటన్ సేవలు
- భూపాలపల్లిలో వాహనం పంక్చర్ అయితే ఈ నంబర్‌కు ఫోన్ చేయండి..
జయశంకర్ భూపాలపల్లి, ఏపీబీ న్యూస్: “డబ్బు కంటే మనుషుల ప్రాణాలు, వారి కష్టాల్లో తోడుగా నిలబడటమే ముఖ్యం” అని నిరూపిస్తున్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన ఓ సాధారణ మెకానిక్. వ్యాపారాలన్నీ లాభాలే ధ్యేయంగా సాగుతున్న ఈ రోజుల్లో.. నిరుపేదలు, ప్రయాణికులు అర్ధరాత్రి వేళల్లో వాహనాలు నిలిచిపోయి పడే కష్టాలను చూసి చలించిపోయిన ఆ మెకానిక్ ఉదారత చూపుతూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన సయ్యద్ రహీమ్ పాషా వృత్తిరీత్యా పంక్చర్ షాప్ మెకానిక్. భూపాలపల్లి పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా ద్విచక్ర వాహనం, కారు, ఆటో లేదా ఎలాంటి వాహనమైనా పంక్చర్ పడితే తక్షణమే తనకు చేతనైనంత సాయం చేస్తానని ముందుకు వచ్చారు.
రియల్ హీరో రహీమ్ పాషా:
ఎప్పుడైనా ఫోన్ చేయవచ్చు: భూపాలపల్లి పరిధిలో ఏ ప్రయాణికుడి వాహనమైనా పంక్చర్ అయి ఇబ్బంది పడుతుంటే 8179932177 నంబర్‌కు కాల్ చేస్తే తాను వచ్చి పంక్చర్ వేస్తానని తెలిపారు.
డబ్బుల్లేకున్నా పరవాలేదు: ప్రయాణికుల వద్ద డబ్బులు లేకపోయినా పర్వాలేదని, మనుషులకు సాయపడటమే తన ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు.
ప్రయాణికులకు బిగ్ రిలీఫ్:
అర్ధరాత్రి వేళల్లో అటవీ ప్రాంతాలు, నిర్మానుష్యమైన రోడ్లపై వాహనాలు చెడిపోతే భయపడే వారికి రహీమ్ పాషా ఉదార స్వభావం ఎంతో కొండంత అండగా నిలుస్తోంది. ఆపదలో ఉన్నవారికి డబ్బులతో సంబంధం లేకుండా ఆపద్బాంధవుడిలా నిలుస్తున్న రహీమ్ పాషాను భూపాలపల్లి ప్రజలు, వాహనదారులు, నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. మనసుండాలే గానీ సాయం చేయడానికి ఆస్తిపాస్తులతో పనిలేదని ఆయన నిరూపిస్తున్నారు.