- డబుల్ డోర్ నంబర్లు.. తక్కువ అసెస్మెంట్లతో కార్పొరేషన్ ఆదాయానికి భారీ గండి
- షాపింగ్ మాల్స్, ఆస్పత్రులు, విద్యాసంస్థలకు పన్ను తగ్గింపులపై ఆరోపణలు..
- కొలతలు తగ్గించి.. అంతస్తులు దాచి.. కమర్షియల్ ఓనర్లకు దోచిపెడుతున్న సిబ్బంది
- టాప్ 100 మంది జాబితాలోనే రూ.4.42 కోట్ల బకాయిలు
- సీఎమ్మార్(CMR) బకాయిలు ఎగ్గొట్టిన మిల్లర్లతో సహా బడాబాబులు
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఆస్తి పన్నుల వ్యవస్థలో భారీ అవకతవకలు జరుగుతున్నాయన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. సామాన్యుల కంటే ప్రధానంగా కమర్షియల్ బిల్డింగ్స్, ప్రైవేటు ఆస్పత్రులు, విద్యా సంస్థలు, షాపింగ్ మాల్స్, ఫంక్షన్ హాల్స్ వంటి పెద్ద సంస్థలకే డబుల్ డోర్ నంబర్లు కేటాయించడంతో పన్ను ఎగవేతకు అవకాశం కల్పించారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. దీనికి తోడు కమర్షియల్ భవనాల రీ -అసెస్మెంట్లో కొలతలు తగ్గించడం, అదనపు అంతస్తులను నమోదు చేయకపోవడం, సెల్లార్లు, బాల్కనీలు, ప్లింత్ ఏరియాలను లెక్కలోకి తీసుకోకపోవడం వంటి అక్రమాల కారణంగా కార్పొరేషన్‌కు ప్రతి ఏడాది కోట్ల రూపాయల వరకు ఆదాయం నష్టపోతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. డబుల్ డోర్ నంబర్ల వ్యవహారంలో ఒకే కమర్షియల్ భవనానికి రెండు నంబర్లు కొనసాగుతున్నా, ఒక నంబర్‌కు మాత్రమే పన్ను చెల్లించి మరో నంబర్‌పై బకాయిలు పేరుకుపోయే పరిస్థితి ఉందని చెబుతున్నారు. అయితే డబుల్ నంబర్ తొలగించాలని యజమానులు కోరితే ముందుగా బకాయిలు మొత్తం చెల్లించాలని అధికారులు షరతు పెడుతుండటం కూడా అక్రమాలకు దారితీసింది. దీంతో అసలు సమస్య పరిష్కారం కాకుండా రికార్డుల్లో ఓవర్డ్యూలు పెరుగుతూనే ఉన్నాయని అంటున్నారు.
పన్ను ఎగవేతలో ఇదో రకం మోసం..
మున్సిపల్ రికార్డుల్లో డోర్ నంబర్లకు అనుసంధానమైన యజమానుల పేర్లు ఉన్నప్పటికీ, ఫీల్డ్ స్థాయిలో అదే భవనాల్లో ప్రస్తుతం నడుస్తున్న కమర్షియల్ సంస్థలు, ఆస్పత్రులు, విద్యాసంస్థలు, షాపింగ్ మాల్స్ పేర్లు కనిపించకపోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది. డాక్యుమెంట్లలో యజమానులు ఒకరు, భవనాలను లీజుకు తీసుకుని వ్యాపారాలు నిర్వహిస్తున్న వారు మరొకరు కావడంతో పన్ను వసూళ్లు, బాధ్యతల విషయంలో గందరగోళం ఏర్పడి, అదే పన్ను ఎగవేతకు అవకాశం కల్పిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై సమగ్రంగా పరిశీలిస్తే అసలు లబ్ధిదారులు, వాస్తవ వినియోగదారులు బయటపడే అవకాశం ఉన్నప్పటికీ ఆ దిశగా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. మున్సిపల్ అధికారుల ప్రమేయంతో కమర్షియల్ భవనాల పన్నులను భారీగా తగ్గించి, ఆ మొత్తాన్ని తమ జేబుల్లో వేసుకుంటుండటంతో కార్పొరేషన్ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. ఈ వ్యవహారంలో పైస్థాయి నుంచి కింది స్థాయి వరకు అందరికి వాటాలు వెళ్తుంటాయని సీనియర్ ఆఫీసర్ ఒకరు ఏపీబీతో చెప్పడం గమనార్హం.
పన్నుల అంచనాల్లో భారీ అవతవకలు..
కమర్షియల్ భవనాల పన్ను అంచనాల్లోనూ భారీ వ్యత్యాసాలు ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఏడాదికి రూ.5 లక్షల వరకు పన్ను పడాల్సిన భవనాలకు రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర మాత్రమే విధిస్తున్నారని, కొలతలు తగ్గించడం, ఒక అంతస్తును ఉద్దేశపూర్వకంగానే నమోదు చేయక పోవడం, సెల్లార్‌ను స్టిల్ట్గా చూపించడం, అదనపు అంతస్తులకు పన్ను విధించకపోవడం వంటి అక్రమాల ద్వారా కార్పొరేషన్ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. భవనం మొత్తం విస్తీర్ణాన్ని నమోదు చేయకుండా కొలతలు తగ్గించడం, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అంతస్తులను నమోదు చేయకపోవడం, బాల్కనీలు, ప్లింత్ ఏరియాలను లెక్కలోకి తీసుకోకపోవడం వంటి పద్ధతుల ద్వారా పన్ను భారాన్ని తగ్గిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ప్రజాప్రతినిధుల జోక్యంతోనే..
మున్సిపల్ వర్గాల సమాచారం ప్రకారం, గతంలో అప్పటి కమిషనర్ రమణా చారి హయాంలో మాంగల్య షాపింగ్ మాల్ కు సుమారు రూ.5,6 లక్షల మేర ఆస్తి పన్ను అంచనా వేయగా, ప్రజాప్రతినిధుల జోక్యంతో ఆ పన్ను రూ.2.50 లక్షల వరకు తగ్గించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీని పక్కనే ఉన్న మరో షాపింగ్ మాల్ పన్ను అంచనాలో కూడా భారీ తేడాలు ఉన్నాయని చెప్తున్నారు. మిషనరీల ముసుగులో లక్షల రూపాయాల ఫీజులు వసూలు చేస్తున్న విద్యాసంస్థల నుంచి సైతం అప్పటి కమిషనర్ రమణా చారి కఠినంగానే వ్యవహరించి పన్నులు వసూలు చేశారనే అభిప్రాయం అధికార వర్గాల్లో ఉంది. కానీ ఇప్పుడు అదే విద్యాసంస్థల్లో తమవాళ్లకు సీట్లు ఇప్పించుకునేందుకు పన్నులు కట్టకపోయినా పరోక్షంగా సహరిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. జీ ప్లస్-2 అనుమతి తీసుకుని అదనంగా అంతస్తులు నిర్మించినా వాటిని రికార్డుల్లో చూపించకుండా మున్సిపల్ సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నారని తెలుస్తోంది. ఈ భవనాలన్నింటిని జీఐఎస్(GIS) మ్యాపింగ్, ఫిజికల్ వెరిఫికేషన్ ఆధారంగా పునఃపరిశీలించి రీ–అసెస్మెంట్ చేస్తే కార్పొరేషన్‌కు అదనంగా కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశముందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
వంద మంది బడాబాబుల్లో కొందరు..
కార్పొరేషన్ టాప్-100 బకాయిదారుల జాబితా పరిశీలిస్తే భారీ కమర్షియల్ సంస్థలు, రైస్ మిల్లర్లు, విద్యాసంస్థలు, సామాజిక సంస్థలు కూడా ఉండటం గమనార్హం. ఇటీవల సీఎమ్మార్ బియ్యం అక్రమాల కేసులో అరెస్టై జైలు పాలైన కొందరు బడా రైస్ మిల్లర్ల పేర్లు కూడా ఈ జాబితాలో కనిపిస్తున్నాయి. సుమాంజలి పారాబాయిల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కందుకూరి మహేందర్‌పై రూ.6,66,817, రామ్ లక్ష్మణ్ పారాబాయిల్డ్ ఓనర్ కొండా లక్ష్మయ్యపై రూ.4,69,227 బకాయిలు నమోదయ్యాయి. అలాగే సీపీఎం డివిజన్ కార్యాలయానికి రూ.6,79,832, కాకతీయ ఎడ్యుకేషన్ సొసైటీకి రూ.18,26,977, గౌరు తిరుపతి రెడ్డికి రూ.7,13,9 28, ఏజీఓ(AGO) పబ్లికేషన్స్ లిమిటెడ్‌కు రూ.5,35,728, నల్లగొండ లయన్స్ క్లబ్‌కు రూ.3,03,254, మిషన్ కాంపౌండ్‌కు రూ.2,37,120 బకాయిలు ఉన్నట్లు కార్పొరేషన్ రికార్డులు చెబుతున్నాయి.
టాప్-100 బకాయిదారులపై మొత్తం పాత బకాయిలు
కార్పోరేషన్ నోటీసులు జారీ చేసిన టాప్ 100 మంది సంబంధించిన పన్నుల బకాయిలు రూ.1,76,43,286 ఉండగా, వాటిపై విధించిన పెనాల్టీ రూ.1,74,92,206కు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి చెల్లించాల్సిన పన్ను రూ.89,82,878, దానిపై పెనాల్టీ రూ.82,593తో కలిపి మొత్తం బకాయిలు రూ.4,42,00,763కు చేరినట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. భారీ బకాయిలు పేరుకుపోయినా వసూళ్లలో ఆశించిన పురోగతి లేకపోవడం, మరోవైపు కమర్షియల్ భవనాల పన్ను తగ్గింపులో పాల్పడుతున్న అవకతవకలపై ఆరోపణలు రావడం కార్పొరేషన్ పన్నుల వ్యవస్థపైన మరిన్ని ప్రశ్నలు లేవనెత్తుతోంది.