హైదరాబాద్/అమరావతి, ఏపీబీ న్యూస్: రంగారెడ్డి జిల్లా షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలికపై జరిగిన అమానుష ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. ఈ దారుణ ఘటన పూర్తిగా పోలీసుల వైఫల్యమేనని ఆయన స్పష్టం చేశారు. బాధితులను కాపాడటంలో స్థానిక పోలీసులు ఘోరంగా విఫలమయ్యారని ఆరోపిస్తూ.. ఈ వ్యవహారంపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కి పవన్ కళ్యాణ్ ఒక బహిరంగ లేఖ రాశారు. పోక్సో (POCSO) చట్టం పరిధిలో నిందితుడిపై గతంలోనే కేసులు ఉన్నప్పటికీ.. అతనికి బెయిల్ లభించడం పోలీసుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన దుయ్యబట్టారు.
ఈ తాజాఏపీ డిప్యూటీ సీఎం కామెంట్స్ సామాజిక వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. పోక్సో నిందితులకు బెయిల్ రాకుండా ప్రభుత్వం లీగల్ కౌంటర్లను పటిష్టంగా దాఖలు చేయాలని పవన్ కళ్యాణ్ తన లేఖ ద్వారా డిమాండ్ చేశారు.
పోక్సో నిందితులకు బెయిల్ ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరం
తెలంగాణలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు మహిళలు, ముఖ్యంగా చిన్న పిల్లల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరారు.
బెయిల్ రాకుండా అడ్డుకోవాలి: తీవ్రమైన పోక్సో (POCSO) చట్టం కింద కేసులు నమోదైన నిందితులకు సులభంగా బెయిల్ రాకుండా ప్రభుత్వం న్యాయస్థానాల్లో తీవ్రంగా వ్యతిరేకించాలని, తగిన లీగల్ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
తక్షణ ఎఫ్ఐఆర్ నమోదు: రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 (జీవించే హక్కు), ఆర్టికల్ 39 (పిల్లల సంరక్షణ, హక్కుల రక్షణ) ప్రకారం ప్రతి బిడ్డ హక్కును కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. పోక్సో పరిధిలోకి వచ్చే కేసుల్లో ఎటువంటి ప్రాథమిక విచారణ (Preliminary Inquiry) లేకుండానే తక్షణమే ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేయాలని స్పష్టం చేశారు.
బాధితులకు పటిష్ట రక్షణ: కేసు నమోదు చేసిన తర్వాత బాధితులకు మరియు వారి కుటుంబ సభ్యులకు నిందితుల నుండి ఎలాంటి ప్రాణహాని లేకుండా పటిష్టమైన రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
పోక్సో చట్టాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాలి
తెలంగాణలో పోక్సో చట్టాన్ని పూర్తిస్థాయిలో, కఠినంగా అమలు చేయాలని పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. షాబాద్ ఘటనలో పోలీసులు ముందుస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఇంతటి దారుణం జరిగిందని, భవిష్యత్తులో ఇలాంటి లీగల్ లోపాలు పునరావృతం కాకుండా చూడాలని లేఖలో కోరారు. ఏపీలో సైతం మహిళల భద్రతకు సంబంధించి తాము తీసుకుంటున్న కఠిన చర్యలను ప్రస్తావిస్తూ.. తెలుగు రాష్ట్రాల్లో ఆడబిడ్డల రక్షణ విషయంలో ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.