Breaking News: భట్టి కాన్వాయ్ రూట్ మార్పు.. కోదాడ రూరల్ ఎస్‌ఐ గోపాల్‌పై వేటు

సూర్యాపేట బ్యూరో, ఏపీబీ న్యూస్: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భద్రత మునిసిపల్ పరిధిలో తీవ్ర కలకలం రేపిన రూట్ మార్పు వ్యవహారంలో సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. డిప్యూటీ సీఎం కాన్వాయ్ భద్రతలో తీవ్ర నిర్లక్ష్యం వహించినందుకు గానూ కోదాడ రూరల్ సబ్ ఇన్స్పెక్టర్ (SI) గోపాల్పై ఉన్నతాధికారులు వేటు వేశారు. ఈ మేరకు SI Gopal కు VR (వ్యాకన్సీ రిజర్వ్) ఉత్తర్వులు జారీ కావడం పోలీస్ వర్గాల్లో సంచలనంగా మారింది.

షెడ్యూల్ ప్రకారం వెళ్లాల్సిన విఐపి రూట్ను కాదని, డిప్యూటీ సీఎం కాన్వాయ్ను మరో మార్గంలోకి తీసుకెళ్లడం ఈ వివాదానికి దారితీసింది. అత్యంత సున్నితమైన విఐపి(VIP) ప్రోటోకాల్ లోపంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్వయంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోలీస్ శాఖ తక్షణ చర్యలకు ఉపక్రమించింది.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూర్యాపేట జిల్లా పర్యటనలో భాగంగా కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి గుండా వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిబంధనల ప్రకారం కాన్వాయ్ వెళ్లాల్సిన అధికారిక రూట్ను కాదని, ఎస్ఐ గోపాల్ కాన్వాయ్ను పూర్తిగా వేరే దారి మళ్లించినట్లు సమాచారం.

భద్రతా లోపంపై ఆగ్రహం: విఐపి మూవ్మెంట్ సమయంలో రూట్ మార్చడం భద్రతకు తీవ్ర ముప్పుగా పరిణమించే అవకాశం ఉండటంతో భట్టి విక్రమార్క ఈ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

టాప్ లెవల్ కంప్లైంట్: ఎస్ఐ గోపాల్ వ్యవహరించిన తీరుపై డిప్యూటీ సీఎం ఏకంగా రాష్ట్ర పోలీస్ బాస్ (DGP) కి స్వయంగా ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. విఐపి సెక్యూరిటీ ప్రోటోకాల్స్ అమలు చేయడంలో క్షేత్రస్థాయి అధికారుల అలసత్వాన్ని ఆయన డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫిర్యాదుతో రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది. ఈ భద్రతా లోపానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరపాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి.

ఉన్నతాధికారులపై నిఘా: ఈ రూట్ మార్పు నిర్లక్ష్యంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేవలం ఎస్ఐపైనే కాకుండా.. పర్యవేక్షణ లోపానికి గానూ జోనల్-2 ఐజీ (IG), అలాగే సూర్యాపేట జిల్లా ఎస్పీలను (SP) కూడా దీనిపై పూర్తి స్థాయి వివరణ ఇవ్వాల్సిందిగా కోరారు. విఐపి బందోబస్తు పర్యవేక్షణలో ఎక్కడ లోపం జరిగిందో నివేదిక సమర్పించాలని ఆదేశించారు.

ఉప ముఖ్యమంత్రి కాన్వాయ్ రూట్ మార్పు వ్యవహారంలో ప్రాథమిక ఆధారాలు మరియు ఉన్నతాధికారుల నివేదికల ఆధారంగా కోదాడ రూరల్ ఎస్ఐ గోపాల్ను విధులనుంచి తప్పించారు. ఆయన్ను తక్షణమే వీఆర్కు (Vacancy Reserve) అటాచ్ చేస్తూ సూర్యాపేట జిల్లా ఎస్పీ కార్యాలయం నుండి అధికారిక పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీ అయ్యాయి. విఐపి ప్రోటోకాల్స్ ఉల్లంఘిస్తే ఎంతటి అధికారులైనా ఉపేక్షించేది లేదని ఈ చర్య ద్వారా పోలీస్ శాఖ స్పష్టం చేసింది. ఈ ఘటనపై మరిన్ని అంతర్గత విచారణలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

Share
Share