Good News: రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు.. నియోజకవర్గానికి 2 వేల చొప్పున మంజూరు..

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ జిల్లాకు రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద 12 వేల ఇళ్లు మంజూరయ్యాయి. జిల్లాలోని ఆరు నియోజకవర్గాలకు రెండువేల చొప్పున ఇళ్లను ప్రభుత్వం కేటాయించింది. వీటిలో ఇళ్లులేని పేద కుటుంబాలకు 1,500 ఇళ్లు, పెంకులు లేదా రేకులతో ఉన్న ఇళ్లపై స్లాబ్ నిర్మించుకునేందుకు 500 ఇళ్లు కేటాయించారు. మొత్తం ఇళ్లలో 60 శాతం గ్రామీణ ప్రాంతాలకు, 40 శాతం పట్టణ ప్రాంతాలకు కేటాయించినట్లు అధికారులు తెలిపారు.

గృహ నిర్మాణ శాఖ నిర్వహించిన సర్వేలో జిల్లాలో 1,891 గుడిసెలు మాత్రమే గుర్తించినట్లు వెల్లడించారు. వీరితో పాటు గ్రామాలు, పట్టణాల్లో ఇళ్లులేని అర్హులైన ఇతర లబ్ధిదారులు ఉంటే ఎంపీడీఓ(MPDO)ల ద్వారా ప్రతిపాదనలు పంపవచ్చని సూచించారు. గెజిటెడ్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి అర్హత నిర్ధారించిన తర్వాత ఇళ్ల మంజూరుకు చర్యలు తీసుకోనున్నారు.

పెంకులు, రేకులతో ఉన్న ఇళ్లకు స్లాబ్ నిర్మించుకునే అవకాశం ఉంటే రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందించనున్నారు. ఇందుకు ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్ల ద్వారా ప్రతిపాదనలు పంపాల్సి ఉంటుంది.

రాష్ట్రాన్ని గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ప్రాధాన్యత ఇస్తోంది. ఇళ్లులేని పేదలకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించనుండగా, ఇప్పటికే గోడలు నిర్మించుకుని స్లాబ్ వేయాల్సిన ఇళ్లకు రూ.2 లక్షల సాయం అందించనుంది. గతంలో దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను మరోసారి పరిశీలించి అర్హులను ఎంపిక చేయనున్నారు.

జిల్లాలో గుర్తించిన 1,891 గుడిసెలను గెజిటెడ్ అధికారులు ప్రత్యక్షంగా సందర్శించి పరిస్థితులను పరిశీలించనున్నారు. అనంతరం ఏఈ(AE)లు, ఎంపీడీఓల నివేదికల ఆధారంగా తుది లబ్ధిదారుల జాబితా రూపొందించనున్నారు.

నల్లగొండ పట్టణంలో నిర్మించిన తొలి విడత డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మరమ్మతు పనులు పూర్తయిన వెంటనే పంపిణీ చేపట్టాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అధికారులను ఆదేశించారు. గత ఐదేళ్లుగా పంపిణీ కాకుండా పెండింగ్లో ఉండటంతో కొన్ని ఇళ్లలో విద్యుత్ వైరింగ్, తలుపులు, కిటికీలు దెబ్బతిన్నాయని తెలిపారు. మరమ్మతులు పూర్తి చేసిన తర్వాత వచ్చే నెలలో ఇళ్ల పంపిణీ చేపట్టనున్నారు.

గతంలో ఎంపికైన లబ్ధిదారులకే తొలి ప్రాధాన్యతతో ఇళ్లను కేటాయించనున్నారు. డబుల్ బెడ్రూమ్ కాలనీల్లో పార్కులు, ఇతర సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నారు. మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో దుకాణ సముదాయాలు ఏర్పాటు చేసి వాటి నిర్వహణను మహిళా సంఘాలకే అప్పగించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇప్పటికే కేటాయించిన ఇళ్లలో లబ్ధిదారులు చేరకపోతే రెండు నుంచి మూడు నెలలు వేచి చూసి, నిజమైన అర్హులు లేరని తేలితే ఆ కేటాయింపులను రద్దు చేసి ఇతర అర్హులకు అందజేస్తామని అధికారులు స్పష్టం చేశారు.

Share
Share