వేగం కాదు.. ప్రాణాలతో గమ్యం చేరడం ముఖ్యం: ఎస్పీ శరత్ చంద్ర పవార్

చిట్యాల/నల్లగొండ, ఏపీబీ న్యూస్: రాష్ట్ర ప్రభుత్వ “ప్రజా పాలనా – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ” లో భాగంగా నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని వెలిమినేడు (Veliminedu) గ్రామంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో “అరైవ్ అలైవ్” (Arrive Alive) రోడ్డు ప్రమాదాల నివారణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా డీజీపీ (టెక్నికల్ సర్వీసెస్) వి.వి. శ్రీనివాస్ రావు, ఐపీఎస్ మరియు నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ హాజరై రోడ్డు భద్రతపై గ్రామ ప్రజలకు, డ్రైవర్లకు విస్తృత అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా డీజీపీ వి.వి. శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలు కేవలం ఒక వ్యక్తి మరణానికి కారణం కాదని, ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితిని, పిల్లల భవిష్యత్తును పూర్తిగా అంధకారంలోకి నెట్టేస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు.

90 శాతం ప్రమాదాలకు కారణాలు: మితిమీరిన వేగం, ఓవర్ కాన్ఫిడెన్స్, రాంగ్ రూట్ డ్రైవింగ్, హెల్మెట్ లేకపోవడం వల్లే 90 శాతం మరణాలు సంభవిస్తున్నాయన్నారు. డ్రైవింగ్ సమయంలో మొబైల్ వాడకం, మద్యం సేవించడం ప్రాణాంతకమని హెచ్చరించారు.

గోల్డెన్ అవర్ & ₹1.50 లక్షల క్యాష్లెస్ చికిత్స: ప్రమాదం జరిగిన మొదటి గంట (Golden Hour) లో బాధితులను ఆసుపత్రికి చేరిస్తే ప్రాణాలు నిలబెట్టవచ్చని, ప్రమాద బాధితులకు రూ.1,50,000 వరకు క్యాష్లెస్ వైద్య సేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ రోడ్డు సేఫ్టీ కోసం రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు డీజీపీ తెలిపారు.

జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ మాట్లాడుతూ.. నల్లగొండ జిల్లాలో రోడ్డు ఇంజనీరింగ్ లోపాలను సరిచేయడం, ప్రమాద హెచ్చరిక బోర్డులు, బారికేడ్లు, ప్రాపర్ లైటింగ్ ఏర్పాటు చేయడం వల్ల వెలిమినేడు పరిధిలో ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గిందని గణాంకాలతో వివరించారు.

సంవత్సరంమరణాల సంఖ్య
202316 మంది
202413 మంది
20259 మంది
2026 (ఇప్పటివరకు)కేవలం 02

“మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎదుటివారి నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు జరగొచ్చు. అందుకే ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో డిఫెన్సివ్ డ్రైవింగ్ అలవాటు చేసుకోవాలి” అని ఎస్పీ సూచించారు.

పోలీస్ అధికారుల ప్రసంగానికి ప్రభావితులైన వెలిమినేడు గ్రామ ప్రజలు, సర్పంచ్ చంద్ర రెడ్డి ఆధ్వర్యంలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తమ గ్రామంలో ఎవరూ కూడా హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడపబోమని గ్రామ సభ వేదికగా ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ నిర్ణయాన్ని డీజీపీ, ఎస్పీ అభినందించారు. అనంతరం డ్రైవర్లు, ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని అధికారులు సందర్శించి, బాధితులకు ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేశారు. ఈ రోడ్డు భద్రతా అవగాహన సదస్సులో నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, జెడ్పీ సీఈఓ ప్రేమ్ కరుణ్ రెడ్డి, ఎస్బీ సీఐ ఆది రెడ్డి, నార్కట్పల్లి సీఐ నాగరాజు, ఎస్ఐలు రవి కుమార్, విష్ణు, డీటీఆర్బీ రిటైర్డ్ సీఐ అంజయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు మరియు గ్రామ యువత భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Share
Share