APB News Exclusive: మిర్యాలగూడెంలో ‘రౌడీల రాజ్యం’ 

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: మిర్యాలగూడెం నియోజకవర్గంలో రౌడీల రాజ్యం నడుస్తోందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. స్థానిక ప్రజా ప్రతినిధుల అండతో తాజా, మాజీ రౌడీషీటర్లు రెచ్చిపోయి వ్యాపారుల పైన దాదాగిరి ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా మిర్యాలగూడెం టౌన్లో పరిస్థితులు అదుపు తప్పుతున్నాయనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. అధికార పార్టీకి చెందిన కొందరు లీడర్ల మద్దతుతో రౌడీషీటర్లు బహిరంగంగానే తిరుగుతూ భయాందోళనలు సృష్టిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. రాత్రి వేళల్లో వీరి ఆగడాలు మరింత పెరుగుతున్నాయని, అర్ధరాత్రి 12 గంటలు దాటినా హోటళ్లు, రెస్టారెంట్లు, వైన్స్ షాపులు తెరిచే ఉంటున్నాయి. రోడ్లపై యువత గుంపులుగా చేరి హల్చల్ చేయడం, బహిరంగంగా మద్యం సేవించడం, బైక్ రేస్ వంటి ఘటనలు తరచుగా చోటు చేసుకుంటున్నాయని చెబుతున్నారు. దీంతో సామాన్య ప్రజలు రాత్రి వేళల్లో బయటకు రావడానికి కూడా భయపడుతున్నారు. అంతేగాక వివాదస్పద భూముల జోలికి వెళ్లడం, పాత పంచాయితీలను అడ్డం పెట్టుకుని ప్రతీకార దాడులకు పాల్పడుతున్నారు, ఎవరైన పోలీసు అధికారులు జోక్యం చేసుకునేందుకు ప్రయత్నిస్తే వాళ్ల పైన రాజకీయ ఒత్తిళ్లు తెస్తున్నారని తెలిసింది.

టౌన్లో ఎక్కడైనా బండి పెట్టాలంటే ముందుగా రూ.10 వేల ‘అడ్వాన్స్’ చెల్లించాల్సిందేనని, లేకపోతే బండి పెట్టనివ్వకుండా బెదిరింపులకు దిగుతున్నారు. అంతటితో ఆగకుండా ప్రతి నెల రూ.2,500 నుంచి రూ.3 వేల వరకు మంత్లీ మామూళ్లు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దందాతో చిరువ్యాపారులు ఆర్థికంగా నలిగిపోతున్నారని వాపోతున్నారు. ఇక రాత్రి వేళల్లో పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. పోలీస్ శాఖ రాత్రి 10.30 గంటలకే హోటళ్లు మూసేయాలని చెప్పినా, ఆ ఆదేశాలు కాగితాలకే పరిమితమయ్యాయి. అర్థరాత్రి 12.30 గంటలు దాటినా హోటళ్లు, రెస్టారెంట్లు, ఇడ్లీ బండ్లు తెరిచే ఉండటం వల్ల పట్టణంలో ‘నైట్ కల్చర్’ పేరిట అల్లర్లు పెరుగుతున్నాయని అంటున్నారు. ఓవైపు పట్టణ ప్రజలు దొంగలతో భయపడుతుంటే.. మరోవైపు గంజాయి సేవించిన యువత అర్థరాత్రి వరకు రోడ్ల పైనే హల్చల్ చేస్తుండటంతో భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్ఎస్పీ(NSP) క్యాంపు ఆఫీసు లాంటి ఏరియాల్లో కూడా విచ్చలవిడిగా హోటల్స్ పెడుతున్నారు. దీంతో ఆ ప్రాంతంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని స్థానికులు చెపుతున్నారు. నందిపాడు జంక్షన్, రాజీవ్ చౌరస్తాతో సహా ఇతర ప్రధాన జంక్షన్ల సమీప ప్రాంతాల్లో రోడ్ల పైన ఎక్కడా చూసిన యువత గుంపులు గుంపులుగా సంచరిస్తున్నారని చెపుతున్నారు.

మిర్యాలగూడెం రూరల్ ఏరియా, ఇతర మండలాలల్లో ఇసుక మాఫియా యథేచ్చగా నడుస్తోంది. పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. తకెళ్లపాడు, తడకమళ్ల ఏరియాలోనే ఈ ఏడాదిలోనే సుమారు 30కి పైగా కేసులు పెట్టినప్పటికీ ఇసుక అక్రమ రవాణా ఆగడం లేదు. వేములపల్లి పీఎస్ పరిధిలో సుమారు 50కి పైగా కేసులు నమోదయ్యాయి. మూసీ పరివాహక ప్రాంతాల నుంచి అక్రమంగా ఇసుక తరలించి మిర్యాలగూడెం, పరిసర ప్రాంతాల్లో ఇల్లీగల్ దందా నడిపిస్తున్నారు. ట్రాక్టర్ కు రూ.5వేల చొప్పున రౌడీషీటర్లు మామూళ్లు వసూలు చేస్తున్నారు. ఆయా గ్రామాల స్థానిక ప్రజాప్రతినిధిలు, టౌన్ లో కొందరు కౌన్సిలర్లు కలిసి ఇసుక మాఫియా, భూములు సెటిల్మెంట్ చేస్తున్నారని తెలిసింది. వివాదస్పద భూముల వ్యవహారాల్లో తలదూర్చి వాటిని మరింత క్లిష్టం చేస్తూ రౌడీషీటర్లు సెటిల్మెంట్ మాఫియాగా మారిపోయారు. అసలు యజమానుల మధ్య ఉన్న తగాదాలను తమకు అనుకూలంగా మలుచుకుని, బెదిరింపులు, ఒత్తిళ్లతో సెటిల్మెంట్లు చేసి భారీగా డబ్బులు దండు డకుంటున్నారని సమాచారం. ఒక వర్గానికి మద్దతు ఇచ్చినట్టు నటిస్తూ, మరోవైపు ప్రత్యర్థి వర్గంపై ఒత్తిడి తెచ్చి ‘సమస్య పరిష్కారం’ పేరిట లక్షల్లో వసూళ్లు చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. గ్రామాలు, టౌన్ పరిసర ప్రాంతాల్లో భూముల విలువ పెరగడంతో ఈ సెటిల్మెంట్ దందా మరింత వేగం పుంజుకుందని, కొందరు స్థానిక నాయకుల అండతో రౌడీషీటర్లు బహిరంగంగానే వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో గొడవలు సృష్టించిన కొందరు రౌడీషీటర్లు దీని వెనక ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.

గత బీఆర్ఎస్(BRS) హయాంలో మిర్యాలగూడెంలో సమాంతర ప్రభుత్వ వ్యవస్థ నడిచిందని, అదే పద్ధతి ఇప్పుడు కూడా కొనసాగాలని స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే పైన ఒత్తిడి చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇల్లీగల్ దందా పైన ఉక్కుపాదం మోపుతున్న ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డికి లోకల్ లీడర్ల ప్రెషర్ పెద్ద తలనొప్పిగా మారిందని, దాన్ని నుంచి బయటపడేందుకు ఎంత ప్రయత్నించినా అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని తెలిసింది. శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహారిస్తున్న పలువురు సీఐ(CI), ఎస్ఐ(SI)ల చర్యలను అడ్డుకునేందుకు లోకల్ లీడర్లు తీవ్రమైన ఒత్తిళ్లు తెస్తున్నారని తెలిసింది. తాజా మాజీ డీఎస్పీ(DSP) రాజశేఖరరాజు పైన బదిలీ వేటు పడేందుకు ఈ ఒత్తిళ్లు కూడా ప్రధానమని చెప్తున్నారు. దాంతోనే ఆయన ప్లేస్ లో రావాల్సిన కొత్త డీఎస్పీ ఆనంద్రెడ్డిని సైతం రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారని తెలిసింది. కానీ కొంత మంది లీడర్లు మాత్రం అప్పుడే ఆనంద్ రెడ్డి వచ్చారని భావించి డీఎస్పీ ఆఫీసుకు క్యూ కట్టడం చర్చకు దారితీసింది. గతంలో మిర్యాలగూడ సీఐగా పనిచేసిన ఆనంద్ రెడ్డితో సన్నిహితంగా మెలిగిన లీడర్లు ఆయన రాకముందే అత్యుత్సాహాన్ని ప్రదర్శించడం చూసి పోలీసులు సైతం నివ్వెరపోతున్నారు.

గత బీఆర్ఎస్ హయాం నుంచే పోలీసులను, ప్రభుత్వ అధికారులను ‘అన్నా’ అని పిలవడం కామన్ గ మారింది. కానీ పోలీస్ వ్యవస్థలో అన్న అనే పిలుపు తమ ప్రతిష్టను మరింత దిగజార్చేలా ఉందని వాపోతున్నారు. చోటా మోటా లీడర్లతో సహా, ఎవరు పడితే వాళ్లు కానిస్టేబుల్ నుంచి డీఎస్పీ వరకు అన్నా అని పిలుస్తున్నారని, దాని వల్ల సమాజంలో పోలీసుల గౌరవ మర్యాదలకు ఆటంకం ఏర్పడుతోందని సీనియర్ ఆఫీసర్ ఒకరు చెప్పారు. బీఆర్ఎస్ హాయాంలో పలువురు ఎమ్మెల్యేలు, జిల్లా ఎస్పీ, కలెక్టర్ను సైతం అన్నా అని పిలిచేవారని, దాన్నే కింది కేడర్ అనుకరించేదని, కాంగ్రెస్ లీడర్లు సైతం అదే ట్రెండ్ను కొనసాగించడం వల్ల ప్రజల్లో చులకన భావం ఏర్పడుతోందని అంటున్నారు. మిర్యాలగూడెంలో ‘అన్న’ కల్చర్ మరింత మితిమీరిపోయిందని, దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిచిన పోలీసులకూ సమస్యలే ఎదురవడం గమనార్హం.

Share
Share