- మూడు శాఖల పైన వన్‌మ్యాన్ షో?
- ఫైల్ ఏదైనా.. ఫైనల్ అదే టేబుల్
- కలెక్టరేట్ లో “సింగిల్ విండో” పరిపాలన
- ఏజేసీ(AJC), డీఆర్వో(DRO), నల్లగొండ ఆర్డీఓ(RDO).. మూడు చోట్ల ఆయనే
- పని భారంతో ప్రజాపాలన అస్తవ్యస్తం
- జిల్లాలో అడుగుపెట్టేందుకు కొత్త ఆఫీసర్లు వెనకడుగు
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ ఆర్డీఓ(RDO) వై. అశోక్ రెడ్డి జిల్లా కేంద్రంలో మల్టీరోల్ పోషిస్తున్నారు. ఆయన ఒక్కరే మూడు శాఖల బరువు, బాధ్యతలు మోస్తున్నారు. రెండేళ్లు గడుస్తున్నా జిల్లాకు కొత్త ఆఫీసర్లు వచ్చేందుకు వెనకాడటమే అందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. గత రెండేళ్ల ప్రజాపాలనలో తరచూ జిల్లా కలెక్టర్లు మారడంతో నల్గొండ పేరు రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. దాంతో కలెక్టరేట్ లో రెండేళ్ల నుంచి ఖాళీగా ఉన్న లోకల్ బాడీ అదనపు కలెక్టర్, డీఆర్వో పోస్టులు ఖాళీగానే ఉండటం అందుకు నిదర్శనం. ఇలా త్రిపాఠి కలెక్టర్ గా ఉన్నప్పుడు మిర్యాలగూడ సబ్ కలెక్టర్ అమిత్ నారాయాణ్ పంచాయతీ ఎన్నికల కొరకు కొన్ని నెలలు పని చేశారు, మళ్లీ ఆ తర్వాత పోస్టు ఖాళీ అయ్యింది. చివరగా రెండేళ్ల క్రితం హేమంత్ కేశవ్ పాటిల్ ఏజేసీ(AJC)గా పని చేశారు. ఇక డీఆర్వో(DRO) పోస్టు పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన నాటి నుంచే ఖాళీగా ఉంది. రాజ్యలక్ష్మీ చివరి డీఆర్వో. ప్రస్తుతం ఈ రెండు పోస్టుల బాధ్యతలు నల్లగొండ ఆర్డీఓ వై. అశోక్ రెడ్డి నిర్వర్తిస్తున్నారు. దాంతో పని భారం పెరిగి ప్రజాపాలన గాడితప్పింది. ఓవైపు ఆర్డీఓ ఆఫీసులో భూ సేకరణ ఫైల్స్ పరిశీలన, మరోవైపు కలెక్టరేట్ లో డీఆర్వోగా అన్ని శాఖల ఫైల్స్ ను కదలించడంలో ఆయనదే కీరోల్. ప్రధానంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పోస్టు ఖాళీగా ఉండటంతో పంచాయతీరాజ్, పట్టాణాభివృద్ధి శాఖలను సమన్వయం చేయడం కష్టంగా మారింది.
మున్సిపాలిటీలు అస్తవ్యస్తం.. కలెక్టర్ పైన భారం..
పంచాయతీలకు డీపీఓ(DPO), గ్రామీణాభివృద్ధి శాఖకు పీడీ(PD), జిల్లా పరిషత్ కు సీఈఓ(CEO) ఉన్నారు. కానీ ఈ శాఖల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, కలెక్టర్ సూచించిన కార్యక్రమాలను ఆయా శాఖల ఆఫీసర్లతో కోఆర్డినేట్ చేయడం కష్టంగా మారింది. ఇక మున్సిపాలిటీలను సమన్వయం చేసే ఆఫీసర్ లేనందున పాలన అస్తవ్యస్తంగా మారింది. ప్రస్తుతం జిల్లాలో 99 రోజుల ప్రజాపాలన కార్యక్రమం నడుస్తోంది. పల్లెల్లో ఉన్నంత స్పీడ్ పట్టణాల్లో కనిపించడం లేదు. ప్రభుత్వం ఏదైనా కార్యక్రమం అసైన్ చేసినప్పుడు కలెక్టర్ ఆ బాధ్యతను సహజంగానే అడిషనల్ జేసీకి అప్పగించడం జరుగుతుంది. కానీ పర్మినెంట్ ఆఫీసర్ లేకపోవడంతో ఆర్డీఓ పైనే భారం పడుతోంది. కొన్ని పనులు కలెక్టర్ స్వయంగా చూసుకోవాల్సి వస్తోంది. ప్రధానంగా నల్లగొండ పైన మరింత ఫోకస్ చేయాల్సిన పరిస్థితి. ఇక్కడ తలెత్తిన ప్రాజెక్టుల భూ సేకరణ సమస్యలు ఇంకా కొలిక్కి రాలేదు. కుప్పలు తెప్పలుగా ఫైల్స్ పెండింగ్‌లో ఉన్నాయి. బాధితులకు నష్టపరిహారం మొదలు, మంత్రి అనుచరుల పైరవీలు ఆ స్థాయిలోనే ఉన్నాయి. మున్సిపాల్టీలో కమిషనర్ల పాత్ర నామమాత్రంగానే ఉంటోంది. కమిషనర్లకే సర్వాధికారాలు ఉన్నప్పటికీ, అన్ని మున్సిపాలిటీలను సమన్వయం చేయడం, అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించే బాధ్యత ఏజేసీ(AJC)దే, కానీ అసలు ఎక్కడ ఏం జరుగుతుందో కూడ ఎవరికీ అంతుచిక్కని పరిస్థితి నెలకొంది.
అన్ని ఫైల్స్ పైనే ఆర్డీఓ ముద్రే..
ఇలా త్రిపాఠి కలెక్టర్ గా ఉన్నప్పుడు లోకల్ బాడీ అదనపు కలెక్టర్ ఇంచార్జిగా హౌజింగ్ పీడీ రాజ్‌కుమార్ కొంత కాలం పనిచేశారు. జిల్లా పరిషత్, హౌజింగ్ డిపార్ట్మెంట్లో పనిఒత్తిడి అంతగా లేదనే చెప్పాలి. ఏజేసీ, డీఆర్వో, ఆర్డీఓ మూడు శాఖల్లో అనునిత్యం జరిగే ఫైల్స్ అన్నింటి పైన ఆర్డీఓ ముద్ర వేయాల్సిందే. ఉదయం 8గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు అవిశ్రాంతంగా పనిచేయాల్సి వస్తోంది. ప్రస్తుతం వడ్ల కొనుగోళ్లు ఉదృతంగా జరుగుతున్నాయి. వడ్ల రవాణాలో ఎలాంటి చిన్న సమస్య ఎదురైనా ఆర్డీఓ పైనే ఒత్తిడి పెరుగుతోందని చెప్తున్నారు. ఇక ప్రజావాణిలో వచ్చే రెవిన్యూ సమస్యల పరిష్కారం, నిత్యం ఆర్డీఓ ఆఫీసుకు వచ్చే జనాలు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది.