APB News Exclusive: నాగార్జునసాగర్ లో ఖాకీ ‘పాలిటిక్స్’

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ జిల్లా పోలీస్ శాఖలో ఖాకీ ‘పాలిటిక్స్’ రచ్చకెక్కుతున్నాయి. అధికార పార్టీ లీడర్లతో అంటకాగుతున్న ఖాకీలు ఒకరంటే మరొకరికి పడక కుట్ర పూరిత చర్యలకు పూనుకుంటున్నారు. బదిలీ పైన వెళ్తున్న మిర్యాలగూడెం డీఎస్పీ రాజశేఖర రాజు పైన వస్తోన్న ఆరోపణల వెనక పలువురు పోలీసు అధికారులు, పొలిటికల్ లీడర్ల ప్రమేయం ఉన్నట్టు తెలుస్తోంది. డిపార్ట్మెంట్ లో నిజాయితీ ఆఫీసర్ గా గుర్తింపు పొందిన రాజశేఖర రాజు సేవలను గుర్తించి అతన్ని ప్రత్యేక కేసు విచారణ నిమిత్తం సీఐడీ(CID)కి బదిలీ చేసిన సంగతి తెలిసిందే. కానీ నాగార్జునసాగర్, మిర్యాలగూడెం కు చెందిన పలువురు ఆఫీసర్లు డీఎస్పీ(DSP) లక్ష్యంగా చేస్తున్న దుష్ప్రచారం డిపార్ట్మెంట్ లో కలకలం రేపుతోంది.

వివరాల్లోకి వెళితే.. గతేడాది నవంబర్ లో నాగార్జునసాగర్ లోని విజయ విహార్ హోటల్లో పేకాట ఆడుతున్న ఒక ముఠా తప్పించుకుని పోయిన కేసును ఇప్పుడు తెరపైకి తేవడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. జిల్లా ఎస్పీ స్వయంగా పర్యవేక్షించిన ఈ కేసు వెనక అసలు సూత్రదారులను కనిపెట్టడంలో నందికొండ పోలీసులు నిర్లక్ష్యం చేశారు. దాంతో ఎస్పీ ఆదేశాల మేరకు మిర్యాలగూడ డీఎస్పీ కేసు కూపీ లాగారు. ఆంధ్రా పోలీసులతో ఉన్న రిలేషన్స్ ఆధారంగా పేకాట అసలు సూత్రదారుడు గుంటూరు జిల్లా దాచేపల్లికి చెందిన విజయ్ తేలడంలో కొంతకాలానికి అతన్ని గుంటూరు, చిలుకూరిపేట మధ్య అరెస్ట్ చేశారు. ఆంధ్రా బార్డర్ దాటి నాగార్జునసాగర్ పరిసర ప్రాంతాల్లో పేకాట క్యాంపులు పెడ్తుంటాడని విచారణలో తేలింది. ఈనేపథ్యంలోనే విజయ విహార్ లో గతేడాది నవంబర్ లో పేకాట ఆడుతున్న సంగతి తెలుసుకున్న స్థానిక సీఐ డీఎస్పీకి సమాచారం అందించారు. డీఎస్పీ ఆదేశాల మేరకు సీఐ అతని బృందం హోటల్ పైన దాడి చేసేందుకు వెళ్లగా అప్పటికే ఆ ముఠా తప్పించుకుంది. అసలు పోలీసులు విజయ విహార్ పైన దాడి చేస్తున్న సంగతి అప్పుడే ఎలా లీక్ అయిందో ఎవరికీ అంతుచిక్కలేదు.

విజయ విహార్

ఇటీవల హాలియాలో పేకాట ముఠాను అరెస్ట్ చేసిన నేపథ్యంలో మరోసారి విజయ విహార్ కేసు తెరపైకొచ్చింది. పేకాట పైన జిల్లా ఎస్పీ కఠినంగానే వ్యవహారిస్తున్నా మళ్లీ వాటి ఆనవాళ్లు కనబడటం డిపార్ట్మెంట్ కు సవాల్ విసిరింది. నవంబర్ లో విజయ విహార్ పైన పోలీసులు దాడిచేస్తున్న సంగతి బయటకు ఎలా లీక్ అయ్యింది, తప్పించుకున్న ముఠాలో అసలు సూత్రదారుల పాత్రదారులు ఎవరో? తేల్చాలని డీఎస్పీ రాజశేఖరరాజును ఎస్పీ ఆదేశించారు. దాంతో కేసు ధర్యాప్తును వివిధ కోణాల్లో విచారించగా పేకాట ముఠాలో నందికొండకు చెందిన తాజా, మాజీ కౌన్సిలర్లు, పలువురు రాజకీయ నాయకుల అనుచరులు ఉన్నట్టు తేలింది. రామకృష్ణ, విద్యాసాగర్ రెడ్డి, రాంబాబు, నరేందర్, రంగారెడ్డి, నాగరాజులను జిల్లా టాస్క్ ఫోర్స్ అదుపులోకి తీసుకుని విచారించింది. దాంతో పేకాట అసలు సూత్రదారుడు గుంటూరు జిల్లా దాచేపల్లికి చెందిన విజయ్ అని తేలింది. డీఎస్పీ రాజశేఖరరాజు బృందం అతన్ని గుంటూరు, చిలుకలూరి పేట మధ్య అరెస్ట్ చేసింది. టాస్క్ ఫోర్స్ విచారణలో భాగంగా విజయ్ డిపార్ట్మెంట్ లో కోవర్ట్ ఎవరు అనే విషయాన్ని వెళ్లగక్కారు. నందికొండ పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న హోంగార్డు కోవర్టు అని, అతను ఇచ్చిన సమాచారంతోనే విజయ విహార్ నుంచి తప్పించుకున్నామనే ఒప్పుకున్నాడు. చిత్రమేమంటే ఆ హోంగార్డు అప్పటికే ఒక కేసులో ఇరుక్కోవడంతో అతన్ని హైదరాబాద్ కు అటాచ్ చేసినట్టు తెలిసింది. పోలీసుల నుంచే పేకాట స్థావరాలకు సమాచారం లీక్ అవుతుందనే విషయాన్ని పసిగట్టిన పై అధికారులు అన్ని పోలీస్ స్టేషన్లలోని ఎస్ఐ(SI), సీఐ(CI)ల కదలికల పైన నిఘా పెట్టారు. స్థానికంగా అధికార పార్టీ లీడర్లతో అంటకాగుతున్న పోలీసుల గుట్టు ఎక్కడ బయట పడుతుందోనన్న భయంతో మొత్తం పేకాట స్టోరీని డీఎస్పీకి లింక్ పెట్టారు. డీఎస్పీ జోక్యంతోనే తామంతా ఇరుక్కుంటున్నామని ఇంతటితో ఆపకపోతే కొత్తగా వచ్చే డీఎస్పీ దృష్టిలో పడ్తామని, డిపార్ట్మెంట్ పరంగా చిక్కుల్లో పడాల్సి వస్తదని పలువురు పోలీసు అధికారులే డీఎస్పీ పైన బురదజల్లే రాజకీయాలకు తెరతీసినట్టు తెలుస్తోంది.

నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పేకాట కామన్ గా మారింది. హాలియా, నిడమనూరు, త్రిపురారం పరిసర ప్రాంతాల్లో పేకాట స్థావరాలు నడుస్తుంటాయి. ప్రత్యేకించి పేకాట క్లబ్ లు వంటివి లేన్నప్పటికీ, కొంతమంది ఏకమై ఫాంహౌస్ లలో, తోటల్లో పేకాట స్థావరాలు నడిపిస్తున్నారు. ఆంధ్రా బార్డర్ కు నందికొండ ఆనుకుని ఉండటంతో ఇక్కడ మాత్రం పేకాట స్థావరాలు పాతుకుపోయాయి, దాంతోపాటు ఇసుక అక్రమ రవాణా, వైన్స్ షాపుల గొడవలు, వేశ్యా గృహాల నిర్వహణతో శాంతిభద్రతలు అదుపుతప్పాయి. పేకాట కేసులో ఏకంగా నందికొండ మున్సిపల్ కౌన్సిలర్ లు ఇరుక్కోవడంతో రాజకీయం మరింత హీటెక్కింది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో నందికొండ మున్సిపాలిటీ పైన అధికార పార్టీలో ఆధిపత్య పోరు రచ్చకెక్కింది. పెద్దవూర మాజీ జడ్పీటీసీ కర్నాటి లింగారెడ్డి, నందికొండ మున్సిపల్ వైస్ చైర్మన్ ప్రసాద్ వర్గీయులకు మధ్య గొడవలు జరుగుతున్నాయని తెలిసింది. పేకాట కేసులో ఇరుక్కున్న కౌన్సిలర్లలో వీళ్ల అనుచరులు కూడా ఉండటం, దీంట్లో పోలీసుల ప్రమేయం కూడా ఉన్నందున చివరకు అందరూ ఏకమై బదిలీ పై వెళ్తున్న డీఎస్పీ లక్ష్యంగా కుట్రపూరిత రాజకీయాలకు తెరలేపినట్టు తెలుస్తోంది.

Share
Share