సింగర్ మంగ్లీ రివర్స్ అటాక్: “ట్విస్టుల మీద ట్విస్టులు.. అసలేం జరుగుతోంది?”

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: గత కొద్దిరోజులుగా సింగర్ మంగ్లీ చుట్టూ తిరుగుతున్న వివాదం ఇప్పుడు పోలీసు కేసుల పోరాటంగా మారింది. తనపై రూ. 10 కోట్ల చీటింగ్ కేసు పెట్టిన అడ్వకేట్ సుబ్బారావు (సుభా సింగబోష్) పై మంగ్లీ ఇప్పుడు ఎదురు దాడికి దిగారు. తనను వ్యక్తిగతంగా వేధిస్తూ, అక్రమంగా డబ్బులు వసూలు చేసేందుకు కుట్ర పన్నారని ఆమె నార్సింగి పోలీసులను ఆశ్రయించారు.

గాయని మంగ్లీ తన ఫిర్యాదులో పలు సంచలన విషయాలను వెల్లడించారు:

బ్లాక్మెయిలింగ్: గత మార్చి 21వ తేదీన సుభా సింగబోష్ అనే వ్యక్తి తనకు పరిచయమయ్యాడని, తనను కలవాలని.. లేకపోతే సమాజంలో అప్రతిష్ట పాలు చేస్తానని బెదిరించాడని ఆమె పేర్కొన్నారు.

తప్పుడు ఆరోపణలు: తనకు ఎలాంటి సంబంధం లేని ఆర్థిక లావాదేవీల్లో తన పేరును ఇరికించారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం తన ప్రతిష్టను దెబ్బతీయడానికే రూ. 150 కోట్ల మోసం చేశానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో వివరించారు.

ప్రాణహాని: నిందితుడి నుండి తనకు ముప్పు ఉందని, తనను మానసిక క్షోభకు గురిచేస్తున్న సుభా సింగబోష్పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

మంగ్లీ ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన నార్సింగి పోలీసులు నిందితుడు సుభా సింగబోష్పై భారతీయ న్యాయ సంహిత (BNS) 79 (మహిళా గౌరవానికి భంగం కలిగించడం), 351(3) (నేరపూరితమైన బెదిరింపులు) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

మొదట అడ్వకేట్ సుబ్బారావు పంజాగుట్టలో మంగ్లీపై కేసు పెట్టగా, ఇప్పుడు మంగ్లీ నార్సింగిలో ఆయనపై కేసు పెట్టడం చర్చనీయాంశమైంది. ఒకరు రూ. 10 కోట్లు అంటే, మరొకరు రూ. 150 కోట్ల తప్పుడు ఆరోపణలు అంటున్నారు. ఈ కేసులో రెండు వైపులా ఆరోపణలు బలంగా ఉండటంతో, పోలీసులు లోతుగా విచారణ జరిపితే తప్ప అసలు నిజాలు బయటపడేలా లేవు. సెలబ్రిటీల చుట్టూ జరుగుతున్న ఈ వివాదం టాలీవుడ్లో వేడి పుట్టిస్తోంది.

Share
Share