Breaking News: దుర్మార్గానికి పాల్పడ్డ డీఎస్పీ, సిఐ, ఎస్ఐ ముగ్గురిని డిస్మిస్ చేయాలి: కేటీఆర్

కోదాడ, ఏపీబీ న్యూస్: కర్ల రాజేష్ కుటుంబానికి న్యాయం జరగకపోతే జాతీయస్థాయిలో ఉద్యమానికి శ్రీకారం చుడతానని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గురువారం కోదాడ పట్టణంలో ఇటీవల లాకప్ డెత్ లో మృతి చెందిన కర్ల రాజేష్ కుటుంబాన్ని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్య యాదవ్, గాదారి కిషోర్, కంచర్ల భూపాల్ రెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లతో కలిసి తల్లి లలితమ్మను ఆయన పరామర్శించారు. రాజేష్ మృతికి కారకులైన పోలీసు యంత్రాంగంపై చర్యలు తీసుకోకపోవడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులైన వారిని ఎందుకు కాపాడుతున్నారో జవాబు చెప్పాలన్నారు. దుర్మార్గానికి ఒడిగట్టిన డీఎస్పీ, సిఐ, ఎస్ఐ లను విధుల నుండి సస్పెండ్ చేయాలన్నారు. డీఎస్పీపై చర్యలు తీసుకోకుండా స్థానిక మంత్రి సివిల్ సప్లై శాఖలో పదోన్నతి కల్పించడం వెనకాల ఆంతర్యం ఏమిటి అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో లాక్ అప్ డెత్ లో మృతి చెందిన మరియమ్మ కేసులో పూర్తి న్యాయం చేశామన్నారు. ప్రస్తుత ప్రభుత్వం రాజేష్ కుటుంబాన్ని తీవ్ర అన్యాయానికి గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.

పార్టీ పక్షాన బాధిత కుటుంబానికి ఐదు లక్షల సహాయాన్ని ప్రకటించారు. భవిష్యత్తులో బిఆర్ఎస్ పార్టీ కర్ల రాజేష్ కుటుంబానికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రాజేష్ కుటుంబానికి అండగా నిలుస్తున్న ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ప్రజా సంఘాలకు వివిధ రాజకీయ పక్షాలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం రాజేష్ తల్లితో కలిసి రాజేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కాగా కేటీఆర్ ను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.

Share
Share