- నల్గొండలో అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి తమ్ముడు ఓటమి
- కాంగ్రెస్తో చేతులు కలిపి బీజేపీ సీనియర్లు?
- సూర్యాపేట లో ప్రభావం చూపని జిల్లా అధ్యక్షురాలు
- నేరేడుచర్లలో ప్రభావం చూపని చల్లాశ్రీలత రెడ్డి
- సూర్యాపేటల సంకినేని కోటాలో ఒకటి
- యాదాద్రి జిల్లాలో ప్రతిష్ట కాపాడుకున్న జిల్లా అధ్యక్షుడు
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: ఉమ్మడి జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అడ్రస్ గల్లంతైంది. పార్టీకి బలమైన నాయకత్వం లేకపోవడం వల్ల ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కలేదు. చివరకు నల్లగొండ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి తమ్ముడు హర్షిత్ రెడ్డిని కూడా ఎన్నికల్లో గెలిపించుకోలేని దుస్థితికి పార్టీ నాయకత్వం చేరింది. 2020 ఎన్నికల్లో నల్గొండ లో 8 వార్డులు గెలిస్తే ఈ ఎన్నికల్లో 4కు పడిపోయింది. అభ్యర్థుల ఎంపిక నుంచి మొదలైన పొరపాట్లు ఓటమి వరకు దారితీశాయి. పిల్లి రామరాజు యాదవ్తో గొడవలు, అభ్యర్థులను మార్చడంలో చేసిన తప్పులు పార్టీ ప్రతిష్టను మరింత దిగజార్చాయి. నల్గొండ ను క్లీన్ స్వీప్ చేస్తామని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసిన నాగం వర్షిత్ రెడ్డి పార్టీ గెలుపు కోసం చివరకు డీఎస్పీ శివరాం రెడ్డి తో ఘర్షణకు దిగారు. సోషల్ మీడియా లైక్ లతో తెగ సంబరపడిపోయే వర్షిత్ రెడ్డి నిర్వాహం వల్ల నల్లగొండ కార్పోరేషన్లో పార్టీ చెల్లాచెదురైంది. ఇది చాలదన్నట్టుగా ఎన్నికల ఇంచార్జిలుగా వ్యవహరించిన పార్టీ సీనియర్లు, కాంగ్రెస్తో చేతులు కలిపారు. బీజేపీకి మేలు చేసేందుకు ఆడిన హైడ్రామాలో చివరకు కాంగ్రెస్ అభ్యర్థులు స్వల్ప ఓట్లతో గట్టెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక దేవరకొండ, మిర్యాలగూడలో ఒక్కో స్థానంతో సరి పెట్టుకుంది.
సొంత ఇమేజ్ పైనే శ్రీలత ఫోకస్
చల్లా శ్రీలత రెడ్డి ఆర్ధికంగా పార్టీకి దోహద పడుతుందనే ఉద్దేశంతో ఆమెకు సూర్యాపేట జిల్లా అధ్యక్ష పదవి దక్కింది, కానీ సొంత ఇమేజ్ పైనే ఆమె దృష్టి సారించిందని, పార్టీ బలోపేతం దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదనే విమర్శలు ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్నగర్ నుంచి పోటీ చేసిన ఆమెకు మూడు వేల ఓట్లకు మించి రాకపోవడంతో పార్టీ కార్యక్రమాల పైన దృష్టి పెట్టడం మానేశారని సీనియర్లు చెప్తుంటారు. ఆమె సొంత మున్సిపాలిటీ నేరేడుచర్లలో అన్ని వార్డుల్లో అభ్యర్థులు పోటీ చేసినప్పటికీ ఒక్కటి కూడా రాలేదు. చివరకు సూర్యాపేటలో బీజేపీకి నేనే సర్వసం అని చెప్పుకునే మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరావు ప్రభావం కూడా ఎన్నికల్లో శూన్యం. సూర్యాపేటలో ఒక్క వార్డు మాత్రమే గెలిచింది.
యాదాద్రి జిల్లాలో అంతంతమాత్రం
యాదాద్రి జిల్లాలో ఆరు మున్సిపాలిటీల్లో సైతం ఆపార్టీ ప్రభావం నామమాత్రంగానే కనిపించింది. చౌటుప్పుల్, చండూరు ఇంచార్జిగా వ్యవహరించిన గంగడి మనోహర్ రెడ్డి కృషి కారణంగా చౌటుప్పుల్లో 3 వార్డులు గెలిచింది. ఇక భువనగిరిలో గత ఎన్నికల్లో 8 వార్డుల్లో గెలిస్తే ఈ ఎన్నికల్లో నాలుగుకు పడిపోయింది. బీఆర్ఎస్ పైన అవిశ్వాస తీర్మానం పెట్టాల్సిన సమయంలో బీజేపీ కాంగ్రెస్కు మద్ధతు ఇచ్చిందనే కారణంతో ఈ ఎన్నికల్లో ఓటర్లు తగిన గుణపాఠం చెప్పారని సీనియర్లు చెప్పారు. జిల్లా అధ్యక్షుడు ఉట్కూరి అశోక్గౌడ్ సొంత నియోజకవర్గం ఆలేరులో మాత్రం ఈసారి గుట్టలో రెండు, ఆలేరులో రెండు వార్డులు దక్కించుకుని పార్టీ ప్రతిష్టను కాపాడుకోగలిగారు.
పార్లమెంట్ ఎన్నికల వైభవం హుష్
పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొండ, భువనగిరిలో బీజేపీ సెకండ్ ప్లేస్ లో నిలిచింది. బీఆర్ఎస్ మూడో స్థానంలోకి పడిపోయింది. అర్బన్ పార్టీగా ముద్రపడ్డ బీజేపీని పట్టణ ఓటర్లు ఆదరించారని అప్పుడు సంబరపడ్డారు, కానీ రెండేళ్ల తర్వాత జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ ఒక్క పల్లె కూడా గెలవలేదు. ఇక అర్బన్ ఓటర్లు ప్రభావం చూపే మున్సిపల్ ఎన్నికల్లో సైతం బీజేపీని తిరస్కరించారు. నల్లగొండ లాంటి చోట్ల కూడా పార్టీని కాపాడుకోలేకపోయారు.