Breaking News: మంత్రి వెంకన్న గురి తప్పింది.. అనుచరుల్లో కనిపించని గెలుపు ఉత్సాహాం

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ కార్పోరేషన్ ఎన్నికల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురి తప్పింది. మంత్రి ఆశించిన దానికి భిన్నంగా పట్టణ ఓటర్లు విలక్షణ తీర్పు ఇచ్చారు. 48 వార్డులు కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో వెంకటరెడ్డి పార్టీ కేడర్ను నడిపించారు. రెండు, మూడు డివిజన్లు అటుఇటు అయినా 45 స్థానాలు దాటొద్దనే లక్ష్యంతో సర్వశక్తులు ఒడ్డారు. వారం రోజుల పాటు కంటిమీద కునుకు లేకుండా అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడ్డారు. కార్పోరేషన్ గెలుపు బాధ్యతలను తన భుజాలపైనే వేసుకున్నారు. ఇంటిలిజెన్స్ రిపోర్ట్లు, సొంతంగా సర్వేలు చేయించి అభ్యర్థులను వడపోశారు, కానీ ప్రత్యర్థులను తక్కువ అంచనా వేయడంతో ఫలితాలు తారుమారయ్యాయి. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కొందరు ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీ చేయగా, ఇంకొందరు స్వతంత్రులుగా పోటీ చేశారు. దీంతో కాంగ్రెస్ ఓట్లు భారీగా చీలిపోయాయి. మరికొన్ని వార్డుల్లో బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ప్రభావం చూపింది. దీంతో ప్రత్యర్ధులకు పోలైన ఓట్లు కూడా కాంగ్రెస్ అభ్యర్థులకు రాలేదు. పలు వార్డుల్లో మూడు, నాలుగో స్థానంలో పడిపోయారు. పార్టీ కోఆర్డినేటర్గా వ్యవహరించిన పాశంరాంరెడ్డి సైతం 35 డివిజన్లు వస్తాయని నమ్మకం పెట్టుకున్నారు, కానీ చివరకు 27 డివిజన్ల వద్దే గెలుపుకు బ్రేక్లు పడ్డాయి.

మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలంటే 48 మంది కార్పోరేటర్లలో 50 శాతం మంది అభ్యర్థులు చేతులెత్తి ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఈ లెక్కన నల్లగొండ మేయర్ పీఠం చేజిక్కించుకోవాలంటే 25మంది కార్పోరేటర్లు మద్ధతు ప్రకటించాలి. మెజార్టీ 24 డివిజన్ల కంటే అధనంగా కేవలం మూడు స్థానాలు మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. 2020 ఎన్నికల్లో బుర్రి శ్రీనివాస్రెడ్డి చైర్మన్గా పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ 20 వార్డుల్లో గెలిచింది. కార్పోరేషన్ ఎన్నికల్లో అధనంగా 7 వార్డులు మాత్రమే గెలవడం గమనార్హం. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే కాంగ్రెస్ 20 వార్డులు గెలిస్తే, ఇప్పుడు పవర్లో ఉన్నకాంగ్రెస్ 27 వార్డుల్లో సరిపెట్టుకోవడం అంటే ఇదోరకంగా పట్టణంలో పార్టీ నాయకత్వం పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

ఎన్నికల ఫలితాల నుంచి మంత్రి కోమటిరెడ్డి, అతని అనుచరులు తేరుకున్నట్టు కనిపిస్తోంది. గెలిచిన ఉత్సాహాం అభ్యర్థుల్లో, అనుచరుల్లో కనిపించడం లేదు. రెండు వేల కోట్లతో నల్లగొండ అభివృద్ధి జరుగుతోందని, 45 వార్డుల్లో గెలిస్తే స్మార్ట్ సిటీగా మారుస్తానని కోమటిరెడ్డి ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. కానీ ఈ ఫలితాలు చూశాక మంత్రి సైతం నివ్వెరపోయినట్టు తెలిసింది. గత రెండేళ్ల నుంచి నల్లగొండలో పార్టీ బాగోగులను అంతగా పట్టించుకోకపోవడం, ఒకిద్దరు చేతులకే బాధ్యతలు అప్పగించడం వల్ల కేడర్లో నిరుత్సాహాం నెలకొంది, దాంతోనే ఎన్నికల్లో సైతం యువజన కాంగ్రెస్ అంటీ ముట్టనట్టుగానే వ్యవహారించింది. కొన్ని చోట్ల స్వతంత్రులు, ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులకు సహకరించారు. రియల్ ఎస్టేట్, ఇసుక దందాల పైనే ఫోకస్ పెట్టిన అనుచరులు పార్టీ కేడర్ను నిర్లక్ష్యం చేశారనేది ఈ ఫలితాలు తేటతెల్లం చేశాయి. పలు వార్డుల్లో బీజేపీ పుంజుకోవడం కూడా పార్టీకి నష్టం జరిగింది.

ఎన్నికల ఫలితాలతో మంత్రి తేరుకున్నారు, దాంతోనే ఇక నుంచి ప్రతి డివిజన్లో ప్రజా దర్బార్ నిర్వహిస్తానని, ప్రజా సమస్యల పరిష్కారం పైనే దృష్టి పెడ్తానని మంత్రి గెలుపు సంబరాల్లో ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టుగా స్మార్ట్ సిటీ మారుస్తానని వచ్చే మూడేళ్లలో నల్లగొండ రూపురేఖలు మారుతాయని మంత్రి స్పష్టం చేశారు. నిజంగానే మంత్రి చెప్పినట్టు జరిగితే నల్లగొండలో కాంగ్రెస్కు మళ్లీ పూర్వవైభవం రావడం ఖాయమని పార్టీ కేడర్ ధీమా వ్యక్తం చేస్తోంది.

ఒకటో వార్డులో కాంగ్రెస్ గెలిచింది, కానీ ఇక్కడ ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థికి 540 ఓట్లు పోలయ్యాయి.

రెండో వార్డులో బీఆర్ఎస్ గెలిచింది, ఇక్కడ స్వతంత్ర అభ్యర్థికి 413 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ తర్వాత ఇతను మూడో ప్లేస్లో ఉన్నాడు.

మూడో వార్డులో బీఆర్ఎస్ కేవలం 63 ఓట్లతోనే గెలిచింది.

నాలుగో వార్డులో బీఆర్ఎస్ గెలిచింది, ఇక్కడ స్వతంత్ర అభ్యర్థికి 417 ఓట్లు పోలయ్యాయి అంటే కాంగ్రెస్ ఓట్లు చీలిపోయాయి.

ఆరో వార్డులో బీఆర్ఎస్ 11 ఓట్లతో గెలిచింది, ఇక్కడ బీజేపీకి 381, ఫార్వర్డ్ బ్లాక్కు 284, స్వతంత్ర అభ్యర్థికి 80 ఓట్లు చీలిపోయాయి.

8 వార్డులో కాంగ్రెస్ గెలిచింది, కానీ సెకండ్ ప్లేస్లో బీజేపీకి 1186 ఓట్లు పోలయ్యాయి.

9 వార్డులో బీఆర్ఎస్ 89 ఓట్లతోనే గెలిచింది, ఇక్కడ బీజేపీ రెండో ప్లేస్లో 617 ఓట్లు వచ్చా యి. కాంగ్రెస్ థర్డ్ ప్లేస్కు పడిపోయింది.

10 వార్డులో ఫార్వర్డ్ బ్లాక్ 48 ఓట్లతోనే గెలిచింది, సెకండ్ ప్లేస్లో బీజేపీకి 736 ఓట్లు, వస్తే థర్డ్ ప్లేస్లో కాంగ్రెస్కు 616 ఓట్లు వచ్చాయి.

11 వార్డులో ఫార్వర్డ్బ్లాక్ 710 ఓట్లతో గెలిచింది, సెకండ్ ప్లేస్లో కాంగ్రెస్కు 781, బీజేపీ 472 ఓట్లు వచ్చాయి.

13 వార్డుల్లో కాంగ్రెస్ 500 ఓట్లతో గెలిస్తే, బీజేపీ సెకండ్ ప్లేస్లో 669 ఓట్లు వచ్చాయి.

14 వార్డులో కాంగ్రెస్ 6 ఓట్లతో గెలిస్తే బీఆర్ఎస్కు 1092 ఓట్లు వచ్చాయి.

15 వార్డుల్లో బీఆర్ఎస్ 639 ఓట్లతో గెలిస్తే కాంగ్రెస్కు 912 ఓట్లు వచ్చాయి.

18 వార్డులో ఫార్వర్డ్ బ్లాక్ 171 ఓట్లతో గెలిస్తే కాంగ్రెస్కు 1147 ఓట్లు వచ్చాయి.

22 వార్డులో కాంగ్రెస్ గెలిచినప్పటికీ ఇక్కడ స్వతంత్ర అభ్యర్థి 705 ఓట్లు పోలుకావడం గమనార్హం.

25 వార్డులో బీజేపీ 389 ఓట్లతో గెలిస్తే కాంగ్రెస్కు 720 ఓట్లు వచ్చాయి.

26 వార్డులో స్వతంత్ర అభ్యర్థి కి 273 ఓట్లతో గెలిస్తే కాంగ్రెస్ నాలుగో ప్లేస్కు వెళ్లింది.

28 వార్డులో ఎంఐఎం 6 ఓట్లతో గెలిచింది, ఇక్కడ కాంగ్రెస్, స్వతంత్ర, ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు పోటీ వల్ల ఓట్లు చీలిపోయాయి.

33 వార్డులో కాంగ్రెస్ గెలిస్తే మూడో ప్లేస్లో ఉన్న స్వతంత్ర అభ్యర్థికి 343 ఓట్లు వస్తే, బీఆర్ఎస్కు 488 ఓట్లు వచ్చాయి.

34 వార్డులో 72 ఓట్లతోనే కాంగ్రెస్ గెలిచింది, బీజేపీ, బీఆర్ఎస్ ఓట్లు చీల్చుకుంది.

37 వార్డులో బీజేపీ గెలిస్తే, ఇక్కడ కాంగ్రెస్కు 590 ఓట్లు వస్తే, స్వతంత్ర అభ్యర్థికి 315 ఓట్లు వచ్చాయి. ఇండిపెండెంట్ వల్ల కాంగ్రెస్కు నష్టం జరిగింది.

39 వార్డులో బీజేపీ 51 ఓట్లతో గెలిస్తే, ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థికి 619 ఓట్లు పోలుకాగా, కాంగ్రెస్ నాలుగోప్లేస్లో పడిపోయింది.

42 వార్డుల్లో కూడా కాంగ్రెస్ మూడో ప్లేస్కు పడిపోయింది, ఇక్కడ ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి గెలిచారు.

46 వార్డులో కూడా బీఆర్ఎస్, బీజేపీ ఓట్లు చీల్చు కోవడంతో ఎంఐఎం గెలిచింది.

Share
Share