- రాష్ట్రంలో మేయర్ అభ్యర్థిని ప్రకటించిన తొలి కార్పోరేషన్
- సామాజిక సమీకరణాల ప్రకారంగానే మేయర్, చైర్మన్ల ఎంపిక ఉంటదని స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
- నల్లగొండ కార్పోరేషన్ ఒంటిచేత్తో గెలిపిస్తాననే మంత్రి కోమటిరెడ్డి ధీమా
- అభ్యర్థుల ఎంపికలో కూడా ఆయనే టాప్
- మంత్రి ఉత్తమ్ ఇలాకాతో సహా, ఇతర మున్సిపాలిటీల్లో కొలిక్కిరానీ అభ్యర్థులు
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: ఉమ్మడి జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్, కార్పోరేషన్ ఎన్నికల్లో ఎక్కడ కూడా అధికారికంగా మేయర్, చైర్మన్ అభ్యర్థులను ప్రకటించలేదు. కౌన్సిలర్, కార్పోరేటర్ అభ్యర్థుల ఎంపిక కూడా కొలిక్కిరాలేదు. ఉమ్మడి జిల్లాలోని 17 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఎమ్మెల్యేలు కుస్తీ పడుతున్నారు. సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత ఇలాకా కోదాడ, హుజూర్నగర్ లో కూడా చైర్మన్ ఎవరనేది అధికారికంగా ప్రకటించలేదు. కానీ మంత్రి కోమటిరెడ్డి మాత్రం నల్లగొండ కార్పోరేషన్ ఒంటిచేత్తో గెలిపిస్తానని ధీమాతో అందరి కంటే ముందే ఒకే విడతలో 45 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించి సత్తా చాటుకున్నారు. అసంతృప్తులకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా సిట్టింగ్లుకే మరోసారి అవకాశం కల్పించారు.
కౌన్సిలర్లు, కార్పోరేటర్లే ఎన్నుకుంటరు
పరోక్షంగా జరిగే ఈ ఎన్నికల్లో నిబంధనల మేరకు మేయర్, చైర్మన్ ల ఎన్నికలయ్యాక కౌన్సిలర్లు, కార్పోరేటర్ల ను ఎన్నుకుంటారు. అది కూడా ఏ పార్టీ అయితే మెజార్టీ సభ్యులు గెలుస్తారో ఆపార్టీ తరపున చైర్మన్ క్యాండేట్ను డిసైడ్ చేస్తారు. పార్టీ విప్ జారీ చేస్తుంది. దానికి కట్టుబడి ఎన్నిక జరుగుతుంది. కానీ మంత్రి కోమటిరెడ్డి మాత్రం 45 డివిజన్లు గెలిపించే బాధ్యత తీసుకున్నారు. అదే ధీమా తో ఎన్నికలకు ముందే మేయర్ను ప్రకటించడం జరిగింది. నామినేషన్ల హాడావిడి ముగిశాక మంత్రి పూర్తిగా నల్లగొండలోనే మకాం పెట్టనున్నారు. ఆయనే స్వయంగా అన్ని వార్డుల్లో పర్యటించి ప్రచారం చేయాలని నిర్ణయించారు.
సీఎం ఆదేశాలతో అప్రమత్తం
శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్లో మేయర్, చైర్మన్ అభ్యర్థులను ముందుగానే ప్రకటించొద్దనే మంత్రులకు, డీసీసీ అధ్యక్షులు, ఇంచార్జిలను ఆదేశించారు. సామాజిక సమీకరణాల ప్రకారం చైర్మన్లను ఎంపిక చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. దీంతో ఇప్పటికే చైర్మన్ పదవి కోసం పోటీ పడుతున్న మున్సిపాలిటీల్లో ఆశావహులు డైలామాలో పడ్డారు. కాంగ్రెస్ పార్టీ తరపున స్థానిక సంస్థల్లో 42 శాతం సీట్లు ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే, కానీ ఉమ్మడి జిల్లాలో మాత్రం ఎమ్మెల్యేలు జనరల్ సీట్లను రెడ్లు, వై శ్యులతో నింపేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. జనరల్ సీట్లలో బీసీ లు ఎన్నికల ఖర్చు భరించలేరని, అదే రెడ్డి, వైశ్య ఇతర అగ్ర కులాలను చైర్మన్గా ప్రకటిస్తే ఖర్చు అంతా వాళ్లే భరిస్తారనే ఉద్దేశంతో ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా హామీలు ఇస్తున్నారు.

మంత్రి కోమటిరెడ్డి బాటలోనే ఎమ్మెల్యేలు
నల్లగొండ మేయర్ అభ్యర్థిగా బుర్రి చైతన్యా రెడ్డి పేరు ప్రకటించడంతో ఎమ్మెల్యేలు సైతం అదే బాటలో చైర్మన్ అభ్యర్థుల పేర్లను ప్రచారంలో కి తెస్తున్నారు. మిర్యాలగూడ, హాలియా, భువనగిరి, చౌటుప్పుల్, పోచంపల్లి, నేరేడుచర్ల, తిరుమలగిరి, యాదగిరిగుట్ట, కోదాడ, సూ ర్యాపేట మున్సిపాలిటీల్లో రెడ్డి, వైశ్య, అగ్రకులాలకు చెందిన లీడర్లు చైర్మన్ పదవి ఆశిస్తున్నారు. మిర్యాలగూడ, చిట్యాల, హాలియా, భువనగిరి పట్టణాల్లో ఇప్పటికే రెడ్ల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అయితే ఏకంగా తన భార్య మాధవిని చైర్మన్ చేసేందుకు నామినేషన్ వేయించారు. ఎమ్మెల్యేల వైఖరి నచ్చని బీసీలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. చివరకు వైస్ చైర్మన్ పదవులు కూడా బీసీలకు దక్కకుండా కుట్ర చేస్తున్నారు. ఈ నేపథ్యం లో సీఎం చేసిన ప్రకటనతో ఎమ్మెల్యేలు కంగుతిన్నారు.

బీసీల్లో చిగురించిన ఆశలు
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో బీసీలో ఆశలు మళ్లీ చిగురించాయి. ఉమ్మడి జిల్లాలోని 19 మున్సిపాలిటీల్లో ఏడు సీట్లు జనరల్ కు, జనరల్ మహిళలకు ఏడు చైర్మన్ స్థానాలు రిజర్వు అయ్యాయి. బీసీ ల కు కేవలం మూడు మాత్రమే కేటాయించారు. 2020 ఎన్నికల్లో బీసీలకు ఏడు మున్సిపాలిటీల్లో దక్కితే ఈసారి మూడు చైర్మన్ లే మిగిలాయి. తాజాగా సీఎం ప్రకటనతో జనరల్, జనరల్ మహిళల కు రిజర్వు అయిన మున్సిపాలిటీల్లో బీసీలు హర్షం వ్యక్తం చేస్తు న్నారు. ఇప్పటికే నల్గొండ మేయర్గా బుర్రి చైతన్యా రెడ్డిని ప్రకటించిన సంగతి తెలిసిందే. డిప్యూటీ మేయర్ పదవి కూడా ఎస్సీ, లేదా మైనార్టీలకు ఇస్తామని చెప్పారు.
మంత్రి ఉత్తమ్ బీసీలకే మొగ్గు
సూర్యాపేట జిల్లా లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం కోదాడ చైర్మన్ బీసీలను చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. హుజూర్నగర్ బీసీలకే రిజర్వుకాగా, నేరేడుచర్ల జనరల్ కాగా, సూర్యాపేట , కోదాడ జనరల్ మహిళకు అయ్యింది. ఈ రెండు చోట్ల అగ్రకులాలు పోటీ పడుతున్నాయి. సూర్యాపేట వైశ్యులు, కోదాడ రెడ్డి వర్గం ఆశిస్తోంది, కానీ ఈ రెండు చోట్ల బీసీలకే ఇవ్వాలనే చర్చ జరుగుతోంది. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గత ఎన్నికల్లో సూర్యాపేట జనరల్ మహిళ స్థానంలో ఎస్సీని చైర్మన్ చేశారు. ఈ ఎన్నికల్లో బీసీ లేదా, వైశ్యులకు ఇవ్వాలని భావిస్తున్నారు.