Big News: గూడెంలో కాంగ్రెస్ ​లో ఎమ్మెల్యే బత్తుల ఫ్యామిలీ పాలి‘ట్రిక్స్’… చైర్మన్​ పదవి ఇస్తానని అనేక మందికి ఆఫర్లు?

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: మిర్యాలగూడెం మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించేందుకే ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తన కుటుంబ సభ్యులను పోటీలోకి దింపినట్లు పొలిటికల్ సర్కిల్లో ప్రచారం జరుగుతోంది. మాజీ చైర్మన్ తిరునగరు భార్గవ్ అడ్డు తొలగించుకునే క్రమంలో పార్టీలో చీలిక వస్తదని, దాంతో కౌన్సిల్లో మెజార్టీ రాకుండా పోతదనే భయంతోనే ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను రంగంలోకి దింపారనే టాక్ వినిపిస్తోంది. భార్గవ్తో కలిస్తే ఎన్నికల్లో 38 వార్డుల్లో పార్టీ అభ్యర్థులు గెలుస్తారని ఇంటిలిజెన్స్ రిపోర్ట్లు చెప్తున్నాయి. కానీ కాంగ్రెస్ లో భార్గవ్ ను అడ్డుతొలగించుకోవాలని ఎమ్మెల్యే మొదటి నుంచి ఎత్తులు వేస్తున్నారు.

ఈ ఎన్నికల్లో కుటుంబ సభ్యులు, సమీప బందువులు, ఎమ్మెల్యే అనుచరులకే మెజార్టీ టికెట్లు ఇవ్వాలన్నది ఎమ్మెల్యే ప్లాన్. అదే భార్గవ్తో చేతులు కలిపితే టికెట్లలో కోత పడుతుందని ఆయన్ని వ్యతిరేకిస్తున్నారు. దీనిలో భాగంగానే నామినేషన్ల చివరి గడువు వరకు భార్గవ్ వర్గానికి టికెట్లు ఇవ్వలేదు. పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు సమన్వయ కర్తగా వ్యవహరించిన ఎంపీ రఘువీర్ రెడ్డి చర్చలు కూడా ఫలించలేదు. సూర్యాపేట మున్సిపాలిటీలో తలెత్తిన గ్రూపు తగాదాలను పరిష్కరించిన ఎంపీ రఘువీర్కు మిర్యాలగూడ పెద్ద పరీక్షగా మారింది. చివరకు సీఎం రేవంత్ రెడ్డి శనివారం జూమ్ మీటింగ్లో వార్నింగ్ ఇవ్వడంతో మరోసారి రఘువీర్ రెడ్డి ఇరువర్గాలతో చర్చలు జరిపేందుకు సిద్ధమయ్యారు.

మున్సిపాలిటీలో 20 పైగా సీట్లు ఎమ్మెల్యే తన కుటుంబ సభ్యులకు, తను అనుచరులకు ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు. ఎప్పటి నుంచో పార్టీకోసం కష్టపడి పనిచేస్తున్న సీనియర్లను సైతం పక్కకు పెట్టి తన వర్గంతోనే మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకోవాలన్నది ఎత్తుగడ. ఎమ్మెల్యే అనుచరులు, కుటుంబ సభ్యులతో కలిపి 20 పైగా వార్డుల్లో గెలిపించుకునేందుకు ఎమ్మెల్యే పక్కాగా ప్లాన్ చేసినట్టు తెలిసింది. మెజార్టీ సరిపోని పక్షంలో ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎక్స్ ఆఫిషియో సభ్యుల ఓట్లతో పాలకవర్గాన్ని కైవసం చేసుకోవచ్చని ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే భార్య, ఇద్దరు కొడుకులు, సమీప బందువలతో నామినేషన్ వేయించారు.

ఎన్నికల ఖర్చు మీద పడకుండా, పార్టీలో ఓట్లు చీలిపోకుండా మరో స్కెచ్ వేశారు. రెడ్డి, వైశ్య కమ్యూనిటీలకు చెందిన ఐదారు మంది లీడర్ల కు చైర్మన్ పదవి ఆఫర్ చేశారు. చైర్మన్ పదవి హామీతోనే వేణు గోపాల్ రెడ్డి తన భార్య ఉద్యోగాన్ని రాజీనామా చేయించి పోటీలో నిలబెట్టారు. వైశ్య కమ్యూనిటీ నుంచి మిట్టపల్లి వెంకటేష్, గుడిపాటి నవీన్కు చైర్మన్ ఇస్తామని హామీ ఇచ్చారు. రెడ్డి వర్గం నుంచి ఇంకొంత మందికి ఆశ చూపెట్టారు. చివరకు ఎమ్మెల్యే భార్య, కొడుకు లు నామినేషన్ వేయడంతో అసలు ఎమ్మెల్యే ఉద్దేశం ఎంటన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదు.

గత మున్సిపల్ ఎన్నికల్లో సైతం ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, భార్య మాధవి కౌన్సిలర్లుగా పోటీ చేశారు. లక్ష్మారెడ్డి కౌన్సిలర్ గెలిచారు, కాని భార్య ఓడిపోయారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు లక్ష్మారెడ్డి కౌన్సిలర్ పదవికి రాజీనామా చేశారు. మళ్లీ ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే భార్య ఇద్దరు కొడుకులు, వరుసకు భామ్మర్ధితో నామినేషన్లు వేయించారు. ప్లాన్ ప్రకారం భార్యను చైర్మన్ చేస్తారా? లేదంటే భార్గవ్తో సంప్రదింపులు వర్కవుట్ అయితే వైశ్యులకే కేటాయిస్తారా? అన్నది తేలాల్సి ఉంది.

Share
Share