చేతులు కలిపిన కోమటిరెడ్డి, గుత్తా.. కార్పోరేషన్​ ఎన్నికల్లో ఒక్కటైన అగ్రనేతలు

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ కార్పోరేషన్ ఎన్నికలు జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని ఏకతాటి పైకి తెచ్చాయి. ఈ ఎన్నికల్లో మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి భార్య చైతన్యా రెడ్డిని మేయర్ అభ్యర్థిగా మంత్రి కోమటిరెడ్డి ప్రకటించారు. దాంతో పాటే 44 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వర్గీయులైన యామా దయాకర్, అయితగోని స్వామిగౌడ్లకు బెర్త్ కనఫర్మ్ చేశారు. గురువారం ప్రకటించే తుది జాబితాలో మైనార్టీ కోటా కింద బషీర్ పేరు వెల్లడి కానుంది. ఈ ముగ్గురికి టికెట్లు ఇప్పించేందుకు మండలి చైర్మన్ గుత్తా స్వయంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరడం జరిగింది. తన తండ్రి మాట నిలబెట్టినందుకు గాను గుత్తా తనయుడు అమిత్ రెడ్డి మంత్రికి ఫోన్ చేసి కృతజ్ఞతలు చెప్పారు.

ఇంకో విచిత్రకరమైన విషయం ఏమంటే గుత్తా అత్యంత సన్నిహితుడు తిప్పర్తి మాజీ జడ్పీటీసీ పాశంరామిరెడ్డి కార్పోరేషన్ ఎన్నికల్లో సమన్వయ కర్తగా వ్యవహారించడం విశేషం. మంత్రి కోమటిరెడ్డి ఆదేశాల మేరకు గత కొద్దిరోజుల నుంచి నల్లగొండలోనే మకాం పెట్టిన రామిరెడ్డి అభ్యర్థుల ఎంపికలో కీలకంగా వ్యవహారించారు. మంత్రి సూచన మేరకు అన్ని డివిజన్లలో సర్వేలు నిర్వహించి అభ్యర్థులను వడపోశారు. అంతకంటే జనరల్ వార్డుల్లో సైతం వేరొక వర్గానికి టికెట్లు ఇవ్వాలని భావించారు. కానీ దానివల్ల అభ్యర్థులు ఓడిపోయే ప్రమాదం ఉందని సర్వేలో తేలడంతో మంగళ, బుధవారాల్లో మంత్రి కోమటిరెడ్డి స్వయంగా అభ్యర్థులను పరిశీలించి ఫైనల్ చేశారు. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెగని కసరత్తు చేయగా, చివరికి 45 మంది అభ్యర్థుల జాబితా ఖరారు చేశారు. 

48 వార్డుల్లో 45 వార్డులు కైవసం చేసుకోవాలన్నది మంత్రి కోమటి రెడ్డి టార్గెట్ కాగా, సర్వేల్లో 35 వార్డులు పక్కా గెలుస్తామని తేలింది. తాజాగా మండలి చైర్మన్ గుత్తా తోడవడంతో కాంగ్రెస్ కేడర్లో జోష్ పెరిగింది. రెండు వేల కోట్లతో నల్లగొండను అభివృద్ధి చేస్తున్న మంత్రి ఈ ఎన్నికల్లో ఒంటి చేత్తే కార్పోరేషన్ కైవసం చేసుకోవాలని భావిస్తున్నారు. ఇప్పుడు గుత్తా కూడా చేతులు కలపడంతో నల్లగొండలో కాంగ్రెస్ సీట్లు మరింత పెరిగే అవకాశం ఉంది. వివిధ సామాజిక వర్గాల్లో గుత్తాకు ఉన్న పట్టు అభ్యర్థుల గెలుపుకు మరింత దోహద పడనుంది.

మొదటి నుంచి మేయర్ పదవి రేసులో ఉన్న గుమ్మల మోహన్ రెడ్డి చివరకు చల్లబడ్డారు. మంత్రి జోక్యం చేసుకుని సర్ధిచెప్పడంతో మోహన్ రెడ్డి వెనక్కి తగ్గారు. మేయర్ పదవి ఆశించడం లేదని, తన భార్య జానకి మాత్రం కార్పోరేటర్గా పోటీ చేయాలని కోరారు. మోహన్ రెడ్డి రాష్ట్ర స్థాయిలో కార్పోరేషన్ చైర్మన్, నుడా చైర్మన్ పదవి అబ్బగోని రమేష్ గౌడ్, ముస్లింలకు డెప్యూటీ మేయర్ పదవి ఇవ్వాలని తీర్మానించారు. దాదాపు సిట్టింగ్లకు అందరికీ కార్పోరేటర్ టికెట్లు కనఫర్మ్ చేశారు. గుమ్మల మోహన్ రెడ్డి భార్య జానకి 12 వార్డు నుంచి పోటీ చేయనున్నారు. మాజీ చైర్మన్ బొడ్డుపల్లి లక్ష్మీ 40 వార్డు, మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ భార్య కవిత 47 వార్డు, 28 వార్డు నుంచి దేవుని వెంకన్న భార్య గుండెబోయిన పుష్పలత నుంచి పోటీ చేయనున్నారు.

Share
Share