సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ రేసులో ప్రముఖ వైద్యురాలు: కాంగ్రెస్ హైకమాండ్ కొత్త వ్యూహం!

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సూర్యాపేట రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ గెలుపు గుర్రాల వేటలో ఉంది. ముఖ్యంగా ‘చైర్మన్’ స్థానం జనరల్ రిజర్వ్ అయిన తరుణంలో, సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని ఒక ప్రముఖ వ్యాపారవేత్త కోడలిని బరిలోకి దింపేందుకు సంప్రదింపులు జరుగుతున్నాయి.

రిజర్వేషన్ల ప్రకారం చైర్మన్ పదవి జనరల్ కు కేటాయించినప్పటికీ, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళను ఆ స్థానంలో కూర్చోబెట్టడం ద్వారా సామాజిక న్యాయం పాటించాలని కాంగ్రెస్ సీనియర్ నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలో సూర్యాపేటలో గుర్తింపు పొందిన ఒక ప్రముఖ మహిళా వైద్యురాలి పేరు ప్రధానంగా వినిపిస్తోంది.

సూర్యాపేటలోని ఒక ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడు, అగ్రకులానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ, ఈమెను ప్రేమ వివాహం చేసుకుని ఆదర్శంగా నిలిచారు. వృత్తిరీత్యా వైద్యురాలిగా ప్రజలకు సేవలందిస్తున్న ఆమెకు పట్టణంలో మంచి పేరుంది. విద్యావంతురాలు, సేవా దృక్పథం ఉన్న వ్యక్తిని చైర్మన్ అభ్యర్థిగా ప్రకటిస్తే పార్టీకి ప్రజల్లో విశేష ఆదరణ లభిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు కీలక నేతలు ఆ వ్యాపారవేత్త కుటుంబంతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఎన్నికల బరిలో నిలబడేందుకు సదరు కుటుంబం సుముఖత వ్యక్తం చేస్తే, సూర్యాపేట మున్సిపల్ రాజకీయం ఒక్కసారిగా మలుపు తిరిగే అవకాశం ఉంది. అధికారికంగా అభ్యర్థుల ఖరారు కావాల్సి ఉన్నప్పటికీ, ఈ వార్త ఇప్పుడు జిల్లా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.

Share
Share