Breaking News: అభివృద్ధి పనులు పూర్తి చేయలేకపోతే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను: ఎమ్మెల్యే బత్తుల

మిర్యాలగూడ, ఏపీబీ న్యూస్: మిర్యాలగూడ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిరంతరం శ్రమిస్తానని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (BLR) స్పష్టం చేశారు. సోమవారం మిర్యాలగూడలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన నియోజకవర్గ ప్రగతి నివేదికను వెల్లడించారు.

77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పేద ప్రజల ఆకలి తీర్చేందుకు ‘అన్నపూర్ణ అభయహస్తం’ పథకాన్ని ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సహకారంతో, మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణంలో కేవలం 5 రూపాయలకే భోజనం అందించే కేంద్రాన్ని అతిత్వరలో అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.

గత ఏడాది ప్రమాదవశాత్తు మరణించిన కాంగ్రెస్ కార్యకర్త భగవాన్ నాయక్ కుటుంబానికి తన వంతుగా రూ. 2 లక్షల ఆర్థిక సాయం అందించడంతో పాటు, నేడు ప్రభుత్వం ద్వారా 75 గజాల ఇంటి స్థలాన్ని మంజూరు చేయించినట్లు ఆయన వెల్లడించారు. పార్టీని నమ్ముకున్న ప్రతి కార్యకర్తకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లలో రొటేషన్ పద్ధతి వల్ల జనరల్ కేటగిరీకి కొంత అన్యాయం జరిగిందనే విమర్శలపై స్పందిస్తూ.. ఇది రాష్ట్రవ్యాప్త ప్రక్రియ అని, ఎవరికీ అన్యాయం జరగకుండా నామినేటెడ్ పదవుల్లో తగిన ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చారు. తాను అన్ని కులమతాలను సమానంగా గౌరవిస్తానని స్పష్టం చేశారు.

మిర్యాలగూడ పట్టణ సుందరీకరణ మరియు మౌలిక సదుపాయాల కోసం సుమారు రూ. 400 కోట్లతో పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు:

  • మంచినీరు & డ్రైనేజీ: రూ. 173 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రూ. 93 కోట్లతో తాగునీటి పైప్లైన్లు మరియు 11 నూతన వాటర్ ట్యాంకుల నిర్మాణం.
  • విద్య: రూ. 200 కోట్లతో ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్’ మంజూరు.
  • రవాణా: అద్దంకి-నార్కెట్పల్లి రహదారిపై ఫ్లైఓవర్ల నిర్మాణం (సాంకేతిక అడ్డంకులు తొలగించారు), శెట్టిపాలెం నుండి యాద్గారిపల్లి వరకు రూ. 70 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు.
  • వైద్యం: ఏరియా ఆసుపత్రిలో అదనంగా 100 పడకల భవనం, 5 కొత్త డయాలసిస్ మిషన్లు మరియు అధునాతన వైద్య పరికరాలు.
  • సుందరీకరణ: రూ. 14 కోట్లతో పెద్ద చెరువు, చిన్న చెరువుల అభివృద్ధి మరియు మినీ ట్యాంక్ బండ్గా మార్పు.
MLA Bathula Laxma Reddy Miryalaguda

“ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాను. నా పదవీకాలం పూర్తయ్యేలోపు ఈ అభివృద్ధి పనులు పూర్తి చేయలేకపోతే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను” అని బత్తుల లక్ష్మారెడ్డి సంచలన ప్రకటన చేశారు. సోషల్ మీడియా విమర్శలను సానుకూలంగా తీసుకుంటానని, ఎవరిపై కక్ష సాధింపులకు పాల్పడబోనని ఆయన తెలిపారు.

ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, డీఈ వెంకన్న, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Share
Share