- ఎప్పటిలాగే నెలకు రూ.30 కోట్ల సేల్స్
- టైమింగ్స్ మారిన తాగుబోతుల్లో నో చేంజ్
- నియోజకవర్గంలో 29 వైన్స్లు
- చండూరు, మునుగోడులోనే ఎమ్మెల్యే రూల్స్
- అన్ని చోట్ల వైన్స్లు, బెల్టుషాపులు ఓపెన్
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: మునుగోడు నియోజకవర్గంలో తాగుబోతులు తగ్గేదేలేదని స్పష్టం చేస్తున్నారు. మద్యం నియంత్రణ పైన ఎంతటి కట్టుదిట్టమైన ఆంక్షలు అమలు చేస్తున్నా తాగుబోతుల్లో మాత్రం మార్పు కనిపించట్లేదు. ఎప్పటిలాగే నెలకు రూ.30 కోట్లు లిక్కర్ తాగేస్తున్నారు. నెలకు 27 వేల కాటన్ల లిక్కర్, 4,92,000 బీరు సీసాలు (41 వేల కాటన్లు) ఖాళీ చేస్తున్నారు. అత్యంత వెనకబడ్డ ప్రాంతమైన మునుగోడు నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఆదర్శవంతగా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత మూడేళ్ల నుంచి శతవిధాల ప్రయత్నిస్తున్నారు.
ఇందులో భాగంగా వైన్స్లు మధ్యాహ్నాం 1గంట నుంచి, సిట్టింగ్ రూమ్లు సాయంత్రం 6 గంటల నుంచే తెరవాలని కండీషన్ పెట్టారు. ఈ ఏడాది నుంచి కొత్తగా ఏర్పాటైన షాపులను ఊరు చివరల్లోనే పెట్టాలనే కొత్త కండీషన్ అమల్లోకి తెచ్చారు. అంతేగాక గ్రామాల్లో బెల్టుషాపులు మూతపడేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. బెల్టుషాపుల తొలగింపుకు ప్రత్యేకంగా టీమ్లు ఏర్పాటు చేశారు. సాధారణంగా ఇంతటి కఠిన చర్యలు అమలు చేస్తున్న క్రమంలో ఆ ప్రభావం లిక్కర్ సేల్స్ పైన పడాలి, కానీ సేల్స్లో ఎలాంటి మార్పు కనిపించట్లేదు. ఉదయం నుంచి తాగకుండా ఓపిక పడుతున్న కస్టమర్లు షాపులు తెరవగానే ఒక్కసారిగా ఎగబడుతున్నారు. లేదంటే బెల్టుషాపుల వద్ద క్యూ కడుతున్నారు. అంతే తప్పా తాగుడు మాత్రం తగ్గడం లేదు.
ఎమ్మెల్యే రూల్స్ భేఖాతర్
ఎమ్మెల్యే రూల్స్ చండూరు, మునుగోడు మినహా, నాంపల్లి, మర్రిగూడ, నారాయాణ్పూర్, చౌటప్పుల్ మండలాల్లో అమలు కావడం లేదు. జాతీయ రహాదారి మీద ఉన్న చౌటుప్పుల్ మున్సిపాలిటీతో పాటు, పరిసర గ్రామాల్లో వైన్స్లు యధావిధిగా తెరుస్తున్నారు. దీంతో నారాయాణ్పూర్లో వ్యాపారులు సైతం ఎమ్మెల్యే రూల్స్కు వ్యతిరేకంగా ఎక్సైజ్ నిబంధనల మేరకు వైన్స్లు ఓపెన్ చేస్తున్నారు.
నెలకు రూ.30 కోట్లు సేల్స్
మునుగోడు నియోజకవర్గంలో 29 వైన్స్లు నడుస్తున్నాయి. గతేడాది జనవరి 1 నుంచి 24 వరకు లిక్కర్ 27,149 కాటన్లు అమ్ముడుగాకా, బీర్లు 49,885 కాటన్లు సేల్ అయ్యాయి. ఈ ఏడాది అదే రోజుల్లో లిక్కర్ 27,225 కాటన్లు అమ్ముడుకాగా, బీర్లు 41,724 కాటన్లు అమ్ముడయ్యాయి. గతేడాది 25 రోజుల్లో రూ.28.22 కోట్ల ఆదాయం వస్తే…ఈ ఏడాది అదే రోజుల్లో రూ.30.04 కోట్ల ఆదాయం వచ్చింది. బీర్లతో పోలిస్తే లిక్కర్ ఎక్కువ మొత్తంలో సేల్ అయ్యింది.
సర్కిళ్ల వారీగా లిక్కర్ సేల్స్
| సర్కిల్ పేరు | 2025 | 2026 | ||
| లిక్కర్ | బీర్లు | లిక్కర్ | బీర్లు | |
| చండూరు | 9,718 | 15,451 | 9,026 | 12,213 |
| నాంపల్లి | 7,255 | 12,289 | 6,036 | 11,155 |
| రామన్నపేట | 10,176 | 22,145 | 12,163 | 18,356 |