Breaking News: పాలకవర్గం రద్ధు దిశగా మధర్​ డెయిరీ

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహాకార సంఘం పాలకవర్గం రద్ధు అవుతుందా? అంటే తాజా పరిస్థితు లు పరిశీలిస్తే మాత్రం నిజమనే సమాధానమే వస్తోంది. అధికారిక వర్గాల సమాచారం మేరకు చైర్మన్ మందడి ప్రభాకర్రెడ్డి రాజీనామా చేయడం చూస్తే పాలకవర్గం రద్ధు అవుతుందనే ప్రచారం జరుగుతోంది. 15 రోజుల వ్యవధిలోనే ఇద్దరు చైర్మన్లు రాజీనామా చేయడంతో డెయిరీలో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. బటర్ (వెన్న) డిస్ట్రిబ్యూటర్తో జరిగిన ఒప్పందం మేరకు 12 కోట్లు డెయిరీ ఖాతాలో జమ చేయాలి, ఈనెల 8న ప్రభాకర్ రెడ్డి చైర్మన్గా ఎన్నిక కాగా అదే రోజున మూడు కోట్లు డెయిరీ ఖాతాలో జమ చేశారు. బ్యాలెన్స్ రూ.9 కోట్లు ఈ నెల 22న చెల్లించాలి, ఇచ్చిన గడువు రెండు రోజులు దాటిపోవడం, రైతుల నుంచి ఒత్తిళ్లు తీవ్రమైన నేపథ్యంలో ప్రభాకర్ రెడ్డి రాజీనామాకు పూనుకున్నారు. ఆయన రాజీనామాను అధికారికంగా ఆమోదించాల్సి ఉంది. బోర్డు మీటింగ్ పెట్టి అందరి ఆమోదం మేరకు చైర్మన్ రాజీనామా ఆమోదించాలి. దీని కోసం ఫిబ్రవరి 2న బోర్డుమీటింగ్ జరగనుంది. ఈమేరకు అధికారులు డైరక్టర్ల కు నోటీసులు జారీ చేస్తున్నారు.

15 మంది డైరక్టర్లలో 10 మంది కచ్చితంగా మీటింగ్కు హాజరుకావాలి. 9 మంది హాజరైతే మీటింగ్ మరోసారి వాయిదా వేయోచ్చు. అప్పటికీ కోరం నిండకపోతే పాలకవర్గాన్ని రద్ధు చేస్తారు. డీసీఓ ఆధ్వర్యంలో అడహక్ కమిటీ నియమిస్తారు. డెయిరీలో సభ్యులుగా ఉన్న సొసైటీ చైర్మన్లను ఆహ్వానించి మీటింగ్ పెడ్తారు. వాళ్లలో ఐదు నుంచి 15 మంది సభ్యులను అడ్మినిస్ట్రేటర్లుగా డీసీఓ నియమిస్తారు. వాళ్లకు అధికారికంగా ఎలాంటి పవర్స్ ఉండవు, కానీ నిర్ధిష్ట వ్యవధిలో మళ్లీ డెయిరీ ఎన్నికలు నిర్వహించాలని డీసీఓ నోటీసులు జారీ చేస్తారు. 

మధర్ డెయిరీ చైర్మన్ పదవి కోసం పోటీపడ్డ హేమాహేమీ డైరక్టర్లు ఇప్పుడు చైర్మన్ పదవి అంటేనే షాక్కు గురివుతున్నారు. ఫిబ్రవరి 2న జరిగే బోర్డు మీటింగ్కు దూరంగా ఉండాలనే నిర్ణయానికి డైరక్టర్లు వచ్చినట్టు తెలిసింది. ఒకవేళ కోరం సరిపడా డైరక్టర్లు వచ్చినప్పటికీ చైర్మన్ పదవి తీసుకునే ఉద్ధేశం ఎవరికీ లేదని అంటున్నారు. తాజా గణాంకాల ప్రకారం డెయిరీ రూ.76 కోట్ల నష్టాల్లో మునిగిపోవడమే డెయిరీకి పెద్ద గుదిబండలా మారింది. బ్యాంకులకు ఇవ్వాల్సిన అప్పు రూ.28 కోట్లు, రైతుల పాల బిల్లులు రూ.28 కోట్లు, ఉద్యోగుల జీతాలు రూ.4కోట్లు, ఫర్మ్లకు చెల్లించాల్సింది రూ. 4 కోట్లు, రైతుల వాటాధనం రూ.12 కోట్లు. బ్యాంకు అప్పు 28 కోట్లలో ఫిబ్రవరి 1 వరకు పది కోట్లు చెల్లించాలని కండీషన్ పెట్టారు, లేదంటే ఆస్తులు జప్తు చేస్తామని హెచ్చరించారు. ఇక వచ్చే నెల ఉద్యోగుల జీతాలు కష్టమే. ప్రస్తుతం డెయిరీలో పాలు రావడం బంద్ అయ్యింది. దీంతో ఉత్పత్తి కూడా నిలిపేశారని తెలిసింది. మరో గత్యంతరం లేక వచ్చేనెల ఉద్యోగుల జీతాల్లో 30 శాతం కోత పెడ్తామని చెప్పేశారు. పాల బిల్లుల కోసం సొసైటీ చైర్మన్లు ఆందోళన చేస్తున్నారు.

డెయిరీని కాపాడేందుకు ముందస్తుగా రూ.3కోట్లు చెల్లించిన వెన్న డిస్ట్రిబ్యూటర్ రెండో విడత రూ.9కోట్లు ఎందుకు చెల్లించలేదనేది పెద్ద సస్పెన్స్గా మారింది. దీని వెనక రాజకీయ కోణం ఏమైనా ఉందా అనేది ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఒప్పందం మేరకు రెండో విడత రూ.9కోట్లు చెల్లిస్తే ఆ మొత్తాన్ని బ్యాంకు అప్పులకు చెల్లించాల్సివస్తది, అదే జరిగితే రైతుల బిల్లులు, ఉద్యోగుల జీతాల సమస్యలు మళ్లీ మొదటికొస్తుంది. ఇదంతా ముందే తెలిసిన మధుసూధన్ రెడ్డి చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. వెన్న డిస్ట్రిబ్యూటర్ హామీతో చైర్మన్ పదవి చేపట్టిన ప్రభాకర్ రెడ్డి 15 రోజుల్లోనే జారుకున్నారు. ఈ తంతంగం వెనక రాజకీయ ఒత్తిళ్లు కూడా ఉండొచ్చనే అనుమానాలు తలెత్తున్నాయి. ఈ సమస్య నుంచి గట్టేక్కేందుకు మాజీ చైర్మన్ గుత్తా జితేందర్ రెడ్డి రంగంలోకి దిగినట్టు తెలిసింది. సుధీర్ఘకాలం పాటు చైర్మన్గా చేసిన జితేందర్ రెడ్డి రాక పైనే చర్చ జరుగుతోంది.

Share
Share