రాజగోపాల్ ఇలాకాలో హింసాత్మకంగా మారుతున్న లిక్కర్​ బిజినెస్

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి, ఎక్సైజ్ శాఖకు మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. శుక్రవారం సంస్థాన్ నారాయాణ్ పూర్ మండలంలో జరిగిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఉదయం 10 గంటలకు వైన్స్లు ఓపెన్ చేస్తామని వ్యాపారులు, వద్దు.. మధ్యాహ్నాం 1 గంట తర్వాతే షాపులు ఓపెన్ చేయాలని ఎమ్మెల్యే మధ్య జరుగుతున్న చర్చలు హింసాత్మకంగా మారుతున్నాయి. ఎమ్మెల్యే చర్యలకు నిరసనగా నారాయాణ్పూర్ వ్యాపారులు మూడు రోజుల పాటు వైన్స్లు బంద్ చేశారు. ఎమ్మెల్యేను అడ్డంపెట్టుకుని స్థానిక నాయకులు షాపుల తెరవకుండా, దాడులకు పాల్పడుతున్నారని, బిజినెస్ అడ్డుకుంటున్నారని ఎక్సైజ్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. దీంతో కమిషనర్ ఆదేశాల మేరకు రామన్నపేట ఎక్సైజ్ పోలీసులు శుక్రవారం ఉదయం 10 గంటలకు నారాయాణ్పూర్ చేరుకుని షాపుల వద్ద పహారా కాసారు. వ్యాపారులు యధావిధిగా షాపులు ఓపెన్ చేశారు. దీంతో స్థానిక సర్పంచ్, మరి కొంత మంది నాయకులు ఏకమై షాపుల వద్ద గొడవకు దిగారు.

wine shop close

ఎమ్మెల్యే ఆదేశాలమేరకు షాపులు బంద్ చేయాలని, లేదంటే మహిళల తో ధర్నాలు చేయిస్తామని హెచ్చరించారు. నారాయాణ్ పూర్లో గొడవ జరుగుతున్న సమాచారం చౌటుప్పుల్, సర్వేల్లోని వ్యాపారులకు తెలియడంతో వెంటనే క్లోజ్ చేశారు. లైసెన్స్ రూల్స్ ప్రకారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు షాపులు, సిట్టింగ్ రూమ్లు నడవాలి, కానీ ఎమ్మెల్యే 1గంట నుంచి వైన్స్లు, సాయంత్రం 6 గంటల నుంచి సిట్టింగ్ రూమ్లు ఓపెన్ చేయాలని కండీషన్ పెట్టారు. డిసెంబర్ 1 నుంచి కొత్త షాపులు ప్రారంభం కాగా, అంతకు నెల రోజుల ముందు నుంచే ఎమ్మెల్యే తన రూల్స్ గురించి వ్యాపారులకు ఖరాఖండిగా చెప్పారు. మధ్యలో పంచాయతీ ఎన్నికలు రావడంతో అంతగా పట్టించుకోలేదు. ఇటీవల నారాయాణ్పూర్ మండలంలో పర్యటించిన రాజగోపాల్ రెడ్డికి ఉదయం 10గంటలకే షాపులు తెరిచి ఉండటం గమనించి ఎక్సైజ్ ఆఫీసర్లను మందలించారు, కానీ నారాయాణ పూర్ వ్యాపారులు అవేమీ పట్టించుకోకుండా యధావిధిగా షాపులు తెరుస్తుండటంతో గురువారం సర్పంచ్, మరి కొంత మంది కలిసి వ్యాపారులతో గొడవకు దిగడంతో వ్యవహారం రచ్చకెక్కింది.

ఎమ్మెల్యేలకు, వ్యాపారులకు మధ్య ఎక్సైజ్ శాఖ బద్నాం అవుతోంది. రూల్స్ ప్రకారం షాపులు బంద్ చేయడానికి వీల్లేదు. టైం ప్రకారం షాపులు తెరవకుంటే కేసులు పెట్టొచ్చు. కొన్ని సందర్బాల్లో లైసెన్స్లు కూడా రద్దుచేసే అధికారం ఉంది. కస్టమర్లు ఎవరైనా షాపులు తెరవడం లేదని, లిక్కర్ అమ్మట్లేదని కమిషనర్కు ఫిర్యాదు చేసిన పక్షంలో నేరుగా స్టేట్ టాస్క్ఫోర్స్ రంగంలోకి దిగితే పరిస్థితులు మరింత అదుపు తప్పే ప్రమాదం ఉంది. ఎక్సైజ్ పోలీసుల పైన ఎమ్మెల్యే ఒత్తిళ్లు తీవ్రమైన నేపథ్యంలో వ్యాపారులు గత్యంతరం లేక కమిషనర్కు ఫిర్యాదు చేశారు. దీంతో వ్యాపారులకు, స్థానిక లీడర్ల కు మధ్య అల్లర్లు జరుగుతున్నాయి. గ్రామాల్లో శాంతి భద్రతలకు భంగం వాటిల్లుతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని వ్యాపారులు, స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. షాపుల వద్ద జరిగే అల్లర్లను కట్టడి చేసే అధికారం సివిల్ పోలీసులకు మాత్రమే ఉంటుంది. ఎక్సైజ్శాఖకు లా అండ్ ఆర్డర్లో తలదూర్చే పవర్స్ లేవు.

Liquor shop timing controversy

ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కండీషన్లు కేవలం చండూరు, మునుగోడు మండలాల్లో మాత్రమే అమలవుతున్నాయి. చండూరులో బార్ అండ్ రెస్టారెంట్ యధావిధిగా ఉదయం 10 గంటలకే తెరుస్తున్నారు. నాంపల్లి, మర్రిగూడ, చౌటుప్పుల్, సర్వేల్, దండుమల్కా పురం, కొయ్యలగూడెం, లింగోజిగూడెం, నేలపట్లలో షాపులు ఉదయం 10 గంటలకే తెరుస్తున్నారు. దీంతో నారాయాణ్పూర్ మండలంలో కూడా అదే టైమింగ్స్ పాటిస్తున్నారు. కానీ కొత్తగా ఎన్నికైన సర్పంచ్, స్థానిక లీడర్లు అభ్యంతరం చెపుతున్నారు. ఇదే మండలంలో బెల్టుషాపులు కూడా నడుస్తున్నాయి. గ్రామాల్లో బెల్టు షాపు లు బంద్ చేయాలన్నదే ఎమ్మెల్యే లక్ష్యం. కానీ అక్రమంగా షాపుల నుంచి గ్రామాలకు లిక్కర్ రవాణా జరుగుతోంది. బెల్టుషాపుల దందా యధావిధిగా నడుస్తోంది. బెల్టు షాపులు బంద్ చేస్తే స్వయం ఉపాధి కల్పిస్తానని ఎమ్మెల్యే ఇచ్చిన హామీ నెరవేరకపోవడంతో మళ్లీ బెల్టుషాపుల తెరుచుకున్నాయి.

Share
Share