- జిల్లా అధ్యక్షుడి వర్షిత్తో గొడవ జరిగిన నాటి నుంచి పార్టీ కార్యక్రమాలకు, ఆఫీస్కు దూరం
- త్రిమాన్ కమిటీ విచారణ పూర్తియిన తేలని దోషులు
- నల్లగొండ మేయర్ పదవి పైన గురిపెట్టిన సీనియర్లు
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: బీజేపీ సీనియర్ నేత పిల్లి రామరాజు యాదవ్ ఇంతకు పార్టీలో ఉన్నట్టా..? లేనట్టా..? ఎవరికీ అంతుచిక్కడం లేదు. జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి, రామరాజు మధ్య గొడవ జరిగి నెల రోజులు కావొస్తోంది. మరోవైపు నల్లగొండలో మేయర్ ఎన్నికల సందడి మొదలైంది, కానీ ఇప్పటి వరకు బీసీ నేత రామరాజు పైన జరిగిన దాడికి బాధ్యులైన దోషులు ఎవరో అనేది పార్టీ చెప్పలేదు. త్రిమాన్ కమిటీ విచారణ జరిగి కూడా 20 రోజులు దాటింది, కానీ ఎవరి పైన ఎలాంటి చర్యలు లేవు. పైగా గొడవ జరిగిన నాటి నుంచి రామరాజు యాదవ్ పార్టీ కార్యక్రమాలకు, జిల్లా ఆఫీస్కు దూరంగా ఉంటున్నారు. ఏదైనా కార్యక్రమం జరిగినా కింది కార్యకర్తలతో రామరాజుకు సమాచారం ఇస్తున్నారే తప్పా జిల్లా బాధ్యుల నుంచి అధికారికంగా ఎలాంటి సమాచారం అందడం లేదు.

మేయర్ పదవి జనరల్ మహిళకు రిజర్వు అయిన క్రమంలో బీసీ నేతలు శ్రీనివాస్ గౌడ్ భార్యను రంగంలోకి దింపాలని భావిస్తున్నారు. అదేక్రమంలో రామరాజు భార్య సత్యవతి కూడా పోటీకి సిద్ధమయ్యారు. ఇంకోవైపు బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకునేదాని పైన పార్టీలో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి చేరికలు మొదలయ్యాయి. సీనియర్లు బండారు ప్రసాద్, వీరెల్లి చంద్రశేఖర్, గోలి మధుసూధన్ రెడ్డి తదితరులు ఏకతాటిపైకొచ్చారు. ఎన్నికల సమయంలో రామరాజును దూరం చేసుకోవడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుందనే అభిప్రాయం బీసీ లీడర్లు వ్యక్తం చేస్తున్నారు.
బుధవారం నల్లగొండలోని 37వ వార్డు నుంచి రామగిరి అఖిల్ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన భారీ ఎత్తున యువత భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి సీనియర్లు హాజరయ్యారు.