నా ఒక్క రాజీనామాతోనే మునుగోడు అభివృద్ధి: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మునుగోడు, ఏపీబీ న్యూస్: మునుగోడు నియోజకవర్గ అభివృద్ధే తన తొలి ప్రాధాన్యత అని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. చండూరు మున్సిపాలిటీలో రూ.30 కోట్ల వ్యయంతో చేపట్టిన ప్రధాన రహదారి (సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులు)తో పాటు సెంట్రల్ లైటింగ్ అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు.

గత ప్రభుత్వ హయాంలో పదవిలో ఉండి పోరాడినప్పటికీ అభివృద్ధికి తగిన నిధులు రాలేదని తెలిపారు. అయితే తన ఒక్క రాజీనామాతోనే ప్రభుత్వం మునుగోడు ప్రజల సమస్యలపై దృష్టి సారించిందని అన్నారు. చండూరులో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ తన రాజీనామా ఫలితమేనని వ్యాఖ్యానించారు.

మునుగోడు ప్రజలు తనపై విశ్వాసంతో గెలిపించారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే తన లక్ష్యమని చెప్పారు. 2018లో మొదటిసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన నాటి నుంచి నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నానని పేర్కొన్నారు. మునుగోడు ప్రజలతో తనకు అవినాభావ సంబంధం ఉందని అన్నారు.

చండూరు చరిత్రలో నిలిచిపోయేలా ఈ రహదారి అభివృద్ధి జరిగిందని, త్వరలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం కూడా చేపడతామని హామీ ఇచ్చారు. చండూరు మున్సిపాలిటీలో ఇంకా విస్తృత అభివృద్ధి అవసరం ఉందని, మిగిలిన మూడు సంవత్సరాల కాలంలో హైదరాబాద్ తరహాలో మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తానని వెల్లడించారు.

కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించేందుకు నిధుల కొరత ఉన్నప్పటికీ, మునుగోడు అభివృద్ధికి అవసరమైన నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రిని కోరినట్లు తెలిపారు. తనకు పదవిపై ఆసక్తి లేదని, ఈ ప్రాంత అభివృద్ధి కోసమే అహర్నిశలు శ్రమిస్తానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.

Share
Share