- నల్గొండ పట్టణ అభివృద్ధి కోసం సుమారు 2,000 కోట్లు ఖర్చు చేశా.
- అవసరమైతే మరో 2,000 కోట్లు తెచ్చేందుకు సిద్ధం: రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రాఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
నల్గొండ, ఏపీబీ న్యూస్: నల్గొండ మున్సిపాలిటీ నగరపాలక సంస్థగా మారినందున నల్గొండను సూపర్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడమే తన ధ్యేయమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. శనివారం ఆయన నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ లో సుమారు 18.7 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో మంత్రి మాట్లాడుతూ నల్గొండ పట్టణాభివృద్ధికి ఇప్పటివరకే సుమారు రెండువేల కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు.
అమృత్-2 కింద 216 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, నూతన ఎస్ టి పి నిర్మాణ పనులు జరుగుతున్నాయని ,అలాగే 56 కోట్ల 75 లక్షలతో మంచినీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరిచేందుకు కొత్తగా 12 ట్యాంకులు , తాగునీటి పైప్ లైన్ పనులు నిర్మాణంలో ఉన్నాయని, 53 కోట్ల టి యు ఎఫ్ ఐ డి సి నిధులతో అంతర్గత రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయని, 109 కోట్ల రూపాయలతో ఎస్ డిఎఫ్ నిధులతో వరద కాలువల నిర్మాణం, స్మశాన వాటికల అభివృద్ధి పనులు, అంతర్గత రహదారుల పనులు కొనసాగుతున్నాయని, మరో 14 కోట్ల టి యు ఎఫ్ ఐ డి సి నిధులతో బస్టాండ్ నుండి మేకల అభినవ్ అవుట్డోర్ స్టేడియం వరకు బిటి రోడ్డు పనులు జరుగుతున్నాయని, 18 కోట్ల టీయూఎఫ్ ఐ డి సి నిధులతో డిఈఓ ఆఫీస్ నుంచి మిర్యాలగూడ రోడ్డు వరకు, 545 కోట్లతో బైపాస్, 565 పానగల్ ఛాయ సోమేశ్వర దేవాలయం నుండి ఎస్ ఎల్ బి సి కాలనీ వరకు రోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నట్లు తెలిపారు.
260 కోట్ల ఆర్ అండ్ బి నిధులతో ఎస్ఎల్బీసీ మెడికల్ కాలేజ్ నుండి అద్దంకి రోడ్డు వరకు రోడ్డు నిర్మాణం చేపట్టామని, అలాగే పట్టణంలో ఐదు సబ్ స్టేషన్లు మంజూరు చేయించడం జరిగిందని, ఇటీవల నాలుగు సబ్ స్టేషన్ ల శంకుస్థాపన చేసుకున్నామని తెలిపారు. నల్గొండ నుండి మునుగోడు రోడ్డు, ధర్వేశిపురం రోడ్డు, ముశ్రం పల్లి రోడ్డు డబుల్ రోడ్ 100 కోట్ల రూపాయలతో పనులు 70 శాతం పూర్తి చేయడం జరిగిందని, నల్గొండ నుండి గుండపల్లి, కురంపల్లి వరకు 60 కోట్ల రూపాయల రోడ్డు పనులు 70% పూర్తయిందని చెప్పారు. 25 కోట్ల నాక్ బిల్డింగ్ 90% పూర్తి చేయడం జరిగిందని, 40 కోట్లతో నర్సింగ్ కాలేజీ శంకుస్థాపన చేశామని, సంవత్సర కాలంలోనే క్రిటికల్ కేర్ సెంటర్ ప్రారంభించామని, 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల పనులు ఎస్ ఎల్ బి సి వద్ద పురోగతిలో ఉన్నాయని, 250 కోట్ల రూపాయలతో మహాత్మా గాంధీ యూనివర్సిటీలో కొత్త బిల్డింగ్ లతోపాటు, కొత్త కోర్సులు బి ఫార్మసీ ,ఎల్ఎల్బి తీసుకువచ్చామని, యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు సెట్విన్ స్థాపించామని ,24 గంటలు నల్గొండ కార్పొరేషన్ లో ప్రతిరోజు కృష్ణా నీటిని సరఫరా చేసేందుకు 125 కోట్ల రూపాయల డి పి ఆర్ తో ప్రభుత్వ మంజూరుకు పంపించామని, అలాగే 140 కోట్ల రూపాయలతో లతీఫ్ సబ్ దర్గా, బ్రహ్మంగారి గుట్టకు ఘాట్ రోడ్ మంజూరు చేసి పనులు కొనసాగుతున్నాయని, మార్చి లోపు ఈ. పనులు పూర్తవుతాయని తెలిపారు.

నాలుగు కోట్ల ఎన్సిఏపీ నిధులతో పట్టణంలో పార్కుల అభివృద్ధి, మీడియన్ ల అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని, కోటి 43 లక్షలతో మాన్యం చెల్క అర్బన్ ప్రైమరీ సెంటర్ కు నూతన భవనం నిర్మిస్తున్నామని, పట్టణ ప్రజలకు పరిశుభ్రమైన ఆహారం అందించేందుకు కోటి రూపాయలతో ఎన్ హెచ్ ఎం నిధులతో ఫుడ్ స్ట్రీట్ అభివృద్ధి చేయడం జరిగిందని, మున్సిపాలిటీలోని సాధారణ నిధుల ద్వారా 55 కోట్లతో వివిధ పనులు చేసామని, 15వ ఆర్థిక సంఘం కింద రెండు కోట్ల 24 లక్షలతో మున్సిపాలిటీకి అవసరమైన జెసిబిలు, ట్రాక్టర్లు కొనుగోలు చేశామని, కోటి 30 లక్షల సబ్ ప్లాన్ ద్వారా పట్టణంలో 16 వార్డులలో పనులు మొదలుపెట్టామని, ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఐదు కోట్ల రూపాయలతో లాప్రోస్కోపిక్, చిన్నపిల్లల వర్మర్ కోసం వసతులు కల్పించామని, ప్రతీక్ ఫౌండేషన్ సహకారంతో 10 కోట్ల రూపాయలతో బొట్టు గూడా ప్రైమరీ పాఠశాలను, హైస్కూల్ను ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో డిజిటల్ క్లాస్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
నల్గొండ మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ అయినందున కేంద్రం ద్వారా నేరుగా నిధులు వచ్చేందుకు అవకాశం ఉందని, అందువల్ల పట్టణ ప్రజలు సామరస్యంతో పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు. నల్గొండ పట్టణాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేలన్నదే తన ధ్యేయమని, హైదరాబాద్ కు సమాంతరంగా నల్గొండను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని, ఎస్ ఎల్ బి సి టన్నెల్ ను పూర్తి చేస్తామని మంత్రి వెల్లడించారు.
ఈ సందర్భంగా మంత్రి పట్టణంలోని వీటి కాలనీ, చింతల్ పార్క్, దేవరకొండ రోడ్డు, సావర్కర్ నగర్, పాలిటెక్నిక్, తదితర ప్రాంతాలలో 18 కోట్ల 70 లక్షలతో చేపట్టనున్న పార్కులు, రహదారులు, బిటి రోడ్లు, స్ట్రామ్ వాటర్ డ్రైన్లు, తాగునీటి సరఫరా తదితర పనులకు శంకుస్థాపనలు చేశారు.
జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ మొదటిసారిగా కార్పొరేషన్ అయిన నల్గొండ పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉందని అన్నారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్, ఆర్డిఓ వై. అశోక్ రెడ్డి, ప్రజారోగ్య సంస్థ సూపరింటిండెంట్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు హఫీజ్ ఖాన్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి గుమ్మల మోహన్ రెడ్డి ,మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్, తహసిల్దార్ పరుశురాం, ఇతర అధికారులు ,ప్రజా ప్రతినిధులు మంత్రి వెంట ఉన్నారు.