- సిట్ దర్యాప్తుతో బయట పడనున్న అసలు సూత్రదారులు
- ప్రతిపక్ష పార్టీ నేతల ఆరోపణల పైన సర్కార్ సీరియస్
- మంత్రుల్లో ఎవరో కోమటిరెడ్డిని ఇరికించారని ప్రచారం
- ఆయన ఇమేజ్ను బద్నాం చేయాలని కుట్ర
- విషం ఇచ్చి చంపమని చేసిన వ్యాఖ్యల పైన కేడర్‌లో కలవరం
- మున్సిపోల్స్‌లో అస్త్రంగా వాడుకునేందుకు ప్రత్యర్థుల ప్లాన్
- నేడు నల్లగొండలో మంత్రి పర్యటన
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఓ మహిళా ఐఏఎస్ అధికారి వ్యక్తిత్వాలను కించపరుస్తూ ఎన్టీవీ(Ntv)తో పాటు, ఓ పార్టీ అధికారిక ఛానల్, యూట్యూబ్, సోషల్ మీడియా ఛానల్స్ లో వైరల్ అయిన కథనం పైన ప్రభుత్వం సీరియస్గా స్పందించింది. ఈ కథనం వెనక అసలు సూత్రదారులను కనిపెట్టేందుకు రంగంలోకి దిగిన సిట్ ధర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఎన్టీవీ(Ntv) ప్రతినిధులను అరెస్ట్ చేసిన సిట్ అధికారులు, ఈ కథనం వెనక ఉన్న లోగుట్టును కనిపెట్టేందుకు మరింత లోతుగా విచారణ జరుపుతోంది. రాష్ట్రంలో కోమటిరెడ్డి బ్రదర్స్కు ఉన్న ఇమేజ్ను బద్నాం చేసేందుకు ఎవరో తెరవెనక ఉండి కుట్రకు ప్లాన్ చేసినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ సంఘటన జరిగిన నాటి నుంచి తీవ్ర మనస్తాపానికి గురైన మంత్రి సంక్రాంతి సందర్భంగా నీలగిరి రామాలయం వేడుకలకు కూడా దూరంగానే ఉన్నారు. సీఎం కప్ ర్యాలీకి రమ్మని రిక్వెస్ట్ చేసినప్పటికీ విముఖత వ్యక్తం చేశారని తెలిసింది. అయితే దీన్నే అదునుగా భావిస్తున్న ప్రతిపక్ష పార్టీలు మంత్రి పైన వచ్చిన ఆరోపణలను ఎన్నికల అస్త్రంగా వాడుకునేందుకు ఎత్తులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం మంత్రి కోమటిరెడ్డి నల్లగొండ పర్యటన ఖరారైంది. పట్టణంలోని పలు వార్డుల్లో సుమారు రూ.20 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
పార్టీ కేడర్‌లో కలవరం
మంత్రి కోమటిరెడ్డి తన పైన వచ్చిన కామెంట్లకు తీవ్ర ఆవేధన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ‘నాపై కోపం ఉంటే ఇంత విషమిచ్చి చంపండి’అని చేసిన వ్యాఖ్యలు పార్టీ కేడర్ను తీవ్ర కలవరపాటుకు గురిచేశాయి. బ్రాండ్ ఇమేజ్ కలిగిన మంత్రి ఈ తరహా కామెంట్లు చేయడాన్ని జీర్ణించుకోలేకపోయారు. రాష్ట్రంలోని పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా ఎమ్మెల్యేలు మంత్రికి అండగా నిలబడ్డారు. నల్లగొండ నియోజకవర్గంలోని కేడర్ మాత్రం ఒకింత ఆందోళన చెందుతోంది. దీన్నే అదునుగా భావించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఇలాంటి ప్రచారం పట్ల మంత్రి జాగ్రత్తగా ఉండాల్సిందని సానుభూతి ప్రదర్శించడమేగాక, మరో అడుగు ముందుకేసి దీని వెనక అదృశ్య శక్తి ఉందని పరోక్షంగా సీఎం రేవంత్ పైన విమర్శలు చేశారు. దీన్ని తిప్పికొట్టేందుకే ఈ కేసును విచారించేందుకు ప్రభుత్వం సిట్ను రంగంలోకి దింపింది.
ఇంతకీ అసలు సూత్రదారులు ఎవరు?
ఈ కేసులో ఎన్టీవీ(Ntv) మేనేజ్మెంట్ను విచారించేందుకు సిట్ బృందం చర్యలు చేపట్టింది. అయితే రాజకీయ వర్గాల్లో మాత్రం అసలు మంత్రి కోమటిరెడ్డిని టార్గెట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బకొట్టడం వల్ల ప్రయోజనం ఎవరికి? ఎలాంటి ఆధారాలు లేకుండా మహిళా ఐఏఎస్, మంత్రిని ఇరికించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అనే కోణంలో సిట్ ధర్యాప్తు వేగవంతం చేసింది. మంత్రుల్లోనే ఎవరో కుట్ర పన్ని ఇదంతా చేశారని, కోమటిరెడ్డి ని ఇరికించి రాజకీయంగా తమ పబ్బం గడుపుకునేందుకే ఇదంతా చేసి ఉండొచ్చని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సుధీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన కోమటిరెడ్డి పైనే ఇలాంటి కుట్రలకు పాల్పడటం అంటే ఇటు ప్రభుత్వం, అటు పార్టీ ప్రతిష్ట దిగజారే ప్రమాదం ఉంది. అంతేగాక ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లతాయని భావించిన సీఎం రేవంత్ రెడ్డి సిట్ను రంగంలోకి దింపారు. దీని వెనక దాగివున్న అసలు సూత్రదారులను కనిపెట్టి, పార్టీ హైకమాండ్ ముందు దోషులుగా నిలబెడితే మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడేందుకు సాహాసించే ప్రయత్నం కూడా చేయరని అధికారిక విచారణకు ఆదేశించింది.
