- నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రి పోలీస్ అవుట్ పోస్ట్ కానిస్టేబుల్ పైన గుర్తు తెలియని దుండగులు దాడి
- రూ.3లక్షలు గుంజుకుని పరారైన దుండగులు
నల్లగొండ, ఏపీబీ న్యూస్: నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పోలీస్ అవుట్ పోస్ట్‌లో పనిచేస్తున్న రాజ్ కుమార్ అనే కానిస్టేబుల్ పైన గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. అతని వద్ద నుంచి రూ.3లక్షల నగదు లాక్కొని దుండగులు పరారైనట్టు రాజ్‌కుమార్ తెలిపారు. కొద్దిసేపటి క్రితం ఓ వ్యక్తి పోలీస్ అవుట్ పోస్ట్ దగ్గరికి వచ్చి రాజ్‌కుమార్‌ను ఫోటో తీస్తుండగా ఎందుకు నన్ను ఫోటో తీస్తున్నావ్ అని రాజ్‌కుమార్ అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఫోటో తీసిన వ్యక్తి వెంటనే అక్కడి నుంచి బైక్‌మీద పారిపోయి ఎఫ్‌సీఐ గోడౌన్ దగ్గర అతని అనుచరులతో రాజ్‌కుమార్ కోసం పాగా వేశారు.
అవుట్ పోస్ట్ నుంచి భోజనం చేసేందుకు వెళ్లేందుకు రాజకుమార్ ఎఫ్‌సీఐ గోడౌన్ వద్దకు చేరుకోగానే అక్కడే మకాం వేసిన 8 మంది దుండగులు ఒక్క సారిగా అతని పైన దాడి చేశారు. అతని చేతిలో ఉన్న రూ.3లక్షల నగదు లాక్కొని పారిపోయారని రాజ్ కుమార్ తెలిపారు. దెబ్బలు తిన్న రాజ్‌కుమార్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని వెంటనే అతను 100 డయల్‌కు కాల్ చేశారు. ఎస్పీ కి ఫోన్ ద్వారా సమచారం ఇవ్వడంలో పోలీసులు ఆసుపత్రికి చేరుకున్నారు. ఆ మూడు లక్షల రూపాయలు ఎక్కడివి? అతను ఎక్కడికి తీసుకెళ్తున్నాడు అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.