మిర్యాలగూడ బీఆర్​ఎస్​లో సిద్ధార్థ హీట్​! కాంగ్రెస్సే టార్గెట్ గా హాట్ కామెంట్లు

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: మిర్యాలగూడెం బీఆర్ఎస్లో నలమోతు సిద్ధార్ధ పొలిటికల్ హీట్ రాజేశారు. తన తండ్రి, మాజీ ఎమ్మెల్యే భాస్కర్రావు విదేశీ పర్యటనలో ఉండటంతో సిద్ధార్థ రాజకీయంగా అన్నీ తానై ముందుండి నడిపిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఝలక్ ఇచ్చిన సిద్దార్థ మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే దూకుడు ప్రదర్శిస్తున్నారు. పార్టీ సింబల్ మీద జరిగే ఎన్నికలు కావడంతో మిర్యాలగూడ బీఆర్ఎస్కు ప్రతిష్టాత్మకంగా మారింది. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మీద ఉన్న వ్యతిరేకత, ఆ పార్టీలో నెలకొన్న విభేదాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు సిద్ధార్థ గట్టిగానే పోరాడుతున్నారు. రూ.15 కోట్లకు మున్సిపల్ చైర్మన్ పదవి, వార్డు స్థానాలను హైదరాబాద్ కేంద్రంగా వేలం పాట జరిగిందని సంచలన కామెంట్స్ చేసిన సిద్ధార్థ తాజాగా ఇందిరమ్మ ఇళ్ల గురించి హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ కేడర్లో జోష్ నింపేందుకు సంచలనం కలిగించే వ్యాఖ్యలతో సోషల్మీడియా గ్రూపుల్లో వైరల్ అవుతున్న సిద్ధార్ధా మిర్యాలగూడలో వారసత్వ రాజకీయాన్ని సుస్థిరం చేసేందుకు స్థానిక ఎన్నికలనే చాలెంజ్గా తీసుకుని పనిచేస్తున్నట్టు దీన్ని బట్టి తెలుస్తోంది.

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ లబ్ధిపొందేందుకు ఇందిరమ్మ ఇళ్ల పేరుతో మరో మోసపూరిత కార్యక్రమానికి తెర తీశారని సిద్ధార్థ శుక్రవారం ఆరోపించారు. రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా ఇళ్లు, ఇంటి జాగలు ఇస్తామని పేద ప్రజల నుంచి ఆప్లికేషన్స్ సేకరిస్తున్నారు. ప్రభుత్వం నుంచి అధికార ప్రకటన లేనప్పటికీ ప్రజలను మోసం చేసేందుకు కొత్త ఎత్తుగడ వేశారని ఫైర్ అయ్యారు. ఆప్లికేషన్స్కు కేవలం రెండు రోజులే గడువు ఉందని, పండగ సెలవు దినాల్లో కుల, ఆదాయ సర్టిఫికెట్లు తెచ్చుకోమని చెప్పడం ఏంటనీ ప్రశ్నిస్తున్నారు. ఒక వేళ నిజంగానే ఆప్లికేషన్స్ తీసుకోవాల్సి వస్తే మున్సిపల్ ఆఫీసు, లేదంటే రెవిన్యూ ఆఫీసుల్లో తీసుకోవాలని, కానీ కాంగ్రెస్ నాయకుల ఇళ్ల వద్ద, పార్టీ ఆఫీసుల్లో దరఖాస్తులు ఇవ్వమని చెప్పడం వెనక రాజకీయ దురుద్దేశం తప్పా మరొకటి లేదని సిద్ధార్ధ ఆరోపించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో ఫేక్ ఫారాలు నింపించి ఎన్నికల తర్వాత ప్రజలను నట్టేట ముంచేందుకు కాంగ్రెస్ సిద్ధమైందని మండిపడ్డారు. ఇలాంటి హామీలను ప్రజలు నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు.

Share
Share