నేరేడుచర్ల, ఏపీబీ న్యూస్: ఈనెల 22, 23, 24న నిర్వహించే హజ్రత్ జాన్ పాక్ షహీద్ దర్గా ఉర్సు కు సంబంధించి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. పాలకీడు మండలం జానపాడు లో జరిగే ఉర్సు ముందస్తు ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులతో మంగళవారం జానపాడు లో కలెక్టర్ సమీక్షించారు. శూన్యపహాడ్ నుండి జానపాడు దర్గా వరకు రోడ్డు గుంటలతో ఉందని ఉత్సవాల్లోపు మరమ్మత్తులు చేపట్టాలని, గొల్లభామ గుట్ట వద్ద లైటింగ్ అలాగే దర్గా పరిసర ప్రాంతాలలో హైమాక్స్ లైట్లు ఏర్పాటు చేయాలని స్థానిక నేతలు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. కలెక్టర్ మాట్లాడుతూ మూడు రోజులు పాటు జరిగే ఉర్సు కు లక్షలలో భక్తులు తరలి వచ్చే అవకాశం ఉన్నందున అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని, భక్తులకు కనబడే విధంగా ధరల పట్టికను అన్నిచోట్ల ప్రదర్శించాలని వక్స్ బోర్డ్ అధికారులను ఆదేశించారు.

దర్గా పరిసర ప్రాంతాలలో రోడ్లు, కాలువలు పరిశుభ్రంగా ఉంచాలని ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు తొలగించాలని, రోడ్లు ఎక్కడైనా గుంటలు ఏర్పడితే వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని, అవసరం ఉన్న చోట అప్రోచ్ రోడ్లు నిర్మించాలని, తాగునీరు వసతి ఏర్పాటు చేయాలని చెప్పారు. అగ్నిమాపక సిబ్బంది అందుబాటులో ఉండాలని విద్యుత్తులో అంతరాయం లేకుండా సరఫరా చేయాలని, మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని, ముఖ్యమైన ప్రాంతాల నుండి ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.