- వచ్చే రెండేళ్లలో రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు రెండు దఫాలుగా అందిస్తాం
- సన్నబియ్యం స్కీం సీఎం, ఉత్తమ్ వల్లే సాధ్యమైంది
- లక్ష కోట్లతో వృథా చేసిన ప్రాజెక్టులను పునరుద్దరిస్తున్న ఘనత ఉత్తమ్‌కే దక్కింది: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
హుజూర్నగర్, ఏపీబీ న్యూస్: వచ్చే రెండేళ్లలో రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు రెండు దఫాలుగా అందిస్తామని హౌజింగ్, రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బుధవారం హుజూర్‌నగర్‌లో ఆయన మాట్లాడుతూ దేవాదాయ శాఖ భూమిని హౌసింగ్ శాఖా తో కొనుగోలు చేపించి ఇండ్ల నిర్మాణం చేపట్టడం నిజంగా ఇక్కడి పేదలకు వరం అని అన్నారు. ప్రభుత్వం మారిన తరువాత కుంటుపడిన ఈ ప్రాజెక్టు ను ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత యుద్ధ ప్రాతిపధికన మళ్ళీ పనులు మొదలు పెట్టి పూర్తి చేయడం కేవలం ఉత్తమ్‌తోనే సాధ్యమైందన్నారు.

మార్చి 31న ఇక్కడి ఇండ్లు పేదలకు, పార్టీలకు అతీతంగా పంపిణీ చేస్తామని తెలిపారు. రాష్ట వ్యాప్తంగా నీటి పారుదల శాఖ లో నాటి ప్రభుత్వం లక్ష కోట్లను వృథా చేసినప్పటికీ వాటిని ఇరిగేషన్ మంత్రిగా ఉత్తమ్ పునరుద్ధరిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ప్రతి పేదవాడు సన్న బియ్యంతో కడుపు నింపుకుంటున్నారంటే కేవలం ఉత్తమ్, సీఎం రేవంత్ ఆలోచనే కారణమని తెలిపారు. ప్రతి నియోజక వర్గంలో ఇప్పటికే 3,500 ఇందిరమ్మ ఇండ్లను అందించామని, నాడు బొమ్మలు చూపించి రెండు దఫాలు అధికారం చేపట్టిన కేసీఆర్ ఇండ్లు కడితే ఏమి వస్తుందని కమీషన్ల కోసం కూలిపోయిన కాళేశ్వరం కట్టారని అన్నారు. దొరల పరి పాలనకు పేద వాళ్ళ పరిపాలనకు చాలా తేడా ఉందని, వచ్చే రెండేళ్లలో రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు రెండు దఫాలుగా అందిస్తామని తెలిపారు.
